బతకడం కోసం అప్పులు చేస్తున్నరు

కరోనా మహమ్మారి కారణంగా జనాల బతుకులు ఆగమాగం అవుతున్నాయి. రోజువారీ బతుకు పోరాటంలో అప్పులే వారిని ఆదుకుంటున్నాయి. ఉన్నోళ్లు ఆస్తులు, బంగారం తనఖా పెడుతుంటే.. లేనోళ్లు ప్రైవేటు వ్యక్తుల దగ్గర, తెలిసినోళ్ల దగ్గరా ఎక్కువ వడ్డీకి అప్పులు తెస్తున్నారు. అయితే ఉపాధి దారుణంగా దెబ్బతినడంతో వీటిని చెల్లించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక బాకీ తీర్చేందుకు మరో చోట రుణం తీసుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

కరోనా విజృంభించడంతో ఏడాదిన్నర కాలం నుంచి దేశ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. మరింతగా కూరుకుపోతున్నారు. బతకడానికి, ఆస్పత్రుల్లో ఖర్చుల కోసం అందినకాడికి అప్పులు చేయకతప్పడం లేదు. ఒక అంచనా ప్రకారం గత ఏడాది కాలంలో దేశ జనాభాలో 23 కోట్ల మంది లక్షా23 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారట. వీరంతా కేవలం బతకడానికే ఈ రుణాలు తీసుకున్నారు. కరోనా సంకటం కారణంగా ఆస్తులు, బంగారం బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.70 వేల కోట్లు అప్పులు తీసుకున్నట్టు బ్యాంకుల లెక్కలుచెబుతున్నాయి. దేశంలో 6 కోట్ల మందికిపైగా ప్రావిడెంట్​ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులు ఉంటే.. అందులో 4 కోట్ల మంది వరకు కరోనా అడ్వాన్స్​గా భారీ మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకున్నారు. ఇక ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు, మిడిల్​ క్లాస్​వారి పరిస్థితి మరీ దీనంగా మారింది. ప్రైవేట్ ఫైనాన్స్ లు, తెలిసిన వారి నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుని కుటుంబాలను పోషిస్తున్నారు. సంపాదించే ఇంటి పెద్దలను కరోనా కబళించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. చేసేందుకు పనులు లేక, తినడానికి తిండి గింజలు కరువై 18 కోట్ల మందికి పైగా వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా పొట్ట కూటి కోసం చేతులు చాచాల్సి వస్తోంది. చాలా మందికి ప్రభుత్వ సహాయం అందడం లేదు.

ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది
దేశ ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బ్యాంకుల అప్పులు.. వేవ్ ఆఫ్ లు, ఎగవేతల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ కాక తప్పదు. కంపెనీల ఏర్పాటుకు అప్పులు తీసుకున్న వారు వాటిని తీర్చకుండా ఇతరులకు అమ్ముతున్న నేపథ్యంలో కొత్తగా కొనేవారు మళ్లీ బ్యాంక్ నుంచి లోన్​ తీసుకుంటున్నారు. ఇందులో రెండు వైపులా రుణం పొందుతున్న వారిలో చెల్లించే వారెవరో అంతు చిక్కని విషయం. ఇలాంటి కేసులను డీల్ చేయడానికి ఎన్సీఎల్టీని ఏర్పాటు చేశారు. దీని దగ్గర ఇప్పటికే 2,100కు పైగా కేసులు పెండింగ్​లో ఉన్నాయి. బ్యాంక్స్ వద్ద బ్యాడ్ లోన్స్ మొత్తం భారీగానే ఉంది. ‘‘దేశం మారుతోంది”అనే నినాదం వినసొంపుగానే ఉంటుంది. ఎలా మారిందో.. ఎలా మార్చారో.. మన ముందు పూర్తి చిత్రం ఉంది. 2014 నుంచి కార్పొరేట్ సెక్టర్ కు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. వ్యవసాయ సంస్కరణలు అన్నారు. ఇప్పుడు రేషన్ షాప్స్ సంస్కరణలు ఉంటుందంటున్నారు. 2016 నుంచి ప్రభుత్వ రంగ కంపెనీలు అమ్ముడు షురు చేశారు. బ్యాంకుల విలీనం మొదలు పెట్టారు. .. ప్రభుత్వ రంగాలు అమ్ముడు మొదలు పెట్టారు. 

