![కుల గణన లోపాలపై ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి](https://static.v6velugu.com/uploads/2025/02/people-for-caste-census-demands-expert-committee-to-correct-errors-in-report_tPImOoWp5c.jpg)
- సెస్ లాంటి స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించాలి
- ప్రభుత్వానికి పీపుల్స్ ఫర్ క్యాస్ట్ సెన్సస్ సూచన
- మేధావులు, నిపుణులను కమిటీలో నియమించాలి
- కులాల వారీగా డేటాను రిలీజ్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన రిపోర్ట్‌లో లోపాలు సరిదిద్దేందుకు మేధావులు, ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పీపుల్స్ ఫర్ క్యాస్ట్ సెన్సస్ , బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య లాంటి మేధావుల సలహాలు తీసుకోవాలని అన్నారు. డేటాలో జరిగిన అవకతవకలు స్టడీ చేసి, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే బాధ్యతలను సెస్ లాంటి స్వతంత్ర సంస్థకు అప్పగించాలని కోరారు.
సమగ్ర సర్వే అఫీషియల్ కాదంటూనే ఆ రిపోర్ట్ లెక్కలతో పోలుస్తూ ఓసీల జనాభా తగ్గి, బీసీల జనాభా పెరిగిందని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘‘కులగణన సర్వే, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ ప్రకటనలో అస్పష్టత ” అనే అంశంపై పీపుల్స్ ఫర్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ.. కులగణన చేయడంలో ప్లానింగ్ డిపార్ట్ మెంట్ విఫలమైందని, ఈ లెక్కలు తప్పు అనే అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ సైతం ఫెయిల్ అయ్యాయన్నారు. ఈ సర్వేలో సుమారు మూడున్నర లక్షల కుటుంబాలు పాల్గొనలేదని ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు.
కుల గణన ఎలా చేయాలో తమ సంస్థ తరఫున సీఎం, మంత్రులకు సమగ్ర రిపోర్ట్ ఇచ్చామని ఆయన తెలిపారు. బిహార్‌లో కుల గణన సక్సెస్ అయిందని, సుమారు 108 సార్లు కుల గణనపై సీఎం నితీశ్ కుమార్ రివ్యూ చేశారని చెప్పారు. సర్వే ఎలా చేశారో ఆ రాష్ట్ర అధికారులు తెలంగాణకు వచ్చి చెప్పారని గుర్తుచేశారు. అసెంబ్లీలో కు లాలవారీగా పురుషులు, మహిళల జనాభా వివరాలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ఒవైసీ ఈ ప్రశ్న అడిగినా.. ప్రభుత్వం స్పందించలేదన్నారు.
సర్వేలో పాల్గొనని వారికి మొబైల్ యాప్ ద్వారా వివరాలు తెలియజేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే.. 42% రిజర్వేషన్లు రాజ్యాంగ పరిధిలో ఉందని, సాధ్యం కాదని, 42% టికెట్లు ఇస్తామని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
డేటా ఎందుకు బయటపెట్టలే: ప్రొఫెసర్ సింహాద్రి
ప్రభుత్వం అధికారికంగా సర్వే చేసి కులాల వారీగా, గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సమాచారం ఎందుకు బయట పెట్టలేదని ప్రొఫెసర్ సింహాద్రి ప్రశ్నించారు. సర్వే వివరాలను తనిఖీ చేయలేదని, డేటాను తిరిగి చెక్ చేయలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను అణిచి వేస్తున్నాయని మండిపడ్డారు. మైనారిటీల్లో 10% ఓబీసీ ముస్లింలు ఉన్నారని చెప్పారు. బీసీ కులగణనపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే రెడ్డి మంత్రి చైర్మన్‌గా ఎలా ఉంటారని ప్రొఫెసర్ తిరుమలి ప్రశ్నించారు.
బీసీలకు 42 శాతం టికెట్లు ఇస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో క్యాస్ట్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాలని, అప్పుడే రాజ్యాధికారం సాధ్యమని అన్నారు. అర్బన్ ఏరియాల్లో అగ్రవర్ణాల ప్రజలు ఉన్నారని, 95 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూరల్ ప్రాంతాల్లోనే ఉన్నారని చెప్పారు. ప్రొఫెసర్లు రాధాకృష్ణ, నరేంద్ర బాబు, బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దేవళ్ల సమ్మయ్య , పృథ్వీరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.