అద్దెలు భరించలేక పేద, మధ్య తరగతివాళ్లు 50 ఏళ్లు పైబడ్డ భవనాల్లో భయంగా బతుకుతున్నారు. అవి ఎప్పుడు కూలతాయో తెలియదు. మొన్నామధ్య సౌత్ ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో ఓ ఇల్లు కూలి 16 మంది చనిపోగా 9 మంది గాయపడ్డారు. ఆ నగరంలో ఇలాంటి బిల్డింగ్లు 14 వేల చిల్లర ఉన్నట్లు లెక్కలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై మొత్తం మీద రోజూ ఎక్కడో ఓ చోట కనీసం ఓ నిర్మాణం నేలకొరుగుతోంది. దీంతో బాధితులు ‘హెల్ప్.. హెల్ప్.. ’ అంటూ ఫైర్ బ్రిగేడ్ సెంటర్లకు ఎమర్జెన్సీ కాల్స్ చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
రేపోమాపో నేలమట్టమయ్యే ఇళ్లు 1969లో 19,642 ఉండేవి. ఆ సంఖ్య ఇప్పుడు 14,207కి తగ్గింది. హౌజ్ ట్యాక్స్ రికార్డుల ప్రకారం ఆ బిల్డింగ్లు 1969కి ముందు కట్టినవేనని ఆఫీసర్లు అంటున్నారు. ఈ ప్రమాదకర భవనాలను కూల్చివేయాలన్నా, మరమ్మతు చేయాలన్నా లీగల్ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు ‘ముంబై రిపేర్స్ బోర్డ్’కి బడ్జెట్ కొరత, తగిన రవాణా వసతులు లోపించటం, బిల్డింగ్ల్లోని జనాలను వెంటనే ఖాళీ చేయించాలంటే వాళ్లకు ఎమర్జెన్సీ షెల్టర్లు లేకపోవటం వంటివి సమస్యలుగా మారాయని తెలిపారు.
పబ్లిక్ ఎక్కువ.. ప్లానింగ్ తక్కువ..
‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం రిపోర్ట్–2017’ ప్రకారం ముంబై, సబర్బన్ రీజియన్లలో ప్రస్తుతం కోటీ 20 లక్షల మందికి పైగా పబ్లిక్ ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కి 31,700 మంది నివశిస్తున్నారు. పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది (44,500 మందితో ఢాకా తొలి ప్లేస్‌లో ఉంది). ఇందులో మెజారిటీ పీపుల్ (కొన్ని అంచనాల మేరకు 40 శాతం మంది పైనే) స్లమ్ ఏరియాల్లో ఉంటున్నారు. ప్రకృతి, మానవ తప్పిదాలతో కూడిన విపత్తులకు ముంబై తరచూ గురవుతూ ఉంటుంది.
వరదలు ముంచెత్తటం, ఇళ్లు కూలటం, చెట్లు నేలకొరగటం, కొండచరియలు విరిగిపడటం; మురికివాడల్లో, బిల్డింగ్‌ల్లో, ఆకాశాన్ని తాకేలా ఉండే అపార్ట్మెంట్లలో, ఇండస్ట్రియల్ యూనిట్లలో, ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్‌లో అగ్ని ప్రమాదాలు; టెర్రరిస్ట్ ఎటాక్‌లు కూడా ఈ పాత నగరంలో ఎక్కువే. సిటీలో హారిజాంటల్ గ్రోత్‌కి బదులు వర్టికల్డెవలప్మెంట్ అధికంగా జరుగుతోంది. దీంతో జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఫలితంగా సరైన ప్లానింగ్ లేకుండా, సేఫ్టీ చర్యలు తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు తప్పుపడుతున్నారు.
