బుక్ ​రీడింగూ​ ఓ చికిత్సే! : బి. నర్సన్

సూర్యోదయంతో జగమంతా జాగృతమవుతుంది. ఆ వెలుగులో లోకమంతా కంటికి చేరువవుతుంది. సూర్యకాంతి సకల జీవరాశికి కదిలే శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే మనిషి అంతరంగ మానసిక చలనశీలతకు వెలుగులందించే శక్తి భానుడికి లేదు. మనిషి స్వయంగానే ఆ వెలుగుల్ని వెదికి పట్టుకోవాలి. ఆ అన్వేషణకు అక్షరమే ఊతకర్ర. పఠనమే మనిషికి లోకజ్ఞానాన్ని, జీవన రీతుల్ని, సామాజిక మమేకతని అందిస్తుంది. పుస్తకంలోని అక్షరాలకు ఇంత శక్తి ఉందా అనే అనుమానముంటే ఎవరికివారు కొంతకాలం రోజూ కొంత సమయాన్ని పఠనానికి కేటాయిస్తే ఫలితం తప్పకుండా గ్రహిస్తారు. విద్యార్థిగా చదువు జీవనోపాధిని కల్పిస్తే ఆ తర్వాతి కాలపు చదువు జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే పుస్తకం చేతికి అందం మాత్రమే కాదు ఆజన్మనేస్తం కూడా. మంచి పుస్తకం మానసిక ఉల్లాస వికాసానికి తోడుగా జీవితంలో ఎదురయ్యే ఎన్నో జటిల సమస్యలకు సమాధానం అందిస్తుంది. 

పుస్తకాల్లో అనుభవాల సారం

ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ దినచర్యలో పుస్తకపఠనం ఒక భాగమని చెబుతుంటారు. వారిని పలకరిస్తే తమను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ఇష్టంగా వివరిస్తారు. దినమంతా రకరకాల చిక్కులు, వాటి పరిష్కరాలతో సతమతమయ్యేవారు పుస్తక పఠనం ద్వారా సాంత్వన పొందుతామనేది వట్టిమాట కాదు. ఆ శక్తి సాహిత్యానికి ఉంది. కథలు, నవలలు, ఆత్మకథలు అన్ని రచయితల పరిశీలన, అనుభవాల, జీవనగతుల నుంచి పిండిన సారమే కాబట్టి అందరం అందులో పాత్రధారులమే. అనుభవాలు అందరికి ఉండొచ్చు కానీ వాటిని అక్షరబద్ధం చేయడం ఒక కళ. ఆ నేర్పుగల రచయిత వ్యక్తిగా అందరి వద్దకు రాలేక తన పుస్తకాల ద్వారా వేలాది మందికి చేరువవుతాడు. అలాంటి ఎన్ని పుస్తకాలు చదివితే మనకు అన్ని సూచనలు లభిస్తాయి. మాంసపు ముద్దలాంటి మనిషి మెదడులో మేధస్సును కూర్చేది, విస్తృతపరిచేది పుస్తకపఠనమే. తద్వారా క్రోడీకరించబడిన జ్ఞానం చుట్టూ ఉన్నవారికి కూడా పనికొస్తుంది. జ్ఞాని సమాజ ఉపకారి, అలాంటి జ్ఞానుల సంఖ్యపై సమాజ పోకడ ఆధారపడివుంటుంది.

పుస్తకాల జాతరకు వెళ్లొద్దామా?

ఇప్పటికే పఠనాభిలాషులైతే మంచి పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. పత్రికల్లో సమీక్షలు, సాహితీవేత్తల సలహాలు పుస్తకచయనానికి పనికొస్తాయి. చదవడం వెనుకా ముందైనా పుస్తక సేకరణకు మాత్రం ముందుండాలి. సొంతంగా కొనుక్కోవడమే సేకరణకు మూలాధారం. డబ్బు పెట్టి పుస్తకం కొన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది, పేజీలు తిరిగేయాలనిపిస్తుంది. పుస్తకాల కొనుగోలు ఇష్టంగా మారితే దానికయ్యే ఖర్చు భారమనిపించదు. మంచి పుస్తకాన్ని కొన్నామన్న తృప్తి మిగులుతుంది. చదువు, చదివించు అనే మాటను ఆచరణలో పెట్టిన సెలూన్​ఓనర్​ పొన్ను మరియప్ప. తమిళనాడులోని తూత్తుకుడిలోని తన సెలూన్ లో ఆయన ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. కటింగ్ కోసం వేచి ఉండే కస్టమర్లు ఆ పుస్తకాలను తిరగేయాలని అతని ఆశ. పుస్తకాల్ని చదివేవారికి చదివిన సమయాన్ని బట్టి తన బిల్లులో కొంత డిస్కౌంట్ కూడా ఇస్తాడట. పిల్లలు హోమ్ వర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తామనే పేరెంట్స్ గుర్తుకొస్తున్నారు కదూ! పోలన్ సర్కార్ జీవితం మరో మహత్తర దృష్టాంతం. బంగ్లాదేశ్ కు చెందిన ఆ వృద్ధుడు తన ఉద్యోగ విరమణ అనంతరం బతికిన 20 ఏళ్ల పాటు ఊరూరు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి  కోరిన పుస్తకాన్ని వారికి ఉచితంగా అందజేశాడు. తన ఆదాయాన్నంతా అలా పుస్తకార్పణం చేసిన ధన్యజీవి పోలన్.  పుస్తకాల ‘తోపుడు బండి’ని గ్రామాల్లో తిప్పుతూ సాహిత్యాన్ని తెలుగునేల మూలమూలలకి తీసుకెళుతున్న సాదిక్ హుస్సేన్ కృషి అరుదైనదే. ఎవరైనా పుస్తకానికి చేరువయ్యేందుకు వీరి కృషి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ఎదురుగా ఎన్టీయార్ స్టేడియంలో పుస్తకాల జాతర సాగుతున్నది. బుక్ ఫెయిర్ సొసైటీ ఏటా నిర్వహించే ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 22 నుంచి1 జనవరి 2023 దాకా ఉంటుంది. సాయంత్రాలు వెళ్లి 300 పైగా ఉన్న స్టాళ్లలో  నచ్చిన పుస్తకాలు కొనుక్కోవచ్చు. లక్షలాదిగా పుస్తకప్రియులు తరలి వచ్చే ఈ వేడుకలో అందరూ భాగస్వాములు కావాలి. పుస్తకం కేవలం హస్తభూషణం గానే కాదు, మనోప్రియంగా, గృహశోభగా గౌరవం పొందాలి.

- బి. నర్సన్, సోషల్​ ఎనలిస్ట్