రామయ్య పెండ్లంటే ఊరూరా సంబురమే. ముఖ్యంగా భద్రాద్రిలో జరిగే రాములోరి పెండ్లి గురించి చెప్పేదేముంది. పట్టు బట్టల్లో రామయ్య , బంగారు బొమ్మ సీతమ్మ మెడలో తాళి కట్టడం చూడ్డానికి లక్షల్లో భక్తులు వస్తుంటారు భద్రాద్రికి. వాళ్లందరిలో ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని కైకలూరు, కోరుకొల్లు గ్రామాల భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఊరి జనాలు రామయ్య, సీతమ్మల పెండ్లి చూడ్డానికి మండే ఎండల్ని కూడా లెక్కచేయరు. కాలినడకనే భద్రాద్రి చేరుకుంటారు. ఎందుకలా? అని అడిగితే ‘వందల ఏండ్లుగా వస్తున్న ఆచారం ఇది’ అంటున్నారు. కొందరు పూజలతో, మరికొందరు ఉపవాసాలు ఉండి, ఇంకొందరు దానధర్మాలతో రామయ్యపై భక్తిని చాటుకుంటుంటారు. అచ్చు అలానే కృష్ణా జిల్లా కైకలూరు, కోరుకొల్లు తదితర గ్రామాల్లోని రామయ్య భక్తులు కూడా. కాకపోతే వీళ్లు రామ నామాన్ని జపిస్తూ శ్రీరామనవమికి కాలినడకన భద్రాద్రి చేరుకుంటారు. అయితే ఊళ్లో ఏ ఐదో పదో కుటుంబాలు కాలి నడకన వెళ్తాయనుకుంటే పొరపాటు. ఉగాది మరుసటి రోజున ఊరు ఊరంతా ఇండ్లకి తాళాలు వేసి మరీ రామయ్య పెండ్లికి బయల్దేరుతుంది.
రామనామ స్మరణతో ...
ఒకేసారి మూడువేల మంది రామనామస్మరణ చేస్తూ బస్సుల్లో, ఆటోల్లో తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అశ్వరావుపేటకు చేరుకుంటారు. అక్కడ్నించి వంద కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న భద్రాద్రి వెళ్లడానికి నడక మొదలుపెడతారు. వంట చేసుకునేందుకు, విశ్రాంతికి అవసరమైన సామాన్లు వాళ్లతో పాటే ఆటోల్లో తీసుకెళ్తారు. రాత్రిళ్లు అడవుల్లో లేదా చుట్టు పక్కల గ్రామాల్లో ఆగుతారు. అలా రోజుకి ఇరవై కిలోమీటర్లు నడిచి శ్రీరామనవమి నాటికి భద్రాద్రి చేరుకుంటారు. రామయ్యకి మొక్కులు చెల్లిస్తారు. గడిచిన రెండేండ్లుగా కొవిడ్ వల్ల కాలినడకన రాలేకపోయారు వీళ్లంతా. ఇప్పుడు కొవిడ్ కేసులు తగ్గడంతో అందరూ రాములోరి దర్శనానికి మళ్లీ బయల్దేరారు. వీళ్లలో పసిపిల్లల నుంచి 60 ఏండ్ల ముసలోళ్ల దాకా ఉన్నారు.
తాతల కాలం నాటి నుంచి...
మా తాతముత్తాతలు భద్రాద్రి రాములోరి పెండ్లికి కాలినడకనే పోయేవాళ్లు. వాళ్ల పూర్వీకులు కూడా అంతే. అలా వందల ఏండ్లుగా కాలినడకన భద్రాద్రి వెళ్లడం మా ఊరి ఆచారంగా వస్తోంది. ఆ సాంప్రదాయాన్ని మేం కూడా తు. చ. తప్పకుండా పాటిస్తున్నాం. కాలినడకన రామయ్యని దర్శించుకుంటే కుటుంబం, పాడి పంటలు చల్లగా ఉంటాయనేది మా నమ్మకం. అవేకాకుండా కాలినడకన వెళ్లి, రావడం వల్ల ఊరిజనం మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అంటున్నారు భక్తులు.
... పోతు రాజేందర్, భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు
మా అదృష్టం
చాలా ఏండ్లుగా కాలినడకన వెళ్లి భద్రాద్రి రామయ్యని దర్శించుకుంటున్నా. ఇన్నేండ్లలో ఏ రోజు ఎండకి ఇబ్బంది పడలేదు. నడవడం కష్టం అనిపించలేదు. సీతారాములు నడిచిన ఈ అడవుల గుండా మేం నడవటం మా అదృష్టం.
- లక్ష్మి