డైలీ 40 ఎమర్జెన్సీ కాల్స్
ముంబై ఫైర్ బ్రిగేడ్‌కి గత ఆరేళ్లలో (2018–19 నాటికి) దాదాపు లక్ష (99,393) ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయి. ఇందులో ఇళ్లు కూలిన ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ 1830 (1.8 శాతం). దీన్ని బట్టి ఏటా యావరేజ్‌గా 300కు పైనే నిర్మాణాలు నేలకొరిగినట్లు అర్థమవుతోంది. ఇందులో చిన్న చిన్న గోడలు కూలినవి, బిల్డింగ్‌లో ఒక పార్ట్ (పిట్టగోడలు, ఎక్స్టెన్షన్లు, చెక్క నిర్మాణాలు) కొలాప్స్ కావటం, చెట్లు నేలమట్టం కావటం; మనుషులు లేదా జంతువులు ప్రమాదంలో చిక్కుకోవటం, ఫైర్ యాక్సిడెంట్లు వంటివి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
పాడైన సామగ్రితో ప్రమాదాలు
అగ్ని ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ ఏటా పది శాతం పెరిగాయి. గడిచిన ఆరేళ్లలో ఏటా ముంబై ఫైర్ బ్రిగేడ్‌కి సుమారు ఐదు వేల ఫైర్ కాల్స్ వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. ఇందులో షార్ట్ సర్క్యూట్లు చాలా కామన్ అయ్యాయని తెలిపారు. ముంబైలో ఇప్పటికీ భారీ అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. వీటితోపాటు ఓల్డ్ బిల్డింగ్లు, ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పాత భవనాల్లో కాలం చెల్లిన వైరింగ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఎక్కువ శాతం మెట్ల కిందే దర్శనమిస్తాయి.
ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులను బయటకు తీసుకురావటానికి సరైన ఏర్పాట్లు ఉండవు. ఫలితంగా ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంటే మంటల కన్నా పొగ వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలాంటివాటిని నివారించాలంటే బాధితులను తరలించటానికి తగిన ప్రణాళికలు, మార్గాలు ఉండాలి. ముంబైలోని చాలా అపార్ట్మెంట్లలో ఒకే ఒక మెట్ల మార్గం ఉంటుంది. 15 మీటర్లకు పైగా ఎత్తున్న బిల్డింగుల్లో రెండు మెట్ల మార్గాలు ఉండాలని ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు.
డోంగ్రీ ఏరియాలో రోడ్డు వెడల్పు 1.5–2 మీటర్ల వరకే ఉండటంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయ చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముంబైలో కిలోమీటర్ ప్లేస్‌లో 510 కార్లు నిలుపుతున్నారు. దేశంలో కార్లు ఇంత భారీ సంఖ్యలో ఉన్న నగరం ఇదేనని 2018 ట్రాఫిక్ ఇండెక్స్ తెలిపింది. ఈ సర్వేను 56 దేశాల్లోని 403 సిటీల్లో ట్రాఫిక్ ఫ్లోపై నిర్వహించారు. ఈ ట్రాఫిక్ కష్టాలను తగ్గించటానికి, ఎమర్జెన్సీ కాల్స్‌కి క్విక్ రెస్పాన్స్ ఇవ్వటానికి గత ఏడాదిన్నర కాలంలో ముంబైలో 17 మినీ ఫైర్ స్టేషన్లు ఏర్పాటుచేశారు.
ఫైరింజన్‌కు అందని అపార్ట్మెంట్లు
ఆకాశాన్ని తాకుతున్నాయా అనేంత ఎత్తులో కట్టిన అపార్ట్మెంట్లు ముంబైలో 130 చిల్లర ఉన్నాయి. వీటిలో కొన్నింటి హైట్ 100 మీటర్ల (30 అంతస్తుల) నుంచి 250 మీటర్ల(70 అంతస్తుల)కు పైనే. ఫైర్ బ్రిగేడర్లు వాడే నిచ్చెనల ఎత్తు 90 మీటర్లు మించదు. వాటితో 30 అంతస్తుల వరకు మాత్రమే ఎక్కగలరు. అందువల్ల 240–300 మీటర్ల హైట్ ఉండే బిల్డింగ్‌ల్లోకి ఎక్కే నిచ్చెనలు ప్రపంచంలో ఎక్కడా దొరకవని ఫైర్ సేఫ్టీ విభాగం వర్గాలు అంటున్నాయి. ఆ భవనాల్లో ప్రమాదాలు జరిగితే బాధితులను రక్షించటం దాదాపు అసాధ్యమని చెబుతున్నాయి.
అపార్ట్మెంట్లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్; డ్రైనేజీ, సీవేజ్ మేనేజ్మెంట్; ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సరైన ఏర్పాట్లు ఉండాలి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు బిల్డింగుల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలంటే చుట్టుపక్కల రోడ్ల వెడల్పు కనీసం 6 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు ఉండాలని నేషనల్ బిల్డింగ్ కోడ్ సూచిస్తోంది. ఆరు మీటర్లు ఉన్నా సరిపోతుంది. కానీ ఫైరింజన్లు, ఫైర్ ట్రక్కులు లోపలికి వెళ్లటానికి, బయటకు రావటానికి రోడ్డు మరో మూడు మీటర్ల వెడల్పు ఉంటే ఇబ్బంది ఉండదు.