పెత్తందారీ గడీల పాలనతో విసిగిపోతున్న జనం

  • ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదరుచూపు
  • బహుజనుల ఎదురు చూపులు ఫలించేదెప్పుడు ?
  • బడుగులకు రాజ్యాధికారం అందేనా..?
  • పోరాటం దిశగా నడిపించే నాయకత్వం కోరుకుంటున్న ప్రజలు
  • బడుగుల అడుగులు రాజ్యాధికారం దిశగా పడతాయా?

ఎన్నో ఏండ్లుగా రాజ్యాధికారం కోసం బహుజనులు ఎదురు చూస్తున్నారు. అణచివేత, అన్యాయాలు, దోపిడీలకు గురైన ఈ వర్గాలకు ఇకనైనా రాజ్యాధికారం దక్కాలి. తెలంగాణ మళ్లీ భూస్వామ్య, పెత్తందారీ గడీల పాలనవైపు అడుగులు వేస్తుండడంతో ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఈ దశలో కమిట్ మెంట్, అవగాహన, సమర్ధత ఉన్న ఈటల రాజేందర్ లాంటి వారి నాయకత్వాన్ని యువత, ఉద్యోగులు, మేధావి వర్గం కోరుకుంటోంది. 

తెలంగాణ ప్రజానీకం తమపై జరుగుతున్న అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా ఎన్నో ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. 1921లో ఈ పోరాటం మొదలైంది. ఆ ఏడాది నవంబర్​12న నిజాం రాష్ట్రంలో హిందూ సంఘ సంస్కరణ సభ జరిగింది. అందులో తెలుగు భాషపై మరాఠీ, కన్నడ భాషా నాయకులు చూపిన వివక్షతో తల్లడిల్లిన తెలంగాణ మేధావులు తెలంగాణ భాషావాదానికి పునాదులు వేశారు. అది మొదలు 2014 వరకు అవిశ్రాంత పోరాటాలు తెలంగాణలో సాగాయి.
నిర్బంధాలు, అణచివేత
భాషాపరమైన వివక్షకు వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం స్థానిక ప్రజల హక్కుల కోసం నినదించే ఉద్యమాలుగా మారాయి. స్థానికులకు భూమిపై హక్కు కోసం పెద్ద ఎత్తున ప్రజలు పిడికిలి బిగించారు. పాలకుల నిర్లక్ష్యం, నిరంకుశ పాలన మూలంగా స్థానిక యువత విద్య, ఉద్యోగ రంగాల వైపు మరలలేదు. పైగా నిర్బంధానికి గురైంది. స్వాతంత్ర్యం వచ్చి నిరంకుశ నిజాం రాజ్యం అంతరిస్తే తమ బిడ్డలు విద్యావంతులై మెరుగైన జీవితాలు పొందగలరని, ఆకలి చావులు, అవమానాలు, బిక్కుబిక్కు మంటూ జీవించే పరిస్థితులు మారుతాయని ఆకాక్షించారు. ఈ దరిమిలా సామాన్యుడి నుంచి భూస్వామి వరకు నిజాం వ్యతిరేక ఉద్యమాలు నడిపిన నేపథ్యం తెలంగాణకు అనుభవమే. విలీనోద్యమం, బ్రహ్మ, ఆర్యసమాజ్, గిరిజన, రైతాంగ సాయుధ పోరాటాలు, ఆది హిందూ, మహిళా, ముల్కీ ఉద్యమాలతో ఈ గడ్డ నిత్య చైతన్యం. తుపాకీ తూటాలు, లాఠీ దెబ్బలకు వెరువని ధైర్యాన్ని ఈ నేల ప్రదర్శించింది. వేలాది యోధుల రక్త తర్పణ తర్వాత దేశం స్వాతంత్ర్య వెలుగుల్ని చూసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన ఉద్యోగం, విద్య, బానిసత్వ విముక్తి రానురాను కనుమరుగై హైదరాబాద్​ రాష్ట్రం మనువాద, భూస్వామ్య పెత్తందార్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్నది. ఫలితంగా ప్రజలు మరింత నిర్బంధాన్ని, అణచివేతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
రెండు, మూడు కులాలే రాజ్యమేలాయి
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఆవిర్భావం జరిగిపోయింది. ఆ సందర్భంగా విశాలాంధ్రప్రదేశ్​ ఏర్పాటుతో సమతుల్య అభివృద్ధి జరిగి తెలంగాణ ప్రజానీకం నాణ్యమైన జీవనాన్ని కొనసాగించగలరని కేంద్ర, స్థానిక, ఆంధ్ర ప్రాంత నాయకులు నమ్మబలికారు. కానీ, 1956 నుంచి 1968 వరకు జరిగిన పరిణామాలేవీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సమస్యలను అడ్రస్​ చేయలేదు. ఆంధ్రా పెత్తందారీ కులాలు, తెలంగాణ పెత్తందారీ కులాలతో జతకట్టినాయి. ఫలితంగా పదవుల పెనుగులాటే తప్ప తెలంగాణ ప్రాంత ఆకాంక్షలైన వెట్టి చాకిరి, బానిసత్వ విముక్తి, భూ సంస్కరణలు, నీటి వనరుల పెంపు, ఉద్యోగ కల్పన, స్వీయ గౌరవం వంటివి అలాగే మిగిలిపోయాయి. రాజ్యాంగాన్ని కాలరాస్తూ సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి రెండు, మూడు కులాలే రాజ్యమేలాయి. 
