
ట్యాక్స్.. పన్నులకు కాదేదీ అనర్హం అన్నట్లు ఉంది సర్కార్ తీరు. వస్తువు ఏదైనా కొన్నా, అమ్మినా పన్నులు కట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది మరో లెవల్ కు వెళ్లింది. అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ లపైనా జీఎస్టీ.. GST విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా షాకింగ్ కు గురి చేస్తుంది. అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ కోసం కట్టే ఛార్జీలపైనా జీఎస్టీ విధిస్తూ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది.
ఇప్పటికే పాల నుంచి నీళ్ల వరకు, అద్దెల నుంచి స్కూలు ఫీజుల వరకు పెరిగిపోవటంతో బతకటం కష్టంగా మారిందంటున్నారు జనం. పెరిగిపోతున్న ఖర్చులు.. ప్రజల సేవింగ్స్ తినేస్తున్నాయనే ఆందోళనలు ఉన్న సమయంలోనే.. అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ పైనా పన్నులు అనే వార్త మధ్య తరగతి కుటుంబాలను ఆగమాగం చేస్తోంది.
అపార్ట్ మెంట్ వాసులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. బెంగళూరులో చర్చనీయాంశం అయ్యింది. నగరంలోని హౌసింగ్ సొసైటీల నెలవారీ మెయింటెనెన్స్ వసూళ్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలనుకోవటమే దీనికి కారణం. జీఎస్టీ అథారిటీలు తీసుకునే ఈ చర్య ఒక్క బెంగళూరు సిటీలోనే దాదాపు 50 లక్షలకు పైగా బెంగళూరు అపార్ట్మెంట్ వాసులపై భారం పడుతుంది. దీంతో మైసూరు, మంగళూరు, హుబ్లీ, బెళగావీ వంటి నగరాల్లో మరో 40 లక్షల కుంటుంబాలు ప్రభావితం కానున్నాయి. లెటేస్ట్ గా బడ్జెట్లో దీనికి సంబంధించి కీలక మార్పులు చేయబడ్డాయి.
అపార్ట్మెంట్ నెలవారీ మెయింటెనెన్స్ రూ.7వేల 500 దాటితే లేదా ఏడాదికి సొసైటీ వసూళ్లు రూ.20 లక్షలు దాటినట్లైతే.. అలాంటి వారు అందరూ జీఎస్టీ 18 శాతం కట్టాలి. సొసైటీ ఆర్థిక సంవత్సరంలో పెయింటింగ్స్, లిఫ్ట్ మార్పులు వంటివి చేపడితే అవి కూడా జీఎస్టీ కిందకు రానున్నాయి. దీనిపై ఇప్పటికే అనేక అపార్ట్మెంట్లలో నివసిస్తున్న యజమానులు, అద్దెదారులు వాట్సాప్ గ్రూపుల్లో జీఎస్టీ వసూళ్లపై చర్చలు కొనసాగిస్తున్నారు. అసలు జీఎస్టీ కింద రిజిస్టర్ కావాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. రిజిస్టర్ అయితే ప్రతి నెల 11, 20 తేదీల్లో రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏడాదికి ఒకసారి పూర్తి రిటర్న్స్ కూడా దాఖలు చేయక తప్పదు.
ఒకవేళ మెయింటెనెన్స్ కింద ఏడాదికి రూ.20 లక్షలు సొసైటీ వసూలు చేస్తే.. దానిపై 18 శాతం అంటే రూ..3 లక్షల 60 వేలు కేవలం పన్నుల రూపంలో చెల్లించక తప్పదు. ఇది అపార్ట్మెంట్లలో నివసించేవారిపై అదనపు భారంగా మారుతుంది. దీనికి తోడు ఆడిటర్ ఖర్చులు ఏటా రూ.2 లక్షల వరకు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపై అపార్ట్మెంట్ సొసైటీలు జీఎస్టీ సమ్మతిని తప్పక ఫాలో కావాల్సి ఉంటుంది. లేకపోతే అధికారుల నుంచి నోటీసులతో పాటు జరిమానాలను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.