బ్యాంకులను ముంచుతున్న ఎన్పీఏలు
బ్యాంకులు దారుణంగా దెబ్బ తినడానికి కారణం ఎన్పీఏలే. ఇవి ఎక్కువగా ఉండటానికి కార్పొరేట్​ సెక్టారే కారణం. ఉదాహరణకు 1986లో వీడియోకాన్ కంపెనీ వచ్చింది.1990 నుంచి ఈ కంపెనీ ఏసీలు, ఫ్రిజ్ లు తయారు చేయడం మొదలుపెట్టింది. 2000 సంవత్సరంలో ఆయిల్, గ్యాస్ బిజినెస్ లోకి వెళ్లింది. ఆ తర్వాత డీటీహెచ్​ను స్టార్ట్​ చేసింది. వీటి ఏర్పాటు కోసం వివిధ బ్యాంకుల నుంచి రూ.90 వేల కోట్లు అప్పులు చేశారు. కానీ ఈ కంపెనీని రూ.37,250 కోట్లకు అమ్మేశారు. డీఎఫ్ హెచ్ ఎల్ కంపెనీపై ఇప్పుడు రూ.90 వేల కోట్ల అప్పు ఉంది. ఆ మొత్తం ఎవరు కడతారు. పిర్మల్ గ్రూప్ కూడా రూ.37,250 కోట్లను బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంది. రుచి సొయా కంపెనీ 1985లో ఏర్పాటైంది. 2019లో ఈ కంపెనీని రూ.4,350 కోట్లకు పతంజలి కొనుగోలు చేసింది. బ్యాంక్ లోన్​ కింద రూ.3,250 కోట్లు తీసుకుని దీనిని కొనుగోలు చేసింది. అంటే ఒక కంపెనీని కొనుగోలు చేసిన వారు.. అమ్మిన వారు అందరూ బ్యాంకుల నుంచి లోన్లు పొందినవారే. కంపెనీ విలువకన్నా చౌకగా అమ్మినట్లు చూపించి ఇక్కడ బ్లాక్ మనీని క్యాష్ చేసుకుంటున్నారు. ఇదంతా కార్పొరేట్ల మధ్య జరుగుతున్న వ్యవహారం. బ్యాంకులు అప్పులు ఇచ్చి మునగడమే. వీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఎన్సీ ఎల్ టీ కేసులు ఏమవుతున్నాయో అంతుపట్టడం లేదు. 

రైతులను పట్టించుకునే వారు లేరు
సంస్కరణల పేరిట కోట్లలో ఉన్న దేశ రైతాంగాన్ని గోస పెడున్నారు. అదాని.. అంబానీ లాంటి రోజుకు రూ.100 కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్న కార్పొరేట్లకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసే మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఏడు నెలలుగా ఢిల్లీ బార్డర్ల చుట్టూ ఆందోళన చేస్తూ అక్కడే రాత్రి పగలు ఉంటున్న లక్షలాది మంది రైతులను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్త అగ్రి చట్టాల రద్దు, ఎమ్మెస్పీ చట్టం అమలు డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేరిస్తేనే కదులుతామని వారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 588 మంది రైతు బిడ్డలు ఊపిరి వదిలినా వారి శవాలను ఊరికి తరలించి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలు కూడా పుట్టెడు దుఃఖాన్ని కడుపులో పెట్టుకుని పోరాటంలో పాల్గొంటున్నాయి. విజయం సాధించి మాత్రమే ఇంటి ముఖం చూస్తామని పట్టుదలతో వారంతా ఉన్నారు. 

సెకండ్ వేవ్​ తగ్గినా.. థర్డ్​ వేవ్​ భయముంది
దేశ ఖనిజ సంపద, వ్యవసాయం, ఫ్యాక్టరీలు, రాజకీయాలు ఇలా అన్నీ కార్పొరేట్ల చేతుల్లో బందీ అయిపోతున్నాయి. మరోవైపు మందులు లేక, వ్యాక్సిన్ కొరత, ఆక్సిజన్ అందక ప్రజలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు సెకండ్​ వేవ్ కేసులు, మరణాలు తగ్గితే.. థర్డ్​ వేవ్ భయమూ దాని వెంటనే ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ మార్కెట్లలో మనదేశంలో తయారైన మందులు విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం అందరినీ వ్యాక్సిన్​ అందే పరిస్థితి లేదు. ఇదేనా దేశభక్తి. ఇదేనా దేశంలో వస్తున్న మార్పు. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కోసం ఆగమాగం అవుతున్న సగటు పౌరునికి పాలకులు సమాధానం ఇవ్వాలి.
- ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్టు