ఉద్యమాన్ని వాడుకున్న భూస్వామ్య వర్గాలు
దీంతో 1969లో ప్రత్యేక రక్షణల ఉద్యమంగా మొదలై ‘జై తెలంగాణ’ ఉద్యమంగా రాజుకున్న చరిత్ర తెలంగాణ సొంతం. ఈ ఉద్యమంలోనూ దాదాపు 90 శాతం మరణాలు బీసీ, ఎస్సీలవే. రవీంద్రనాథ్​, మల్లిఖార్జున్, మదన్​ మోహన్, నాగల కృష్ణ, సంతపురి రఘువీర్​రావు, శ్రీధర్​రెడ్డి, శంకర్(తొలి అమరుడు), పులి వీరన్న, వెంకట్రామరెడ్డి, కేఆర్​ ఆమోస్, కొండా లక్ష్మణ్​ బాపూజీ, టీఎన్ సదాలక్ష్మి, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కీలక పాత్ర పోషించారు. అయితే 1969లో అష్ట సూత్ర పథకం, 1972లో ఐదు సూత్రాల పథకం, 1973లో ఆరు సూత్రాల పథకాల పేరుతో ఆనాటి నాయకుల్ని మభ్యపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చారు. ఈ ఉద్యమం ద్వారా రెడ్డి సామాజిక వర్గం, ఇతర భూస్వామ్య వర్గాలు లబ్ధిపొందాయి. ఈ సందర్భంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆలోచనల్ని 
పరిగణనలోకి తీసుకోలేదు. 
కొంత ఆశ కలిగించిన నక్సల్​ ఉద్యమం
మొత్తంగా 1969 ఉద్యమం అణచివేతతో తెలంగాణ ప్రజానీకం తిరిగి అంధకారంలోకి వెళ్లిపోయింది. నిరుద్యోగం, పేదరికం, వెట్టిచాకిరి బహుజన కులాల వంతుగా మారిపోయింది. అంటరానితనం, భూమి, సంపదల కేంద్రీకరణ, అరాచక పాలన తెలంగాణ అంతటా తాండవించింది. దొర న్యాయం దోపిడీకి మారుపేరుగా తయారైంది. పోలీసుల క్యాంపులు, హత్యలు, మానభంగాలు నిత్యకృత్యమై తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. పేదరికం, నిరుద్యోగం మునుపెన్నడూ లేనంతగా పెచ్చరిల్లిపోయాయి. ఇదే కాలంలో పశ్చిమ బెంగాల్​లో నక్సల్బరీ పోరాటం గర్జించింది. పేదరికంపై దండయాత్రగా అంటే భూమి పంపిణీ, దోపిడీపై తిరుగుబాటు, నిరుద్యోగ పరిష్కార ప్రత్యామ్నాయాలను ప్రజల ముందుంచి ఆశలు పుట్టించింది. ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా గోదావరి నదీ లోయ ప్రాంతాల్లో విస్తరించి దక్షిణ తెలంగాణను తాకింది. తెలంగాణ యువత, విద్యార్థి, మేధావి వర్గం ఈ పోరాటాన్ని నడిపించింది. కొంత మేరకైనా బహుజన వర్గాల సమస్యల్ని చర్చించి పరిష్కారాలను చూపెడుతున్న క్రమంలోనే ఆ ఉద్యమం సైద్ధాంతిక, రాజకీయ వైరుధ్యాలతో కొంత, నిషేధం, అణచివేత వంటి ప్రభుత్వ దుష్కృత్యాలతో 
కొంత పలుచబడింది. 
