తిండి కోసం వెతుకులాట
సూపర్ మార్కెట్లలో ఖాళీ ర్యాక్స్
ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ క్షణాల్లో ఖాళీ
ఆన్ లైన్, ఈ–కామర్స్ సైట్లలోనూ ఔట్ ఆఫ్ స్టాక్
3 రోజులకోసారి స్లాట్లు కేటాయిస్తున్న సంస్థలు
సరకులు దొరక్క ఇక్కట్లు పడుతున్న జనం
హైదరాబాద్, వెలుగు: నిత్యావసర సరుకులు, కూరగాయలు ఆర్డర్ చేద్దామని ఓ ఆన్ లైన్ యాప్ తెరిచాడు సురేశ్. కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆర్డర్ చేద్దామంటే దాదాపు అన్నీ ‘నో స్టాక్’…
ఫ్రూట్స్, వెజిటెబుల్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుందామని సూపర్ మార్కెట్ కు వెళ్లాడు హరీశ్.. లోపలికి వెళ్లి చూస్తే ర్యాక్స్ అన్నీ ఖాళీ….
ఇంట్లో సరుకులు అయిపోవడంతో పక్క వీధిలోని కిరాణా షాపుకు వెళ్లాడు సతీశ్.. అవసరమైన అన్ని వస్తువులు అక్కడ లేవు.. ఉన్న వాటి ధర కూడా డబుల్…
హైదరాబాద్ తో సహా రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆన్ లైన్ లో ఔట్ ఆఫ్ స్టాక్.. మాల్స్లో ఖాళీ ర్యాక్స్… కిరాణా దుకాణాల్లో డబుల్ రేట్లు. దొరికేవి అరొకర.. అవి కూడా ఎక్కువ రేట్లు. నిత్యావసర సరుకుల కోసం వెతుకులాడాల్సిన వైనం. దీంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఒకవైపు లాక్డౌన్ వల్ల బయట తిరగలేక.. సరిపడా సరుకులు దొరక్క పాట్లు పడుతున్నారు.
సూపర్ మార్కెట్లు ఖాళీ
సరుకులకు సూపర్ మార్కెట్లపై ఆధారపడే వారికి.. కావాల్సినవన్నీ దొరకడం లేదు. పిండి, నూడిల్స్, పాప్‌కార్న్, పాస్తా.. స్నాక్స్, బిస్కెట్లు, చాకెట్లు.. ఉండే ర్యాక్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బిగ్ బజార్, రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, రత్నదీప్, ఉషోదయా వంటి స్టోర్స్‌లో ఇదే పరిస్థితి. ఇక్కడ అన్ని వస్తువులు అందుబాటులో ఉండడంలేదు. స్టాక్ అయిపోయిందంటే కొత్త స్టాక్ రావడం లేదు. ఇన్‌స్టంట్ ఫుడ్, స్టోర్డ్‌ఫుడ్ వంటివి వచ్చిన హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఈ-కామర్స్ యాప్స్ పరిస్థితీ అంతే
ఆన్‌లైన్ గ్రోసరీస్ స్టోర్లలో కూడా ‘నో స్టాక్ ’ ట్యాగ్‌లు దర్శనమిస్తున్నాయి. కొన్ని స్టోర్లలో జనానికి స్లాట్లు కూడా దొరకడం లేదు. కొన్ని స్టోర్లు వస్తువుల సంఖ్య, బిల్లింగ్‌పై కండీషన్లు విధిస్తున్నాయి. అనుకున్న సంఖ్యలో వస్తువులు బుక్ చేయకపోయినా, మరీ ఎక్కువ చేసినా ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. కొన్నిసార్లు బుకింగ్ మొత్తం చేసిన తర్వాత ఔట్ ఆఫ్ స్టాక్ అని మెసేజ్ వస్తోంది. మళ్లీ ఆర్డర్ బుక్ చేసుకోవాలంటే స్లాట్ కూడా దొరకని పరిస్థితి. కొన్ని స్టోర్లు మూడు రోజులకోసారి స్లాట్ కేటాయిస్తున్నాయి. ‘‘హైదరాబాద్‌లో రెండు ఈ–కామర్స్ కంపెనీలే గ్రోసరీస్‌ను
