గ్రామాల్లో నీటి కటకట .. జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి

  • వ్యవసాయ బోర్లు, ట్యాంకర్లను అద్దెకు తీసుకుని వాటర్​సప్లై 
  • రెండు, మూడు రోజులకోసారి ట్యాంకర్ల నీళ్లే గతి
  • బిందెడు నీళ్ల కోసం పలుచోట్ల మహిళల ఘర్షణ
  • ఎండిపోయిన గ్రామ పంచాయతీల బోర్లు
  • ఎప్పుడు వస్తాయో తెల్వని భగీరథ నీళ్లు 

నల్గొండ, వెలుగు : జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. అసలే కరువు, ఆపై ఎండలు ముదిరిపోవడంతో భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో బోర్లు ఎండిపోయాయి. మరోవైపు ఎప్పుడు వస్తాయో తెల్వని భగీరథ నీళ్ల కోసం జనాలు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. తాగునీటి సమస్య నుంచి గట్టెక్కేందుకు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుంటున్న సంఘటనలు జిల్లాలో కనిపిస్తున్నాయి. భగీరథ నీళ్లు సక్రమంగా రాకపో వడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఊరికి ఒకటే వాటర్​ట్యాంకర్​ఉండడంతో రెండు రోజులకోసారి నీళ్లు సప్లై చేస్తున్నారు. 

నీటి కొరత లేదంటున్న ఆఫీసర్లు..

భగీరథ నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనితారామచంద్రన్​ను నియమించింది. మూడు జిల్లాల్లో తాగునీటి సప్లై మీద రివ్యూ పూర్తియ్యింది. ఎక్కడా ఎలాంటి సమస్య లేదని అధికారులు చెప్పారు. నాగార్జునసాగర్​రిజర్వాయర్​నుంచే భగీరథ సోర్స్​పాయింట్లలో మూడు, నాలుగు నెలలకు సరిపడా నీటిని స్టోరేజీ చేశామని చెప్పారు. పైగా పైప్​లైన్ల లీకేజీలు లేవని, కరెంట్​ కొరత లేదని క్లీన్​చీట్​ ఇచ్చారు. 

తాగునీటి కొరత తీర్చేందుకు ప్రభుత్వం ఎస్​డీఎఫ్​నుంచి ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లకు పైగా నిధులు విడుదల​చేసింది. గ్రామాల్లో పైప్​లైన్ల లీకేజీలు, ఆపరేషన్​ అండ్​మేనేజ్​మెంట్​లో తలెత్తె లోపాలను రిపేర్ చేసేందుకు నిధులు ఖర్చు పెట్టాలని చెప్పింది. ఈ మేరకు నల్గొండలో 600లకు పైగా కొత్త పనులకు శ్రీకారం చుట్టారు. కానీ, అధికారులు చెబుతున్న దానికి.. ఫీల్డ్​లో జనాలు ఎదుర్కొంటున్న సమస్యకు ఏ మాత్రం పొంతన లేదు. 

భగీరథ నీళ్ల సప్లైలో ఆఫీసర్లు విఫలం..

రాబోయే మూడు, నాలుగు నెలలకు సరిపడా నీటిని భగీరథ సోర్స్ పాయింట్లలో నిల్వ చేశామని ఆఫీసర్లు అంటున్నారు. ఉదయ సముద్రంలో ఇప్పటికే 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఏకేబీఆర్​నుంచి ప్రస్తుతం రోజుకు 740 క్యూసెక్కు ల నీరు వస్తోంది. ఇలాగే వారం, పది రోజుల వరకు విడుదల చేస్తే ఉదయ సముద్రం రిజర్వాయర్​ఒక టీఎంసీకి చేరుతుందని అధికారులు అంటున్నారు. ఇదే ఉదయ సముద్రం నుంచి మునుగోడు, నల్గొండ, నకిరేకల్​ నియోజకవర్గాలకు నీటి సప్లై చేయాల్సి ఉంది. కానీ మునుగోడు నియోజవర్గంలో రెండు రోజులకోసారి నీటి విడుదల జరుగుతోంది. 

