ఆ ఊర్లో మాంసం తినరు

ఆ ఊర్లో మాంసం తినరు

పండుగొచ్చినా, పబ్బం అయినా, చుట్టాలు వచ్చినా కోడి కూర  ఉండాల్సిందే. దేవతలకు కూడా కొందరు యాటల్ని కోసి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ, ఈ ఊరి జనాలు మాత్రం పండుగైనా, శుభకార్యమైనా శాఖాహారమే తింటారు. ఇంటికొచ్చిన చుట్టాలకు కూడా కూరగాయల భోజనమే వడ్డిస్తారు.  మాంసం, మద్యం అస్సలు ముట్టుకోరు.  ఇదేదో నిన్నమొన్నటి ఆచారం కాదు. దాదాపు 70 ఏండ్లుగా ఊరు ఊరంతా ఈ ఆచారం పాటిస్తోంది. ఈ ఊరి పేరు మచ్కల్.  నిర్మల్ జిల్లాలోని ముథోల్​ మండలంలో ఉంది.  

ఈ గ్రామంలో ఆర్య మరాఠా కులం వాళ్లు ఎక్కువ. వీళ్ల ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు. ఈ కులస్తులు కొందరు  అప్పట్లో  ‘మహానుభావు’ మతం ఆచరించారట.  దీక్షలో భాగంగా శాఖాహారమే తినేవారట. దాంతో, అదే సంప్రదాయాన్ని అక్కడి మరాఠా కుటుంబాలు కొనసాగిస్తున్నాయి. వీళ్లను చూసి ఊర్లోని మిగతా కులాలవాళ్లు కూడా మాంసం తినట్లేదు. గ్రామస్తులంతా ‘ఊర్లో ఎవరూ మాంసం తినొద్దు, మద్యం తాగొద్దు’ అని నియమం పెట్టుకున్నారు. అందుకనే... మచ్కల్​లో ఎక్కడా మాంసం, మద్యం దుకాణాలు కనిపించవు.  అంతేకాదు గ్రామ దేవతలకు మేకలు, కోళ్లని బలివ్వరు. పండుగల టైంలో అమ్మవార్లకు బోనం సమర్పించి వస్తారంతే. 

శుభాకార్యాల్లోనూ...

ఈ ఊర్లో వెయ్యికి పైగా జనాభా ఉన్నారు. ఏండ్ల నుంచి వస్తున్న ఈ ఆచారం గురించి పెద్దలు పిల్లలతో చెప్తారు. దాంతో, ఈకాలం పిల్లలు కూడా మాంసం, మందు ముట్టుకోవడం లేదు. ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ ఫంక్షన్​ జరిగినా  అందరికీ కూరగాయల భోజనమే వడ్డిస్తారు. అంతేకాదు చుట్టాల ఇంటికి వెళ్లినా, వేరే ఊళ్లకు పెండ్లికి పోయినా శాఖాహారమే తింటారు ఈ ఊరివాళ్లు. – బాజేంధర్​,  భైంసా, వెలుగు   

మా తాతల నుంచి ఇదే ఆచారం

తాత, ముత్తాతల కాలం నుంచి మా గ్రామంలో శాఖాహార ఆచారం కొనసాగుతోంది. ఊర్లో ఎవరింట్ల ఏ ఫంక్షన్​ ఉన్నా,  లగ్గం ఉన్నా...  మాంసం వండడం నేను చూడలేదు. మా పిల్లలకు కూడా ఈ ఆచారాన్ని పాటించాలని చెప్తున్నాం. ఊర్లోవాళ్లందరూ కలిసిమెలిసి ఉంటారు. యువతకు కూడా ఎలాంటి చెడు అలవాట్లు లేవు.  అందరి సహకారంతో ఊర్లో ఎవరూ మాంసం, మద్యం ముట్టుకోకుండా చూస్తున్నాం. 
- అశ్విని (గ్రామ సర్పంచ్)​, కరండే మైసాజీ దంపతులు.