మళ్లీ దోపిడీ వర్గాల చేతుల్లోకి తేలంగాణ
నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ దిక్సూచిలా కనిపించింది. బీసీలకు నాయకత్వంలో ప్రాధాన్యత, యువతకు రాజకీయాల్లో చురుకైన పాత్ర వంటి కొన్ని అడుగులు పడుతున్న తరుణంలోనే ఆ పార్టీ గాడి తప్పి గ్లోబలైజ్​ అయ్యింది. ప్రజల ఆకాంక్షల్ని పక్కకు నెట్టి కమ్మకుల ప్రయోజనాలే లక్ష్యంగా హైదరాబాద్​చుట్టుపక్కల ప్రాంతాల్ని టార్గెట్​ చేసి పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసింది. భూస్వామ్య నిర్బంధాల్లో నుంచి పెట్టుబడిదారీ, దోపిడీ వర్గాల చేతుల్లోకి తెలంగాణ జారుకుంది. తెలంగాణ రెడ్డి, వెలమ, ఆంధ్రా రెడ్డి, కమ్మ ప్రయోజనాలకు లోటు లేని విధానాలు రాజ్యమేలాయి.  ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు, విప్లవ సంఘాలు తెలంగాణ విధ్వంసాన్ని బాహాటంగానే విమర్శించాయి. మరోవైపు ఈ ప్రాంత మేధావి వర్గం తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన జరుగుతున్న నిలువుదోపిడీని చర్చకు పెడుతూ ఎండగడుతూనే వచ్చాయి. భూవనగిరి డిక్లరేషన్(1997 జనవరి 7,8 తేదీలు) అదే ఏడాది జరిగిన వరంగల్​డిక్లరేషన్ తో పాటు యూనివర్సిటీల్లో డిబేట్స్​ జరిగాయి. ఎన్నో సంస్థలు ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పనిచేశాయి. బెల్లి లలిత, మారాజు వీరన్న వంటి వారు ప్రాణాలే పణంగా పెట్టారు. తెలంగాణ గోసను తీర్చేందుకు కష్టాలు పడ్డది బహుజనులే. ముఖ్యంగా బీసీ వర్గాలే.
టీఆర్ఎస్ ను భుజాన మోసిన అన్ని వర్గాలు
తీవ్ర నిరాశ, ఆందోళనల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంత దోపిడీ, కులాల కుటిల నీతి పాలనతో విసిగిపోయి కొత్త మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలోనే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్​ అరంగేట్రం జరిగింది. రైతులు, యువత, మేధావి వర్గం, పేద, శ్రామిక, కార్మిక వర్గాలు ఇలా ఒక్కటేమిటి అన్ని వర్గాలు టీఆర్ఎస్​ ఉద్యమాన్ని, రాజకీయాన్ని భుజాన మోశాయి. 1,400 మంది అమరుల్లో 95 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే. త్యాగాలకు సిద్ధమైన యువత, విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టగా, ఉద్యోగులు నిర్బంధాల్ని అధిగమించి ఉద్యమాన్ని ఉన్నత స్థితికి చేర్చిన సంగతి ఎప్పటికీ మరవలేని చారిత్రక ఘట్టాలు. కాగా, ఉద్యమాన్ని నడపడానికి అవసరమైన త్యాగాలు, ప్రణాళికలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వంతైతే, నాయకత్వం రెడ్డి, వెలమ కులాల వంతైంది. 
