- ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సరిపోదు
- ఎకరానికి రూ.30 వేల నుంచి 40 వేలు ఖర్చు చేశాం
- మమ్మల్ని ఆదుకొని మానవత్వం చాటుకోండి
- కేంద్ర బృందాలను వేడుకున్న రైతులు, ప్రజలు
- ఎవరూ అధైర్యపడొద్దు.. కేంద్రానికి నివేదిస్తాం: కేంద్ర బృందం
- దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇండ్లు, విద్యుత్ స్తంభాల పరిశీలన
ఖమ్మం రూరల్ / కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయామని, కష్టపడి సంపాదించుకున్న ఆస్తులతో పాటు పంటలు, పశువులు, ఇండ్లు రాత్రికి రాత్రే పోగొట్టుకున్నామని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మానవత్వంతో తమను ఆదుకోవాలని జిల్లాలో పంట నష్టం అంచనా కోసం వచ్చిన కేంద్ర బృందాన్ని వేడుకున్నారు.
న్డీఎంఏ సలహాదారు, కేంద్ర, హోంశాఖ సంయుక్త కార్యదర్శి కర్నల్ కీర్తీ ప్రతాప్ సింగ్ బృందం బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాలైన గూడూరుపాడు, తనగంపాడు, కస్నాతండా, రాకాసితండా, ఎంవీ పాలెం, భగత్‌వీడు తండా, జుజుల్‌రావుపేట, పాలేరు, ఎర్రగడ్డతండా, బీరోలు, పాతర్లపాడు గ్రామాల్లో పర్యటించారు.
దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇండ్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు తమ బాధలను వారి కళ్లకుగట్టారు. పొలాల్లో రాళ్లు, ఇసుక మేట వేశాయని, తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ధ్వంసమైన పొలాలను బాగు చేసుకునేందుకు నెలలు పడుతుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏ మూలకు సరిపోదని కేంద్ర బృందానికి వివరించారు. ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు చేశామని, ప్రభుత్వ మానవత్వంతో ఆలోచించి తమను ఆదుకోవాలని కోరారు.
బాధితులెవరూ అధైర్యపడొద్దు: కీర్తి ప్రతాప్‌సింగ్
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులెవరూ అధైర్యపడొద్దని కేంద్ర బృందం ఎన్డీఎంఏ సలహాదారు, కేంద్ర, హోంశాఖ సంయుక్త కార్యదర్శి కర్నల్ కీర్తీ ప్రతాప్ సింగ్ భరోసా ఇచ్చారు. తిరుమలాయపాలెం మండలం మల్లాయిగూడెం హైవేలో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ ముజామిల్‌ఖాన్‌తో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కలెక్టర్ వివరించారు.
అనంతరం వరద ప్రభావిత గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పంట పొలాల్లో ఇసుక మేటలు, కొట్టుకుపోయిన రోడ్లు, కూలి పోయిన బ్రిడ్జిలు, ధ్వంసమైన ఇండ్లతోపాటు సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పరిశీలించారు. నర్సింహులగూడెం వద్ద దెబ్బతిన్న రోడ్లతోపాటు ఎర్రగడ్డతండాలో ఉన్న భక్తరామదాసు ఎత్తిపోతల పథకం వరద నీటిలో మునిగిపోవడంతో దెబ్బతిన్న మోటార్లు, విద్యుత్ ప్యానెల్స్‌ను చూశారు.
తిరుమలాయపాలెం మండలంలో గండిపడ్డ బీరోలు చెరువును పరిశీలించారు. వరదలతో భారీగా నష్టపోయిన రాకాసితండా గ్రామస్తులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. జిల్లాలో జరిగిన నష్టంపై నివేదిక రూపొందించి, కేంద్ర సర్కారుకు అందిస్తామని వెల్లడించారు.