జేడీఎస్‌‌‑కాంగ్రెస్‌‌కు జనం చాలా చాన్స్​లు ఇచ్చారు: అమిత్​షా

జేడీఎస్‌‌‑కాంగ్రెస్‌‌కు జనం చాలా చాన్స్​లు ఇచ్చారు: అమిత్​షా

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీకి మేలో ఎన్నికలు జరగబోతుండడంతో పార్టీ బలోపేతం దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల కంచుకోట ఓల్డ్​ మైసూరులో పాగా వేయడంతోపాటు సొంత పార్టీలో అసంతృప్తులను చల్లార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చాలా రోజులుగా పెండింగ్​లో ఉన్న రాష్ట్ర కేబినెట్​ విస్తరణకు కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆమోదముద్ర వేశారు. పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో శనివారం బెంగళూరులో జరిగిన కీలక సమావేశంలో అమిత్​షా ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కేఎస్ ఈశ్వరప్ప, రమేశ్​ జార్కిహోళి వంటి వారికి కేబినెట్‌‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

వొక్కలిగులకు దగ్గరయ్యేందుకు..

జేడీఎస్, కాంగ్రెస్‌‌ పార్టీకు కంచుకోటగా ఉన్న ఓల్డ్​ మైసూరు ప్రాంతంలో పార్టీని విస్తరించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ మాండ్య, మైసూరు, హసన్, తుమకూరు, చామరాజనగర్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్​బల్లాపూర్ వంటి జిల్లాలు ఉన్నాయి. 2019లో మాత్రమే ఇక్కడ బీజేపీ ఖాతా ఓపెన్​ చేసింది. మాండ్యాలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే.. జేడీఎస్ 6, బీజేపీ ఒక చోట విజయం సాధించాయి. కర్నాటక జనాభాలో 15 శాతం ఉన్న వొక్కలిగ కమ్యూనిటీదే ఓల్డ్​ మైసూరులో ఆధిపత్యం. లింగాయత్‌‌ల తర్వాత అతిపెద్ద ఓటు బ్యాంకు వీరిదే. శనివారం కర్నాటకలో జరిగిన బహిరంగ సభలో షా పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్  గెలిస్తే అది ఢిల్లీ ఏటీఎం అవుతుందని, జేడీఎస్ గెలిస్తే ఫ్యామిలీ ఏటీఎం అవుతుందని అమిత్ షా విమర్శించారు.