కరీంనగర్ లో పక్కన నిల్చున్నా ప్రాణాలు తీస్తున్నయి.. జనాన్ని బలిగొంటున్న హైవే వర్క్స్ వాహనాలు

కరీంనగర్ లో పక్కన నిల్చున్నా ప్రాణాలు తీస్తున్నయి..  జనాన్ని బలిగొంటున్న హైవే వర్క్స్ వాహనాలు
  •     ఇటీవల హుజూరాబాద్‌‌లో మట్టి టిప్పర్ మీదపడి ముగ్గురి మృతి  
  •     తాజాగా తాడికల్‌‌లో కిరోసిన్ ట్యాంకర్ బోల్తాపడి ఒకరి మృతి
  •     హైవే విస్తరణ పనులు మొదలయ్యాకపెరిగిన ప్రమాదాలు
  •     ఓవర్ స్పీడ్ తో యాక్సిడెంట్లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్–వరంగల్ నేషనల్ హైవే -563పై రోడ్డు పక్కన నిల్చున్నా జనం ప్రాణాలు పోతున్నాయి.   ఇటీవల నేషనల్ హైవే వర్క్స్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన టిప్పర్ బోల్తాపడి హుజూరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా.. అదే సంస్థకు చెందిన డీజిల్ ట్యాంకర్ బుధవారం బోల్తాపడి జాతీయ స్థాయి ఖోఖో ప్లేయర్ చనిపోయాడు. హైవే పై ఇటీవల ఎదురెదురుగా, వెనకాల నుంచి వాహనాలు ఢీకొన్న ప్రమాదాల్లో పలువురు చనిపోయారు. నిరుడు డిసెంబర్ చివరి వారంలో  వరంగల్‌‌–-హుజూరాబాద్‌‌ మార్గంలో జరిగిన నాలుగు ప్రమాదాల్లో  ఏడుగురు మరణించగా.. గత నాలుగున్నర నెలల్లో 10 మందికిపైగా చనిపోయారు. దీంతో ఈ రహదారిపై రాకపోకలు సాగించాలంటేనే జనాలు జంకుతున్నారు. 


అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్.. 


నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఏప్రిల్ 5న అర్ధరాత్రి సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్ కు మట్టితో టిప్పర్ బయల్దేరింది. హుజురాబాద్‌‌లోని బోర్నపల్లి మూలమలుపు వద్ద డ్రైవర్ బ్రేక్ వేయడంతో ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది.  అదే టైంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బైక్ పై వస్తుండగా టిపర్‌‌‌‌లోని మట్టి వారి మీద పడడంతో అన్నాచెల్లెలు గంటా విజయ్, సింధూజ సజీవ సమాధి కాగా వారి సోదరి గంటా వర్ష చికిత్స పొందుతూ చనిపోయింది. 

ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు.. 

  ఫిబ్రవరి 7న కొత్తగట్టు గ్రామ శివారులో టిప్పర్, కారు ఢీకొని కరీంనగర్ కోతిరాంపూర్ కు చెందిన తాళ్లపెళ్లి కొమరమ్మ(65), నల్ల ప్రభాకర్(55) చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.


  ఫిబ్రవరి 24న మొలంగూర్ శివారులోని కరీంనగర్ పాల డైరీ ఎదుట రెండు బైక్ లు ఢీకొని సాంబశివారెడ్డి(48) మృతిచెందాడు.

  ఏప్రిల్ 4న  కేశవపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట  బస్సు ఢీకొని సిరిసిల్ల ఆంజనేయులు (33) చనిపోయాడు.

  ఏప్రిల్ 7న  కేశవపట్నం శివారులో బైక్‌‌ ఢీకొని ఐలయ్య(43) చనిపోయాడు
  ఏప్రిల్ 14న కేశవపట్నం శివారులో చెట్టును కారు ఢీకొని గోనెల సుదర్శన్(70)  చనిపోయారు.

ఓవర్ స్పీడ్ తో యాక్సిడెంట్లు

కరీంనగర్– వరంగల్ నేషనల్‌‌హైవేపై గతంలో జరిగిన యాక్సిడెంట్లను పరిశీలిస్తే ఓవర్ స్పీడ్ తోనే ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. బోర్నపల్లిలో మట్టి టిప్పర్ బోల్తాపడి ముగ్గురు, బుధవారం తాడికల్‌‌లో డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఓవర్ స్పీడ్ తో వెళ్తూ సడెన్ బ్రేక్ వేయడంతోనే అదుపు తప్పి బోల్తాపడి ఒకరి ప్రాణాలు పోయాయి. దీంతోపాటు హైవే పనులు జరుగుతున్న ఏరియాల్లో చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పనులు ప్రారంభయ్యాక నిర్మాణ పనుల వల్ల కొన్ని చోట్ల  రోడ్డు ఇరుగ్గా మారింది. ఇలాంటి చోట్ల కూడా ఓవర్ టేక్  చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి.