ఖమ్మం జిల్లాలో ప్రజలు, వినాయక వెళ్లిరావయ్యా అంటూ ఘనంగా వీడ్కోలు

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కాల్వ ఒడ్డు మున్నేరు, ప్రకాష్ నగర్,  చిన్న మున్నేరు వరకు కోలాటాలు, యువత ఆటపాటలతో శోభాయాత్ర నిర్వహించారు.  వినాయకుడు, పార్వతి పరమేశ్వరుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.  దాదాపు 1200 విగ్రహాలను భక్తులు మున్నేరులో నిమజ్జనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

గణేశ్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని  అధికారిక లాంఛనాలతో  చేపట్టారు.  సార్వత్రిక నిమజ్జనంను త్రీ టౌన్ లోని గాంధీ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు, మతాలను గౌరవిస్తూ ఆయా పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు.  ఈ సందర్భంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించిన స్తంభాద్రి ఉత్సవ సమితి నిర్వాహకులను అభినందించారు.