పల్లెకు బైలెల్లిన పట్నం

  • సంక్రాంతి కోసం సొంతూళ్లకు ప్రజలు.. బారులు తీరిన వాహనాలు
  • యాదాద్రి జిల్లా హైవేలపై పోటెత్తిన బండ్లు
  • 24 గంటల్లో రెండు టోల్ గేట్ల మీదుగా 1.40 లక్షల వెహికల్స్​
  • కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

యాదాద్రి, వెలుగు: సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి జనం పల్లెబాట పడ్తున్నారు. సొంతూళ్లలో అయినవాళ్ల నడుమ వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్​ నుంచి బయలు దేరుతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హైవేలు కిక్కిరిసిపోతున్నాయి. యాదాద్రి జిల్లాలోని హైదరాబాద్​–- విజయవాడ, హైదరాబాద్​–- వరంగల్​ హైవేలపై వాహనాలు బారులు తీరుతున్నాయి. రెండురోజులుగా క్షణం తీరిక లేకుండా బండ్లు ప్రయాణిస్తున్నాయి.

ఎటుచూసినా వాహనాలే!

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్​కు వచ్చిన వలస జీవులు.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడం పరిపాటి. రెండు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటుంటారు. పండుగ కోసం ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.  

పైగా వీకెండ్​ సెలవులు కలిసి వచ్చాయి. దీంతో జనం రెండో రోజుల ముందే ‘ఛలో సొంతూరు’ అంటూ పల్లెబాట పట్టారు. హైదరాబాద్​– -- విజయవాడ, హైదరాబాద్​-–- వరంగల్​ హైవేలపై శనివారం గంటకు ఐదు వేలకు పైగా వెహికల్స్​ రాకపోకలు సాగించాయి. 

ఆదివారం ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.  హైదరాబాద్​ - విజయవాడ హైవే రద్దీగా మారింది. ఈ హైవేపై శుక్రవారం రాత్రి 12:01 గంటల  నుంచి శనివారం రాత్రి వరకూ దాదాపు లక్ష వెహికల్స్​ రాకపోకలు సాగించాయి. 

వీటిలో విజయవాడ వైపు 65 వేల వెహికల్స్​ప్రయాణించగా.. హైదరాబాద్​ వైపు 35 వేల వెహికల్స్​ ప్రయాణించినట్టు పంతంగి టోల్​ గేట్​ లెక్కల ద్వారా తేలింది. ఈ రూట్లో ప్రయాణించిన వెహికల్స్​లో కొన్ని నల్గొండ, భువనగిరి వైపు వెళ్లగా.. ఎక్కువగా విజయవాడ వైపు వెళ్లాయి. 

కాగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకూ 59 వేల వెహికల్స్​ రాకపోకలు సాగించాయి. మామూలు రోజుల్లో రోజుకు 30 వేల వెహికల్స్​ వెళ్తాయని టోల్​గేట్​ లెక్కలు చెబుతున్నాయి. 

ట్రాఫిక్​ జామ్​ కాకుండా చర్యలు

హైదరాబాద్​ నుంచి ఎక్కువగా విజయవాడకు వెహికల్స్​ వెళ్తున్నందున ట్రాఫిక్​ జామ్​ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పంతంగి టోల్​గేట్​ వద్ద 16 గేట్లు ఉండగా 12 గేట్ల ద్వారా విజయవాడ వైపు వెహికల్స్​ వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు.

 హైదరాబాద్​ వైపు వచ్చేందుకు 4 గేట్లు ఓపెన్​ చేశారు. దీంతో వెహికల్స్​ సజావుగా మూవ్​ అయ్యాయి. దాదాపు వంద మంది పోలీసులను విధులు నిర్వహించారు. ఇద్దరు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు విధుల్లో ఉన్నారు. 

గూడూరు టోల్​ గేట్​ నుంచి 40 వేల వెహికల్స్​.

హైదరాబాద్​-– వరంగల్​ హైవేపై వెహికల్స్​ ఎక్కువగానే ప్రయాణించాయి. ఈ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు దాదాపు 40 వేల వెహికల్స్​ ప్రయాణించాయి. వరంగల్​ వైపు దాదాపు 25 వేల వెహికల్స్​ ప్రయాణించగా.. హైదరాబాద్​ వైపు 15 వేల వెహికల్స్​ప్రయాణించాయి. 

ట్రాఫిక్​ జామ్​ కాకుండా వరంగల్​ వైపు 8 గేట్లు, హైదరాబాద్​ వైపు 4 గేట్లు ఓపెన్​ చేశారు. ఈ రోడ్డుపై ప్రయాణించేవాళ్లలో ఎక్కువగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని పలుచోట్లకు వెళ్తూ ఉంటారు. రెండు పెట్రోలింగ్​ వెహికల్స్​లో పోలీసులు నిత్యం పరిశీలించారు. అదే విధంగా టోల్​ గేట్​ వద్ద, భువనగిరి టౌన్​లో ట్రాఫిక్​ నియంత్రించే విధంగా చర్యలు తీసుకున్నారు. 

రెండు హైవేలపై 1.40 లక్షల వెహికల్స్​

శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు 24 గంటల్లో హైదరాబాద్​- విజయవాడ, హైదరాబాద్​-వరంగల్​ హైవేలపై కలుపుకొని దాదాపు 1.40 లక్షల వెహికల్స్​ రాకపోకలు సాగించాయి.  అంటే ప్రతి రెండు సెకండ్లకు మూడు వెహికల్స్​ కంటే ఎక్కువగా ప్రయాణించాయి.