బహుజనులకు రాజ్యాధికారం దక్కాలె
తమ వర్గాలకు రాజ్యాధికారం దక్కితేనే గానీ తమ ఆకాంక్షలు నెరవేరవని విశ్వసిస్తున్న బహుజన కులాల విద్యార్థి, మేధావి, రాజకీయ వర్గాలు అవకాశం కోసం చూస్తున్నాయి. మూడెకరాల భూమి అటకెక్కి, డిప్యూటీ సీఎం పదవి తొలగింపబడి, విద్య వైద్యానికి దూరమై ఉద్యమంలో బిడ్డల్ని కోల్పోయిన బహుజన కులాల ప్రజలు మరో ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ తిరిగి భూస్వామ్య, పెత్తందారీ గడీల పాలనవైపు అడుగులు వేస్తుండటంతో ప్రజలు అట్టుడికిపోతున్నారు. విద్యావంతుడైన ఈటల రాజేందర్​ వంటి వారి నాయకత్వాన్ని ఇప్పుడు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ, మేధావి వర్గం కోరుకుంటోంది. ఏ స్వీయ గౌరవం కోసమేతే తెలంగాణ కొట్లాడిందో అదే బూడిదలో పోసిన పన్నీరు కావడంతో తీవ్ర ఆవేదన, సంఘర్షణతో ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈటల బహుజన రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం. నిజాం నుంచి విముక్తి చెంది, ఆంధ్రా రెడ్డి, కమ్మ కర్కశత్వం నుంచి విడిపించబడి, తెలంగాణ వెలమ చెరలో చేష్టలుడిగి ఉన్న తెలంగాణకు బహుజన రాజ్యాధికార ప్రజాస్వామ్య సామాజిక తెలంగాణ ఆశగా ఈటల రాజేందర్​ నడవాలని కోరుకుందాం. 
ఒక కుటుంబ చెరలో ఆకాంక్షలు బందీ
తెలంగాణ సాధించుకుని దళిత ముఖ్యమంత్రి కోసం తపన పడుతున్న వర్గాలకు.. సీఎం అయ్యాక కేసీఆర్​ అద్భుతమైన బహుమానాన్ని తాటికొండ రాజయ్య బర్తరఫ్​ రూపంలో అందించారు. తరతరాల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు కుటుంబ చెరలో బందీ అయ్యాయి. నియామకాల మాటెత్తితే నిప్పులు గక్కుతున్నారు. నీళ్ల సంగతి బుద్ధుడెరుగు. బడ్జెట్​ ఏ పంచన చేరుతుందో తెలియని స్థితి. మొత్తంగా నిరుద్యోగం, భూమి పంపిణీ, విద్య, వైద్యం పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు తీవ్ర నిరాశలో ఉండగా, బీసీ వర్గాల నాయకుడు, సాత్విక స్వభావి, ఉద్యమ నేపథ్యం ఉన్న సమర్థుడు ఈటల రాజేందర్​ మంత్రి పదవిని అవమానకరంగా లాగేసుకున్నారు. 

బహుజన నాయకత్వంపై కుట్రలు
బహుజన వర్గాలు నాయకత్వం వహించే సందర్భం వచ్చిన ప్రతిసారి దోపిడీ కులాలు నీరుగార్చడం లేదంటే బదనాం చేయడం, కాదంటే కుట్రలతో ఉద్యమానికే దూరం చేసే పరిస్థితిని కల్పించారు. ఇందులో అందె వేసిన చేయి కేసీఆర్​ది. బీసీ కులాల నాయకత్వం తెర మీదికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. టైగర్​ నరేంద్రను బలి చేయడం ఈ కుట్రలో భాగమే. నరేంద్రను నాయకత్వ స్థానంలో లేకుండా చేసే వరకు నిద్రపోలేదు. ఇందులో బీసీ వర్గాలను సమర్థవంతంగా వాడుకున్నాడు. విజయశాంతి కడుపు మంట ఇంకా రగులుతున్నట్టే కనిపిస్తున్నది. చెరుకు సుధాకర్​ వంటి ఉద్యమకారుల్ని అవమానించి శంకరగిరి మాన్యాలు పట్టించిన ఘనత కేసీఆర్​దే. కోదండరాంను సార్​ సార్​ అంటూనే సాంతం ఖతం బట్టించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేయడమే కేసీఆర్​ నేర్పరితనం. - డా.​ కదిరె కృష్ణ, బహుజన సేన అధ్యక్షుడు