- అమృత్ 2.0 స్కీమ్‌లో రూ.106.70 కోట్లు మంజూరు
- తాగునీటి సరఫరా మెరుగుపర్చేందుకు చర్యలు
మహబూబాబాద్, వెలుగు: వేసవిలో మహబూబాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. తాగు నీటికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా మెరుగుపర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద రూ.106.70 కోట్లు మంజూరయ్యాయి.
ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు నిర్వహణ వ్యయంగా విభజించారు. మంజూరైన నిధుల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.28.45కోట్లు, తొర్రూరు రూ.27.42కోట్లు, మరిపెడ రూ.25.58కోట్లు, డోర్నకల్ మున్సిపాలిటీకి రూ.25.27కోట్ల చొప్పున కేటాయించారు. కాగా మహబూబాబాద్ 69,288 మంది, డోర్నకల్ 18,424 తొర్రూరు 35,231, మరిపెడ 17,685 మంది జనాభా ఉన్నారు.
తీరనున్న బాధ
జిల్లాలోని మహబూబాబాద్ తో పాటు డోర్నకల్, తొర్రూరు, మరిపెడ మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో సగం మిషన్ భగీరథ నీరు, సగం బావినీరు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలోని జమాండ్లపల్లి, బేతోలు, గాంధీపురం, డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో రాజుతండా, ఎస్సీ బీసీకాలనీ, పంపు బావి తండా, సుభాష్ వీధి ప్రాంతాల్లో, మరిపెడలోని వీలిన తండాలు, తొర్రూరు పట్టణంలోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందక ఇబ్బందులు తప్పడం లేదు.
మహబూబాబాద్ పట్టణంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు, 5లక్షల లీటర్ల సామర్థ్యంతో ఒకటి మొత్తంగా మూడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించి 32 కిలోమీటర్ల మేర పైపులైను వేయనున్నారు. సిటీలో 1,500 కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. డోర్నకల్ పట్టణంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులు, 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంకు నిర్మాణం చేపట్టనున్నారు. 31కిలోమీటర్ల పైపులైను నిర్మాణం చేసి 1,700 కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు.
మరిపెడలో 9 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు, 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల మరో ట్యాంకు నిర్మాణం చేపట్టనున్నారు.36 కిలోమీటర్ల పైపులైన్, 1500 నూతన నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 9 లక్షల లీటర్లు, 7లక్షల లీటర్లు, 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల మూడు ట్యాంకులను నిర్మించనున్నారు. 39 కిలోమీటర్లు పైపులైన్లు వేసి, 1,500 కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తారు. డోర్నకల్, తొర్రూరు,మరిపెడలో ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ లో ఒక ట్యాంక్ నిర్మాణం చేపట్టగా, మరో రెండు ట్యాంకుల నిర్మాణం కోసం స్థల సేకరణ చేస్తున్నారు.
పనులు చురుకుగా కొనసాగుతున్నాయి
అమృత్ పథకం ద్వారా మహబూబాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా మెరుగుపర్చేందుకు వాటర్ ట్యాంక్‌ల నిర్మాణ పనులు చేపడుతున్నాం. ప్రధానంగా తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీరు అందేవిధంగా నూతన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించి అవసరమైన మేరకు పైపులైన్లు వేస్తాము.పనులు సత్వరం పూర్తి చేసి తాగునీటి ఎద్దడి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. – వేముల రంజిత్ రెడ్డి, ఈఈ పబ్లిక్ హెల్త్, మహబూబాబాద్ జిల్లా