తాత్కాలిక సాయాలు కాదు.. శాశ్వత పరిష్కారాలు కావాలె

ఎదిగే అవకాశాలు కల్పించకుండా, సంపాదించే శక్తిని పెంచకుండా తాత్కాలిక సాయాల వల్ల నూటికి 99 శాతం మందికి ఒరిగేదేమీ ఉండదు. తాత్కాలిక ఉపశమనాల వల్ల వీరి జీవన పరిస్థితులు మారవు. తాయిలాలు అందిస్తే పేదరికం తొలగదు. తాత్కాలిక లబ్ధి కోసం పథకాల్ని ప్రకటించి రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు కానీ, ప్రజలకు సరైన ఫలితాలు అందవు. ‌‌కొద్దిమందికి‌‌ ‌‌అందినా,‌‌ ‌‌మిగతా‌‌ ‌‌వర్గాల్లో‌‌ ‌‌ఆగ్రహం‌‌ పెరుగుతుంది. ‌‌అలాగే‌‌ పేదరికంలో‌‌ ‌‌మగ్గుతున్న ‌‌ఇతర‌‌ కులాలు,‌‌ ‌‌బలహీన‌‌ ‌‌వర్గాల వారిలో ‌‌మాకెందుకు‌‌ ఇవన్నీ అందడం లేదనే ప్రశ్న మొదలవుతుంది. ‌‌చివరికి‌‌ ‌‌ఇది‌‌ ‌‌కులాల‌‌ ‌‌మధ్య ‌‌సంఘర్షణగా‌‌ ‌‌మారుతుంది.‌‌

మన సమాజాన్ని శతాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి కులవ్యవస్థ. అట్టడుగుల జీవితాలను బానిసలుగా మార్చిన అమానుషత్వం వేళ్లూనుకుపోయింది. కులవ్యవస్థలో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి సామాజికం కాగా, రెండోది రాజకీయం, పరిపాలన. సామాజికంగా ఆచారాలు, వివాహాలు కులాల లోపలే ఉంటాయి. రాజకీయంగా, పరిపాలన పరంగా చూస్తే ముఖ్యంగా దళిత సమాజానికి ప్రతిభ ఉన్నా ఎదిగే అవకాశాలు లేకుండాపోతున్నాయి. గతంలో ఇది వ్యక్తుల సమస్యగానే చూసినా.. ఆధునిక సమాజంలో ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనిగా మారింది. కానీ అవకాశాల్ని అందరికీ అందించటంలో ప్రభుత్వం విఫలమవుతోంది.

చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి

మన రాజ్యాంగంలో కులవ్యవస్థను రూపుమాపటానికి అవసరమైన అంశాల ప్రస్తావన ఉంది. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలంటే.. పుట్టుక, కులం, డబ్బుతో సంబంధం లేకుండా అందరి హక్కుల్ని గౌరవించాలని, సమానంగా ఎదగడానికి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నది. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగంలో ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ఎంత గొప్ప రాజ్యాంగమైనా రాజ్యవ్యవస్థ నిర్మాణాన్ని, ప్రజల హక్కుల్ని నిర్వచించగలదు గానీ.. ప్రభుత్వ నిర్వహణ, రాజకీయం జరిగే తీరు, పాలనా ఫలితాలను నిర్వచించలేదు. ఈ కారణంగానే రాజ్యాంగం చెప్పిన విలువలకు, ప్రభుత్వం నడుస్తున్న తీరుకు మధ్య ఇప్పుడు అగాధం ఏర్పడింది. అయితే ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ప్రజల సమ్మతి కీలకం. కాబట్టి ప్రజల సమ్మతిని ఓటు ద్వారా పొంది అధికారాన్ని చేజిక్కించుకునే విద్యలో మన రాజకీయం ఆరితేరింది. అన్ని వర్గాలను ఆకట్టుకోవటం, అనునయించటం రాజకీయ పార్టీలకు అవసరమైంది. ఆ మేరకు అస్పృశ్యతను వ్యతిరేకించటంలో, కులం పేరుతో కొనసాగించే దారుణమైన బానిస సంస్కృతిని వ్యతిరేకించటంలో దేశంలోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అంతకుమించి రాజ్యాంగ విలువలను కాపాడే ప్రయత్నం కానీ, పుట్టుక, కులం, డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ చట్టం ఒకేలా వర్తించాలన్న సంకల్పం కాని కొరవడినాయి. మన దేశంలో రాజ్యవ్యవస్థ వైఫల్యానికి మూడు అంశాలు ప్రధాన కారణం. అవి అధికారం కేంద్రీకృతమవటం, చట్టబద్ధ పాలన కొరవడటం, సరైన విద్య, ఆరోగ్యాలను అందించకపోవటం.

