మోసం చేస్తే జైలుకు పంపొచ్చు

ఆన్​లైన్ అయినా, ఆఫ్​లైన్​ అయినా వినియోగదారులు అనేక రకాలుగా మోసపోతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా వాటిపై అవగాహన లేక, మోసపోయినపుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. తాజాగా అమలులోకి వచ్చిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-–2019.. కన్స్యూమర్లకు రక్షణ కవచంగా మారింది. ప్రతీ ఒక్కరు ఈ చట్టం గురించి అవగాహన పెంచుకుంటే మోసాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు. తమ హక్కులను రక్షించుకోవచ్చు. ఇది వరకు కన్స్యూమర్​ మార్కెట్​కు వెళ్లి వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అంతా ఆన్​లైనే. అయితే కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, ఆశించిన మేరకు ప్రమాణాలు లేకపోయినా ఎవరినీ అడిగే పరిస్థితులు లేవు. వినియోగదారుల చట్టం-1986 స్థానంలో వచ్చిన కొత్త చట్టం.. వినియోదారుల హక్కుల ఉల్లంఘనలపై భారీ జరిమానాలను విధించే వెసులుబాటుతోపాటు జైలుకు పంపేలా రక్షణగా నిలుస్తోంది. 

నామమాత్రపు ఫీజుతో నష్టపరిహారం
కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి జిల్లా వినియోగదారుల ఫోరమ్​ను జిల్లా కమిషన్​గా పిలుస్తారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్ గా, జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్​గా పిలుస్తారు. జిల్లా ఫోరమ్​ పరిధిలో నష్టపరిహారం గతంలో రూ.20 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.కోటి వరకు పెంచారు. రాష్ట్ర స్థాయిలో రూ.20 కోట్లు, జాతీయ స్థాయిలో ఆపై మొత్తానికి పెంచారు. ఆర్బిట్రేషన్, మధ్యంతర సెటిల్మెంట్​కు అవకాశం కల్పించారు. సెంట్రల్ కన్స్యూమర్ అథారిటీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. కలెక్టర్లకు విశేష అధికారాలను అందించారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకూ కొనుగోలుదారులు విధిగా బిల్లు తీసుకోవాలి. గ్యారెంటీ, వారంటీ బిల్లులను భద్రపరచుకోవాలి. ఐఎస్​ఐ, అగ్మార్క్, హాల్​మార్క్​ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి. వస్తువు తయారీ తేదీ, గడువు తేదీ, ధర తదితర వివరాలను సరిచూసుకున్న తర్వాతే వస్తువులను కొనుగోలు చేయాలి. మోసపోయినపుడు వెంటనే వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా సరైన సమాచారం తెలుసుకొని ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు. నామమాత్రపు ఫీజుతో ఫోరమ్​ ద్వారా నష్టపరిహారం పొందే అవకాశం ఉంది.

చట్టంపై జనంలో అవగాహన పెరగాలి
ఈ చట్టం అనేక రక్షణలను కల్పించింది. అక్రమ పద్ధతులు, లావాదేవీలను నిరోధించడం, ఆన్​లైన్​ అమ్మకాలు, టెలీషాపింగ్, మల్టీమార్కెటింగ్ వంటివి ఈ చట్టం పరిధిలోకి వచ్చాయి. వస్తువులు, సేవలు, నిర్మాణాలు, ఇండ్ల నిర్మాణాలు, ప్లాట్ల అమ్మకాల వంటివి కూడా చేరాయి. వినియోగదారుల ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగని సందర్భాల్లో 6 నెలల వరకు జైలు లేదా లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు. వినియోగదారునికి హాని జరిగితే రూ .5 లక్షల వరకు జరిమానా లేదా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించవచ్చు. వినియోగదారుడు మరణిస్తే, రూ.10 లక్షల వరకు జరిమానా లేదా 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ వెయ్యవచ్చు. ఎవరైనా ప్రముఖులు, సెలబ్రిటీలు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వినియోగదారుడు తప్పుగా ఫిర్యాదు చేస్తే, అతనికి కూడా రూ.50 వేల జరిమానా విధించవచ్చు. వినియోగదారుడు మోసపోయినపుడు ఆ వస్తువు ఎక్కడ కొనుగోలు చేసినా సరే ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. వస్తువును కొనుగోలు చేసిన తర్వాత తనకు తగు రీతిలో న్యాయం జరగలేదని భావించినప్పుడు అతడికి నష్టపరిహారం పొందే హక్కు కొత్త చట్టంలో కల్పించారు. వినియోగదారుల హక్కుల గురించి స్పష్టంగా తెలుసుకుంటే మోసాలు చిన్నవైనా, పెద్దవైనా సరైన న్యాయాన్ని పొందడానికి అవకాశం దక్కుతుంది.