ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని నిజాంసాగర్ కాలువ తెగి పోవడంతో నష్టపోయిన కెనాల్ కట్ట వాసులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి .ప్రభాకర్, జిల్లా నాయకులు బి.దేవరాం, ముత్తన్న కెనాల్ కట్టను పరిశీలించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కాలువ తెగిపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అన్నారు. కెనాల్ నీటితో ఇండ్ల సామగ్రి కొట్టుకుపోయిందన్నారు. బాధితులను గుర్తించి కుటుంబానికి రూ.20 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కెనాల్ కట్ట వెంట ఇల్లు కట్టుకుని ఉంటున్న అందరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి. బి. కిషన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్, జిల్లా నాయకులు ఆకుల గంగారం, శేఖర్, లక్ష్మి, బి.కిషన్, అరవింద్, రవి పాల్గొన్నారు.