- వరద ప్రాంతాల్లో భయం భయంగా గడిపిన బాధితులు
- ఏడాది తిరక్కముందే మళ్లీ మునిగిన కాలనీలు
- వరదనీటిలో కొట్టుకుపోయిన నిత్యావసరాలు, సామాన్లు
- అయ్యప్ప కాలనీలో బోట్ల ద్వారా ఫుడ్ అందజేత
- గతేడాదికి.. ఇప్పటికి మారని తీరు జనాలకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్ /ఎల్బీనగర్/ సికింద్రాబాద్/ శంషాబాద్, వెలుగు: ఏడాది తిరగకముందే సిటీలో ముంపు సీన్మళ్లీ రిపీట్అయ్యింది. రెండు రోజులుగా కురిసిన వానలతో వరద నీరు ముంపు కాలనీలను ముంచెత్తింది. అర్ధరాత్రి వేళ ఇండ్లలోకి నీరు చేరడంతో బాధితులు భయం భయంగా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వానల నుంచి ముంపు బాధితులు ఇప్పటికి కోలుకోనే లేదు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామువరకు కురిసిన ఎడతెరిపి లేని వానతో ముంపు కాలనీల్లో అవే పరిస్థితులు కనిపించాయి. స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సిటీలో 250 కిపైగా కాలనీలు నీట మునిగాయి. కొన్నిచోట్ల గ్రౌండ్ఫ్లోర్లలో నీరు చేరిగా జనం ఇండ్లలోనే చిక్కుకుపోయారు. బల్దియా సిబ్బంది బోట్ల ద్వారా బయటకు తీసుకొచ్చారు. అబ్లుల్లాపూర్మెట్లో 21.6 , ఉప్పల్ బండ్లగూడలో 21.2, హయత్‌నగర్‌లో 19.2 సెంటీ మీటర్ల చొప్పున అధికంగా వర్షపాతం నమోదైంది.
గ్రౌండ్ ఫ్లోర్లలోకి చేరిన నీళ్లు
ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్ నగర్, హయత్‌నగర్, ఉప్పల్, నాగోల్, లింగోజిగూడ, మల్కాజిగిరి, బేగంపేట్,టోలిచౌకి తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో గ్రౌండ్ ఫ్లోర్లలోకి నీరు రావడంతో చాలా మంది ఇండ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. రాత్రి వేళ వాన పడడంతో ఒక్కసారిగా ఇండ్లలోకి వరద నీరు రావడంతో కట్టుబట్టలతో కొందరు పరుగులు తీశారు. కరెంట్ లేకపోవడంతో చిమ్మచీకట్లో ఎటుపోవాలో దిక్కుతోచక మరి కొందరు ఇండ్లపైకి ఎక్కి కంటిమీద కునుకు లేకుండా భయంగా గడిపారు. ఇండ్లలోని నిత్యావసరాలు, సామగ్రి కొట్టుకుపోయాయి. తినేందుకు తిండిలేక అవస్థలు పడ్డారు. మూసి నదికి వరద పోటెత్తడంతో ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల గురువారం సాయంత్రానికి నీరు క్లియర్అయింది. సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్తదితర ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఏటా వర్షాలు పడ్డప్పుడు తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని ముంపు బాధితులు ఆవేదనతో చెప్పారు. అధికారులు ముందస్తు అలర్ట్ చేయలేదని, చేసుంటే ఇండ్లను ఖాళీచేసి వెళ్లిపోయే వాళ్లమని పలువురు తెలిపారు. గతేడాది వానలప్పుడు కూడా ఇదేవిధంగా బాధలు పడ్డామని వాపోయారు. బల్దియా సహాయక చర్యల్లో ఆలస్యం చేయగా చాలామంది ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఎలాంటి చర్యలు మొదలుపెట్టలేదు. మైలార్దేవ్ పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్ పరిధిలోనూ వరద నీరు ఇండ్లల్లోకి చేరింది. మైలార్దేవ్ పల్లిలోని లక్ష్మిగూడ, బృందావన్ కాలనీల్లో విద్యుత్ సప్లయ్‌ను అధికారులు నిలిపి వేశారు. గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. తీవ్రతను బట్టి గేట్లు ఎత్తేందుకు వాటర్‌బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో 3 రోజులు వానలు పడుతాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు.
పర్యటించిన మేయర్
సరూర్‌నగర్‌లోని తిరుమల నగర్ కాలనీ, గడ్డి అన్నారం ప్రాంతాల్లో గురువారం మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. పొంగి పొర్లుతున్న నాలాను పరిశీలించి ఎస్ఎన్డీపీ ఫస్ట్,సెకండ్ ఫేజ్‌ల్లో మొత్తం పనులు పూర్తి అయ్యే విధంగా చూస్తామన్నారు. ప్రస్తుతానికి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. అక్కడి జనం తమ సమస్యలను మేయర్ కి వివరించారు. మేయర్ వెంట కార్పొరేటర్లు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, శ్రీవాణి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులున్నారు.
వాన పడితే జాగారమే..
వాన పడ్డప్పుడల్లా ఇండ్లలోకి వరద వస్తుండగా జాగారం చేయక తప్పడం లేదు. నీరంతా బయటకు ఎత్తిపోస్తేనే ఇంట్లో ఉండే పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా కురిసిన వానలకు ఇంట్లోని వస్తువులన్నీ తడిసిపోయాయి. వానా కాలం రాగానే డ్రైనేజీలకు రిపేర్లు చేస్తున్నా.. లోతట్టు ప్రాంతాల్లో ఉండే మాలాంటి వాళ్లకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు శాశ్వత పరిష్కారం చూపించాలి. – రామచందర్, నాచారం
ఇల్లు ఖాళీ చేసి పోయినం
రాత్రి ఒక్కసారిగా వరద నీరు ఇంట్లోకి వచ్చింది. కట్టుబట్టలతో బయటకు పరుగులు తీసినం. అక్కడే ఉంటే చాలా ఇబ్బందులు పడే వాళ్లం. వానొచ్చిన ప్రతిసారి మాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా బతుకుతున్నం. – జయమ్మ, అయ్యప్ప కాలనీ, నాగోల్