- ఆర్అండ్ఆర్ కాలనీలో ఒంటరి మహిళల గోస
- భర్త చనిపోతే ఇంటి రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు
- యువతీ యువకులకు పట్టా ఇచ్చి ప్లాట్లు లెవ్వు పొమ్మంటున్నరు
- నాన్‌లోకల్ పేరుతో ఇండ్లు ఇచ్చేది లేదంటున్నరు
సిద్దిపేట/గజ్వేల్: వెలుగు : కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం విలువైన భూములను కోల్పోయారు. ఇండ్లనూ వదులుకున్నారు. కన్నీళ్లతో కన్న ఊరును కట్టుబట్టలతో వదిలి వెళ్తే అధికారులు వారి త్యాగానికి తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదు. హామీలు మాత్రమే ఇచ్చి నెరవేర్చకుండా కష్టపెడుతున్నారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. తమ డిమాండ్ల కోసం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలోని నిర్వాసితులైతే రెండు రోజుల క్రితం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. వారంలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆల్టిమేటమ్ జారీ చేశారు. లేకపోతే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు.
తరలించారు..వదిలేశారు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల కెపాసిటీతో 18 వేల ఎకరాల్లో అతి పెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్న సాగర్ ను సర్కారు నిర్మించింది. ఇందులో తొగుట, కొండపాక మండలాల పరిధిలోని 12 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఎకరాకు రూ.6 నుంచి 8 లక్షల వరకు పరిహారం ఇవ్వడంతో పాటు ఒక్కో కుటుంబానికి 7.5 లక్షల ప్యాకేజీ, ప్లాట్లు తీసుకున్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు, తీసుకోని వారికి ఆర్అండ్ఆర్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించారు. 18 ఏండ్లు నిండిన వారికి రూ.5 లక్షల ప్యాకేజీతో పాటు 250 గజాల ప్లాట్లను మంజూరు చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 600 ఎకరాల్లో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి ఇండ్లిచ్చారు. ప్లాట్లు కావాలని అడిగిన వారికి గజ్వేల్ సమీపంలో మూడు వేల ప్లాట్లను కేటాయించారు. రెండేండ్ల కింద నిర్వాసితులందరినీ వారి గ్రామాల నుంచి ఆఘమేఘాల మీద తరలించారు. తర్వాత పెండింగ్ పరిహారాలతో పాటు కొత్తగా ఏర్పడ్డ సమస్యల గురించి పట్టించుకోవడం లేదు.
ప్రధాన సమస్యలివే...
నిర్వాసితులు ప్యాకేజీ తీసుకున్న తర్వాత కుటుంబ యజమానికి చనిపోతే అతనికి కేటాయించిన ఇంటిని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా, అధికారులు లేట్ చేస్తున్నారు. ఓపెన్ ప్లాట్లు కేటాయించినా రిజిస్ట్రేషన్ చేయకపోవడం , 18 ఏండ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చినా ప్లాట్లు కేటాయించకపోవడంతో సమస్య ముదురుతోంది. ముంపు గ్రామాల్లోని నిర్వాసితుల ఆస్తులకు పరిహారమిచ్చిన అధికారులు వారినే ప్రస్తుతం నాన్ లోకల్ అంటూ వారు ఉంటున్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు.
ఒకటే హైస్కూల్...రెండు ప్రైమరీ స్కూల్స్...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపా లిటీ పరిధిలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో కావాల్సినన్ని సౌకర్యాలు లేవు. నిర్వాసితులను తరలించేటప్పుడు గుడికి గుడి.. బడికి బడి నిర్మిస్తామని చెప్పారు. ముంపు గ్రామాల్లో ఐదు హైస్కూల్స్, నాలుగు ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఇప్పుడు కాలనీలో ఒక హైస్కూల్, రెండు ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. అందులోనూ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించలేదు. వేల మంది ఉండే కాలనీలో కనీసం శ్మశానవాటికను కూడా కేటాయించలేదు. దీంతో కాలనీలోని ఖాళీ ప్రదేశాలు, చిన్న చిన్న నీటి కుంటల వద్ద స్థలాలను శ్మశానాలకు వినియోగించుకుంటున్నారు. ముస్లిం, క్రిస్టియన్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.
ఈ ఫొటోలోని మహిళ పేరు జీ నర్సవ్వ. ఈమెది తొగుట మండలం పల్లెపహాడ్గ్రామం. రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం కోల్పోవడంతో పరిహారంతో పాటు ప్యాకేజీ, ఆర్అండ్ఆర్ కాలనీలో ఇల్లు, పట్టా సర్టిఫికెట్ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం నర్సవ్వ భర్త చనిపోవడంతో తన పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేయమంటే ఇబ్బందులు పెడుతున్నారు. వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నర్సవ్వ ఆరోపిస్తోంది. ఆర్అండ్ఆర్ కాలనీలోని దాదాపు వందమంది ఒంటరి మహిళల పరిస్థితి ఇలాగే ఉంది.
ఈ ఫొటోలోని పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గూడూరి కరుణాకర్ కు 18 ఏండ్లు నిండడంతో రూ.5.5 లక్షల ప్యాకేజీ, 250 గజాల ప్లాట్ కేటాయిస్తూ పట్టా సర్టిఫికెట్అందజేశారు. ఇటీవల గజ్వేల్ సమీపంలో నిర్వాసితులకు ప్లాట్లు కేటాయిస్తుంటే తన ప్లాట్ పొజిషన్చూపాలని కరుణాకర్ అధికారులను సంప్రదిస్తే ప్లాటే లేదని చెబుతున్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండి ప్యాకేజీ తీసుకున్న 150 మంది యువతీ యువకులు ప్రస్తుతం ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు.
ఈ ఫొటోలో వ్యక్తి పేరు పోతుల దేవరాజు. ఈయనది కూడా పల్లెపహాడ్ గ్రామమే. మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఇల్లు, పొలం పోవడంతో ప్రభుత్వం పరిహారం, ప్యాకేజీ ఇచ్చింది. రెండేండ్ల కింద గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో దేవరాజు కుటుంబానికి తాత్కాలిక నివాస అవకాశం కల్పించారు. త్వరలో పూర్తి స్థాయిలో ఇంటిని కేటాయిస్తామని చెప్పారు. అయితే, దేవరాజు కుటుంబం గ్రామంలో నివసించలేదని నాన్ లోకల్ గా ట్రీట్ చేస్తూ ఇంటిని కేటాయించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉందా కుటుంబం. గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీలో వంద పై చిలుకు మంది ఇలా నాన్ లోకల్ సమస్యతో బాధపడుతున్నారు.
మా బతుకులు ఆగమైనయి
మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో మా బతుకులు ఆగమైనయ్. పరిహారాలు, ప్యాకేజీలు ఇస్తమని గ్రామాలు ఖాళీ చేయించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నరు. నాకు ఇంటి పైసలు, భూమి పైసలు రావాలె. పిల్లల ప్యాకేజీ గురించి అడిగితే సమాధానం చెప్పడం లేదు.
- గుగులోతు బుజ్జి, ఆర్అండ్ఆర్ కాలనీ
వారం పది రోజుల్లో పరిష్కరిస్తాం
మల్లన్న సాగర్ నిర్వాసితుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించాం. ఏవైనా మిగిలి ఉంటే అధికారులు నిర్వాసితులతో చర్చించి పరిష్కరిస్తారు. వారం పది రోజుల్లో అన్ని సాల్వ్ చేస్తాం.
- రమేశ్ ఆర్డీవో, సిద్దిపేట