నల్గొండ మున్సిపాలిటీలో రెండ్రోజుల కోసారి నీళ్లు సప్లై చేస్తున్నారు. మున్సిపాలిటీకి ఇవ్వాల్సింది 18 ఎంఎల్​డీ వాటర్​అయినప్పటికీ అదనంగా 26 ఎంఎల్​డీ ఇస్తున్నారు. కానీ, వాటర్​డిస్ట్రిబ్యూషన్​లో లోపాలతో గతంలో మాదిరి నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు అవంతీపురం టెయిల్​ పాండ్​నుంచి నీటిని సప్లై చేస్తున్నారు.

 టెయిల్​పాండ్​లో ప్రస్తుతం ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకో ఏడాది వరకు నీటి కొరత లేదని జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులు అంటున్నారు. మిర్యాలగూడ మండలంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. రెండు, మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేస్తున్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్​రిజర్వాయర్​నుం చి వివిధ పాయింట్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నామని చెప్తున్నా, దేవరకొండ నియోజకవర్గంలోని డిండి, పీఏపల్లి, సాగర్​పరిధిలోని త్రిపురారం, హాలియా, ఇతర మండలాలకు భగీరథ నీళ్లు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు.

 ఏకేబీఆర్​లో ప్రస్తుతం 1.2 టీఎంసీ నీరు నిల్వ ఉంది. దీంట్లో నల్గొండ జిల్లా అవసరాలకు పోను, హైదరాబాద్​ జంట నగరాల కోసం ప్రతిరోజు 525 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్న దానికి గ్రామాల్లో జనాలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు పొంతన లేకుండా ఉంది. 

ఐలాపురంలో భగీరథ కష్టాలు

మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామంలో మిషన్ భగీరథ నీరు గ్రామంలోని అన్ని బజార్లకు సప్లై కావట్లేదు. గ్రామంలో రెండు భగీరథ ట్యాంకులు ఉన్నాయి. కానీ, ఈ ట్యాంకుల నుంచి కేవలం పావుగంట మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. అది కూడా రెండు రోజులుకోసారి సప్లై చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఊరి జనాలు అంతా ఏకమై  గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో బోరు అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపుకుని పబ్లిక్​కు సప్లై చేస్తున్నారు. భగీరథ పైప్​లైన్ల రిపేర్లు, పైప్​ లైన్​లీకేజీల కారణంగా వాటర్​సప్లై నెల రోజుల నుంచి సక్రమంగా రావట్లేదు. 

అంజనపల్లి గొంతెండుతోంది
 
త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామం తాగునీటికి అల్లాడుతోంది. 900 జనాభా ఉన్న ఈ గ్రామంలో నాలుగు చేతి పంపులు, రెండు భగీరథ వాటర్​ట్యాంకులు ఉన్నాయి. కానీ తాగునీటి సమస్య మాత్రం తీరడం లేదు. జనాభాకు సరిపడా నీరు సప్లై చేయకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఇంటికి రెండు బిందెలు చొప్పున కోటా విధించారు. దీంతో బిందెడు నీళ్ల కోసం మహిళలు ట్యాంకర్ల వద్దే ఘర్షణ ప డుతున్నారు. మహిళలు, యువకులు తాగునీరు చాలకపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు

పెద్ద అడిశరపల్లిలో బోర్లే దిక్కు 

పీఏపల్లి మండలం కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటి కోసం జనాలు అల్లాడుతున్నారు. ఆరు జీపీ బోర్లు, నాలుగు మిషన్​ భగీరథ ట్యాంకులు ఉన్నప్ప టికీ తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. గ్రౌండ్​ వాటర్​ పడిపోవడంతో బో ర్లు ఎండిపోయాయి. భగీరథ నీళ్లు మూడు, నాలుగు రోజులకోసారి సప్లై చేస్తు న్నారు. అవి కూడా ఎప్పుడు వస్తాయో కూడా తెల్వక జనాలు నల్లాల వద్దే పడి గాపులు కాయాల్సి వస్తోంది.