నేరం రుజువుకాకున్నా జైళ్లలోనే 30,153 మంది

నేరం రుజువుకాకున్నా జైళ్లలోనే 30,153 మంది
  • గతేడాది జైళ్లలో 41,138 మంది ఖైదీలు
  • అందులో 30,153 మంది అండర్‌‌‌‌ ట్రయల్స్‌‌
  • నిందితుల్లో 27,882 మంది పురుషులు,2,249 మంది మహిళలు
  • జైళ్ల శాఖ వార్షిక నివేదికను రిలీజ్ చేసిన డీజీ సౌమ్యమిశ్రా 

హైదరాబాద్‌‌, వెలుగు: నేరం రుజువుకాకున్నా జైళ్లలో మగ్గుతున్నవారి సంఖ్య పెరిగిపోతున్నది. గతేడాది రాష్ట్రంవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 41,138 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అందులో 30,153 మంది నిందితులుగా జైళ్లలో ఉన్నారు. బుధవారం జైళ్ల శాఖ వార్షిక నివేదికను డీజీ సౌమ్యమిశ్రా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలోని జైల్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో రాష్ట్ర జైళ్ల శాఖ మంచి ఫలితాలను సాధిస్తున్నదని తెలిపారు. 

డ్రగ్స్,గంజాయి వంటి కేసులు పెరిగాయని..ఆ కేసులకు సంబంధించిన నిందితులే జైళ్లలో ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. జైళ్లలో టెర్రరిస్టుల సంఖ్య తగ్గిందన్నారు. జైళ్లలోని ఖైదీలను విద్యావంతులను చేయడం, వారికి ఉపాధి కల్పించడంతో జైళ్ల శాఖ మంచి ఫలితాలు సాధిస్తున్నదన్నారు. ఈ క్రమంలోనే జైలుకొచ్చే వీఐపీలకు కూడా  జైల్‌‌ మ్యాన్యువల్‌‌, కోర్టు ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హీరో అల్లు అర్జున్‌‌ జైలుకు వచ్చిన సమయంలో ఎలాంటి ప్రత్యేక వసతులు కల్పించలేదని పేర్కొన్నారు. 

పురుష ఖైదీలే 27,882 మంది 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో 2023తో పోలిస్తే 2024 ఏడాదిలో ఖైదీల సంఖ్య పెరిగినట్టు డీజీ సౌమ్యమిశ్రా  వెల్లడించారు. 2023లో మొత్తం 31,428 మంది జైలుకు రాగా..2024కు ఆ సంఖ్య 41,138కి చేరిందన్నారు. గతేడాది అన్ని జైళ్లలో 30,153 మంది అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నట్లు తెలిపారు. వీరిలో 27,882 మంది పురుషులు కాగా..2249 మంది మహిళలు, ట్రాన్స్‌‌జెండర్స్‌‌ 22 మంది ఉన్నట్లు వివరించారు. 

303 మందిని పెరోల్‌‌ మీద పంపినట్లు చెప్పారు. 2023లో ఎన్‌‌డీపీఎస్‌‌ కేసులలో 3688 మంది ఖైదీలు జైలుకు రాగా.. 2024లో ఆ సంఖ్య 6,311కి చేరిందన్నారు. 2023లో 52 మంది టెర్రరిస్ట్ తరహా ఖైదీలు ఉండగా, 2024లో ఆ సంఖ్య 36కి తగ్గిందన్నారు. మర్డర్ కేసులలో ఖైదీల సంఖ్య 2023లో 2511 ఉండగా.. 2024లో అది 2754కు చేరిందన్నారు. 1045 మంది ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందించినట్టు పేర్కొన్నారు.  

12,650 మందికి చదువు చెప్పాం

రాష్ట్ర  జైళ్లలో ఇప్పటి వరకు 12,650 మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామని డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు. మరో 750 మంది ఖైదీలు గ్రాడ్యుయేషన్‌‌, 225 మంది ఖైదీలు పోస్ట్‌‌ గ్రాడ్యుయేషన్‌‌ పూర్తి చేశారన్నారు. ఖైదీల్లో సత్‌‌ప్రవర్తన తీసుకొచ్చేందుకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌‌, డీజిల్‌‌ బంక్స్‌‌, ఔట్‌‌లెట్స్‌‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. 

29 ఔట్‌‌లెట్స్‌‌లో 86 మంది సెమీ ఓపెన్‌‌ ప్రిసన్స్‌‌,197 మంది రిలీజ్‌‌ అయిన ఖైదీలకు ఉపాధి కల్పించామని వివరించారు. శిక్షలు అనుభవిస్తూ 3 ఏండ్లకు పైగా జైళ్లలో ఉంటున్న ఖైదీలకు వారి వేజెస్‌‌ ఆధారంగా లోన్స్‌‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 552 మందికి రూ.1.73 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. గతేడాది 58 మందికి రూ.22.46లక్షలు మంజూరు చేశామని డీజీ సౌమ్యమిశ్రా పేర్కొన్నారు.