మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు
2020-21 లో 1.42 కోట్ల కొత్త అకౌంట్లు..
గత రెండు నెలల్లోనే 44.7 లక్షల అకౌంట్లు ఓపెన్
బయట కంటే లాభాలెక్కువగా ఉండడమే కారణం..
బిజినెస్‌డెస్క్, వెలుగు: ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే భయపడేవారు. లాభాలు రాకపోయిన పర్వాలేదు, ఉన్న డబ్బులు పోకపోతే చాలు అనుకునేవారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వివిధ స్కీమ్‌లలో డబ్బులు పెట్టడం కంటే కొన్ని షేర్లయినా కొనుక్కోవడం బెటర్ అనే ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది. మార్కెట్‌లో పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల నెంబర్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గత రెండు నెలల్లోనే సుమారు 44.7 లక్షల కొత్త డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2020–21 లో 1.42 కోట్ల రిటైల్ ఇన్వెస్టర్ల అకౌంట్లు పెరిగాయని లెక్కించింది. వీటిలో 1.22 కోట్ల అకౌంట్లు సీడీఎస్‌ఎల్ వద్ద ఓపెన్ అయ్యాయని, మిగిలిన 19.7 లక్షల అకౌంట్లు ఎన్‌ఎస్‌డీఎల్ వద్ద ఓపెన్ అయ్యాయని పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం చూస్తే, స్టాక్ ఎక్స్చేంజిల టర్నోవర్‌లో ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల వాటా కూడా పెరిగింది. కిందటేడాది మార్చిలో స్టాక్ ఎక్స్చేంజిల టర్నోవర్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 39 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 45 శాతానికి పెరిగింది.
మార్కెట్‌లో రిటైల్ పార్టిసిపేషన్ పెరగడానికి కారణాలు..
1) గత ఏడాదిన్నర నుంచి డిపాజిట్లపై వడ్డీ తక్కువగా ఉంది. ఇతర ఇన్వెస్ట్‌మెంట్లపై కూడా పెద్దగా రాబడి కనిపించడం లేదు. దీంతో ఎక్కువగా లాభాలొచ్చే స్టాక్ మార్కెట్ల వైపు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారని ఎస్‌బీఐ రిపోర్ట్ తెలిపింది.
2) గత కొంత కాలం నుంచి రెపో రేటు 4 శాతం వద్దే కొనసాగుతోంది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 2.9 శాతం నుంచి 5.4 శాతం (ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లు) మధ్యే ఉంది. ఇతర సేవింగ్స్ స్కీమ్‌లలో కూడా ఎక్కువగా రిటర్న్‌లు రావడం లేదు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ 7.6 శాతాన్ని, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 7.4 శాతాన్ని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 శాతాన్ని, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 6.8 శాతం వడ్డీని మాత్రమే ఇన్వెస్టర్లకు ఇస్తున్నాయి. అదే ఈక్విటీ మార్కెట్లలో అయితే భారీ లాభాలను చూడొచ్చు. ఇంకా మార్కెట్‌లో ఎంటర్ అవుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. వీరు రిస్క్ తీసుకోవడానికి భయపడడం లేదు.
3) లిక్విడిటీ పెరగడంతో కూడా మార్కెట్‌లో రిటైల్ పార్టిసిపేషన్ పెరిగి ఉండొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచనావేసింది. గ్లోబల్‌గా కూడా లిక్విడిటీ పెరుగుతోంది. కిందటేడాది ఇండియన్ మార్కెట్లలోకి 36 బిలియన్ డాలర్లు వచ్చాయి. లిక్విడిటీ ఎక్కువగా ఉంటే డబ్బులు తీసుకొచ్చి తిరిగి ఈక్విటీలు, గోల్డ్ వంటి వాటిలో పెట్టాలని ఇన్వెస్టర్లు చూస్తారు.
4) కరోనా సంక్షోభం వలన ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువగా గడిపారు. ఖాళీ టైమ్ ఎక్కువగా ఉండడం కూడా మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఒక కారణమని ఎస్‌బీఐ పేర్కొంది.
5) ఎస్‌బీఐ రిపోర్ట్ ప్రకారం, ఇతర మార్కెట్లతో పోలిస్తే 2020 లో ఇండియన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వేగంగా పెరిగింది. బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ ఏడాది ముందు కంటే 1.8 రెట్లు పెరిగింది. 1.6 రెట్ల పెరుగుదలతో రష్యా మార్కెట్ మన తర్వాత ఉంది. బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా మార్కెట్లు ఆ తర్వాత ఉన్నాయి.
53 వేలను టచ్ చేసిన సెన్సెక్స్..
బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ మొదటి సారిగా మంగళవారం 53 వేల మార్క్‌ను టచ్ చేసింది. కానీ, ఆ స్థాయిల వద్ద నిలవలేక తిరిగి కిందకి పడింది. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగి 53,057 వద్ద ఆల్‌టైమ్ హైని రికార్డ్ చేసింది. ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకోవడంతో చివరికి 14.25 పాయింట్లు మాత్రమే లాభపడి 52,589 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 26.25 పాయింట్లు పెరిగి 15,773 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌లో మారుతి, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టైటాన్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కరోనా కేసులు తగ్గుతుండడం, వ్యాక్సినేషన్ ప్రాసెస్ వేగంగా జరుగుతుండడంతో మార్కెట్లు పాజిటివ్‌గా ఓపెన్ అయ్యాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ అన్నారు. షాంఘై, సియోల్, టోక్యో మార్కెట్లు లాభాల్లో ముగియగా, హాంకాంగ్ నెగిటివ్‌లో క్లోజయ్యింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు తగ్గి 74.37 వద్ద సెటిలయ్యింది.
ఐపీఓలు దూసుకుపోయాయి..
గత ఆర్థిక సంవత్సరంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కి వచ్చిన కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశ పరచలేదనే చెప్పాలి. కంపెనీలు కూడా నిరాశపడలేదు. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయిస్తున్న షేర్లు రెండు రెట్లు కంటే ఎక్కువగా సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. ఎంటీఏఆర్, హ్యాపియెస్ట్ మైండ్స్, బర్గర్ కింగ్, మిషెస్ బెక్టర్స్ ఫుడ్స్ స్పెషాలిటీస్, గ్లాండ్ ఫార్మా వంటి కంపెనీల ఐపీఓలను రిటైల్ ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ షేర్లు లిస్టింగ్ రోజు కూడా మినిమమ్ 50 శాతం కంటే ఎక్కువ ధరకు లిస్ట్ అయ్యాయి. ఐపీఓలకు సబ్‌స్క్రయిబ్ కావడం.. షేర్లు అలాట్ అయితే లిస్టింగ్ అయ్యాక రెండు మూడు రోజులు వెయిట్ చేయడం, తర్వాత వాటిని అమ్మేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం ఇలానే రిటైల్ ఇన్వెస్టర్ల తీరు నడిచిందని చెప్పొచ్చు. మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరుగుతోందని, కానీ ఇది తాత్కాలికమా? లేదా వారి ఆలోచన విధానంలో మార్పొస్తోందా? అనేది తెలియడానికి వెయిట్ చేయాల్సిందేనని ఎస్‌బీఐ రిపోర్ట్ తెలిపింది.