- వేస్టేజీని తగలబెడుతుండటంతో జనవాసాలను కమ్మేస్తున్న పొగ
- శ్వాసకోశ వ్యాధుల బారిన స్థానికులు
- మున్సిపాలిటీల్లో డంపింగ్‌యార్డులకు స్థలాలు కరువు
- బయోగ్యాస్ ప్లాంట్లకు ఏర్పాట్లలో అలసత్వం
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీల్లో డంపింగ్‌యార్డుల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనవాసాల సమీపంలోని డంపింగ్‌యార్డుల్లో పేరుకుపోతున్న చెత్తను సిబ్బంది కాలబెడుతుండడంతో దట్టమైన పొగ, ఘాటైన వాసనతో జనాలను ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్లాస్టిక్కవర్లు, బాటిళ్లు, రబ్బర్లు, ఇతర వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన రసాయనాలు విడుదలై గాలి పూర్తిగా కలుషితం అవుతోంది. ఈ పొగతో జనాలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.
రోడ్డు పక్కనే చెత్త కుప్పలు
జనావాసాల మధ్య ఉన్న డంపింగ్‌యార్డులను దూర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు చాలా కాలంగా పోరాడుతున్నా.. లీడర్లు, ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు. మరికొన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణానికి ఏండ్లు గడుస్తుండడంతో జనవాసాల మధ్య, రోడ్ల పక్కన చెత్త పడేస్తున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి, నస్పూర్, చెన్నూరు, లక్సెట్టిపేటలో శాశ్వత డంపింగ్‌యార్డులు లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బెల్లంపల్లి పట్టణంలోని బస్తీ పోచమ్మ చెరువు పరిసర ప్రాంతాలోని తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐటీడీఏ నర్సరీ మధ్యలోని డంపింగ్‌యార్డులో నుంచి నిత్యం వచ్చే పొగతో ప్రజలు సతమతమవుతున్నారు. రాత్రి అయ్యిందంటే దట్టమైన పొగ పట్టణంలోని గోల్‌బంగ్లా బస్తీ, బెల్లంపల్లి బస్తీ, నంబర్‌టూ ఇన్ క్లైన్బస్తీ, కాసిరెడ్డిపల్లి, బూడిదగడ్డ బస్తీ, కన్నాలబస్తీ, టేకులబస్తీని కమ్మేస్తోంది. చెత్త పోస్తున్న రోడ్డులో మండల పరిషత్ కార్యాలయం, గర్ల్స్ జూనియర్కాలేజ్, వెటర్నరీ ఆస్పత్రి, పోచమ్మ ఆలయం, ఐటీడీఏ ఉద్యానవనం, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, కేవీకే, సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల, కస్తుర్బా విద్యాలయం, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా మున్సిపల్ అధికారులు కనీస అవగాహన లేకుండా చెత్తను రోడ్డు పక్కనే కుప్పలుగా పోస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
స్టూడెంట్లకు అస్వస్థత
మంచిర్యాల మున్సిపాలిటీలోని అండాలమ్మ కాలనీలో ఉన్న తాత్కాలిక డంప్ యార్డును తరలించడంలో ఆఫీసర్లు జాప్యం చేస్తున్నారు. నివాస గృహాలకు సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌ను తరచూ కాలబెట్టడంతో పొగ వెలువడి సమీప కాలనీ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. డంపింగ్‌యార్డును తరలించాలని కాలనీ వాసులు అనేకసార్లు మున్సిపల్ వాహనాలను అడ్డుకున్నారు.
చెత్త కాల్చడంతో పొగ, దుర్వాసనతో క్వారీ రోడ్డులో ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు గత నెలలో అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఆ స్కూల్‌కు పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో హాస్టల్‌ను ఇటీవల హాజీపూర్ మండలంలోని ముల్కల్లకు తరలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో డంప్‌యార్డు నిర్మించేందుకు స్థలం లేదంటూ మున్సిపల్అధికారులు చెత్తను రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్‌పీ సమీపంలోని మందమర్రి-–గోదావరిఖని కోల్బెల్ట్రహదారి పక్కన పడేస్తున్నారు. చెత్తను తరచూ కాలుస్తుండడంతో వచ్చే పొగ, దుర్వాసనతో సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డుకు స్థలం లేకపోవడంతో పోచమ్మ ఏరియాలో సింగరేణి ఖాళీ స్థలంలో చెత్త పోస్తున్నారు. చెన్నూరు మున్సిపాలిటీలోని బుద్దారం బైపాస్‌రోడ్‌లో 10 ఎకరాల్లో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు పనులు స్లోగా నడుస్తున్నాయి. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
పెరుగుతున్న చెత్త
మంచిర్యాల మున్సిపాలిటీలో నిత్యం 60 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోది. నస్పూర్‌లో 55 మెట్రిక్ టన్నులు, బెల్లంపల్లిలో 36, క్యాతనపల్లిలో 21, మందమర్రిలో 35, చెన్నూరులో 17 టన్నులు, లక్సెట్టిపేటలో 17 మెట్రిక్ టన్నులు జమవుతోంది. ఇటీవల పట్టణాల్లో జనాభా, గృహాలు సంఖ్య పెరగడంతో చెత్త పెరుగుతోంది. ఉన్న 7 మున్సిపాలిటీల్లో ఎక్కడా తడి, పొడి చెత్తను వేరు చేయడంలేదు. బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుపై ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఊపిరాడ్తలేదు
సింగరేణి మూసేసిన టింబర్‌యార్డు సమీపంలో క్యాతనపల్లి మున్సిపల్అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్‌యార్డు నుంచి నిత్యం దట్టమైన పొగ వస్తోంది. పొగ, దుర్వాసన కారణంగా ప్రజలు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. యార్డును తరలించి సమస్య పరిష్కరించాలి.
మిట్టపెల్లి శ్రీనివాస్, సీపీఐ టౌన్సెక్రటరీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