బీఆర్ఎస్​ను ఇప్పటికే ప్రజలు చీల్చి చెండాడారు

బీఆర్ఎస్​ను ఇప్పటికే ప్రజలు చీల్చి చెండాడారు
  •  ఆ విషయాన్ని కేసీఆర్​ గుర్తుంచుకోవాలి: మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్​ను చీల్చి చెండాడారని.. ఆ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ ​గుర్తుంచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బడ్జెట్ పై అధికార పార్టీని చీల్చి చెండాడుతామన్న కేసీఆర్ మాటలపై జూపల్లి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పాలన బాగా లేదనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని, లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు.

 రాష్ట్ర బడ్జెట్ ను గ్యాస్, ట్రాష్ అని విమర్శిస్తున్న కేసీఆర్.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదాయాన్ని ఎక్కువ చూపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసినప్పుడు అది గ్యాస్, ట్రాష్ కాదా? అని మంత్రి ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియతో జూపల్లి మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ లో 25 శాతం వ్యవసాయానికి కేటాయిస్తే.. అందులో 15 శాతం గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకే సరిపోతోందన్నారు. 

కేవలం ఏడు నెలలకే రూ.30 వేల కోట్లు అప్పులు చేసిందని తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆర్.. అందులో బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలు కట్టడానికే సరిపోతున్నాయన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఇన్ని రోజులు ఎందుకు రాలేదని ఆయన  ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వయస్సు చిన్నది కాబట్టి ఆయన ముందు కూర్చోవడానికి ఇబ్బందిపడుతున్నాడా? అంత గర్వమా అని మంత్రి ఫైర్ అయ్యారు. 

జనాలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను తీసుకువచ్చాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలను రెచ్చగొట్టేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైందన్నారు. దీన్ని గ్యాస్, ట్రాష్ అని కేసీఆర్ విమర్శించడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ ఆగం పట్టించిందన్నారు.