ఎక్కువగా హోం డెలివరీ చేస్తున్నాయి. ఒక సంస్థ కేవలం 13 ఐటమ్స్‌నే సెలెక్ట్ చేసుకోవాలని కండీషన్ పెట్టింది . ఆ 13 ఐటమ్స్‌లో ఒక్కటి లేకున్నా ఔట్ ఆఫ్ స్టాక్ అంటూ రిప్లయ్ ఇస్తోంది. ఇంకో సంస్థ అన్‌లిమిటెడ్ ఐటమ్స్‌ను సెలక్ట్ చేసుకోవడానికి చాన్స్ ఇస్తోంది. అయితే ఆ స్లాట్‌లో ఏ ఒక్క ఐటమ్ అందుబాటులో లేకున్నామొత్తం ఆర్డర్ నే క్యాన్సిల్ చేస్తున్నాయి. ఆయా యాప్స్‌లో మెంబర్షిప్ ఉన్నోళ్లకు మాత్రం అన్ని వస్తువుల స్టాక్‌ను డిస్‌ప్లే చేస్తూ.. మిగతా వారికి అన్ అవైలబుల్‌గా చూపిస్తున్నాయి” అని హైదరాబాద్ భరత్ నగర్ కు చెందిన విష్ణు చెప్పారు.
ఎక్కువకు అమ్మితే ఫోన్ చేయండి
నిత్యావసరాల ధరల పర్యవేక్షణ, ఫిర్యాదులకు పౌరసరఫరాల శాఖ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. ధరలు పెంచి అమ్మితే నేరుగా 040-23336116 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
అన్నీ పెరిగినయ్
పప్పు ఉప్పులు మొదలుకొని అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. చికెన్ కిలో రూ.160
నుంచి రూ.220కు పెరిగింది. మటన్ కిలో రూ.800 దాటింది. పోయిన నెలలో కిలో కంది పప్పు ధర రూ.85 నుంచి 90 వరకు
ఉంటే ఇప్పుడు 110 నుంచి 130కి పెరిగింది. ఆయిల్ ప్యాకెట్లు బ్రాండ్లను బట్టి 70 నుంచి రూ.110 వరకు ఉంటే.. ఇపుడు ఒక్కోదానిపై
20 పెరిగింది. దిగుమతులు లేకపోవడం వల్లే రేట్లు పెరుగుతున్నట్లు హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
మాకే ఎంఆర్పీకి ఇస్తున్నరు
హోల్సేల్లోనే ఎంఆర్పీకి ఇస్తున్నరు. మేం వాటిని ఎంఆర్పీ కంటే ఎక్కువకు అమ్మాలి. అర్థం చేసుకునే వారు తీసుకుంటున్నారు. కొంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పప్పులు, నూనె ధరలు చాలా వరకు పెరిగినయి. ఒక్కో దానిపై 15–20 శాతం వరకు ఎక్కువైనయ్.
– జగన్, కిరాణా షాపు, బోరబండ
ముందే కొనేసి పెట్టుకున్నాం..
లాక్ డౌన్ అనగానే నెలకు సరిపడా ముందే కొనేసి పెట్టుకున్నాం. ఎక్కువగా పాస్తా, మ్యాగీ, పిండి, ఈవినింగ్ స్నాక్స్ వంటివి తెచ్చుకున్నాం.
ఇప్పుడు అందరూ సరుకుల బాటే పట్టారు. ఆల్ రెడీ అయిపోయాయని కూడా చెబుతున్నారు.
– భాగ్య, హౌజ్ వైఫ్, ఫిలింనగర్