అధికార కేంద్రీకరణ

అధికార కేంద్రానికి, పౌరుడికి మధ్య దూరం ఇప్పుడు పెరిగిపోయింది. తన ఓటు వల్ల ఏం జరుగుతుందనే స్పష్టత పౌరుడికి లేకుండా పోయింది. ఓటు వల్ల ఫలితాలేమిటో అర్థమై, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఓటు వేస్తే అప్పుడు రాజకీయం మారుతుంది. ప్రజల జీవితాలు బాగుపడతాయి. కేంద్రీకరణ వల్ల ఎప్పుడైతే ఆ అవకాశం లేకుండా పోయిందో, డబ్బు, బహుమతులే రాజకీయంగా, పాలనగా మారాయి. ఎదిగే అవకాశాలను, ఆదాయాలు పెంచుకుని తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశాలను కల్పించకుండా తాత్కాలికమైన తాయిలాలతో ఓటర్లను లోబరచుకోవటం ఆనవాయితీ అయింది. ఈ తాయిలాల వల్ల ఆకలి బాధ, దారిద్ర్యం కొంతవరకు తగ్గాయి. కానీ అంతకుమించి ఎదిగే అవకాశాల్ని అందించటం, సంపాదనా శక్తిని పెంచటం, వ్యక్తి హుందాతనాన్ని కాపాడటం, అందరికీ సమాన హోదా కల్పించటం.. అనే లక్ష్యాలు వెనుకబడ్డాయి. దీంతో పేదరికం నిరంతరం కొనసాగుతోంది. విద్య, నైపుణ్యం అందని కారణంగా పేద కుటుంబాలు తరతరాలుగా కొన్ని పనులకు, కొన్ని వృత్తులకు పరిమితం కావలసి వస్తున్నది. అధికార కేంద్రీకరణ వల్ల, స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేయటం వల్ల సామాన్య జనానికి కనీస వసతులు కరువయ్యాయి. అణగారిన వర్గాలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఉన్నా, అవి సాధికారతలేని ఉత్సవ విగ్రహాలుగా ఉండటం వల్ల, దళితులకు పదవులు అందినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనివల్ల దారిద్ర్యం, ఆకలి బాధలు లేకపోయినా శాశ్వత పేదరికంలోకి దళితులు, ఏ అవకాశాలు అందని అట్టడుగు వర్గాలు జారిపోతున్నారు.

చట్టబద్ధ పాలన

చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. అందరి హక్కులకూ సమానంగా రక్షణ, గుర్తింపు ఉండాలి. మనకు కాగితం మీద ఈ చట్టబద్ధ పాలన ఉంది కానీ, వాస్తవంలో చట్టం అధికారం, డబ్బు ఉన్నవారికి చుట్టమయింది. పేద ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. సామాన్యులు అడుగడుగునా అన్యాయాలను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఆగ్రహావేశాలు, హింసకు దారితీస్తున్నాయి. డబ్బు, కండబలం, రాజ్యాధికారం న్యాయాన్ని శాసిస్తున్నప్పుడు సమాజంలో ఉన్నత వర్గాలదే ఎప్పుడూ పైచేయిగా ఉంటుంది. దాంతో దళితులు, అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు నినాదాలకు పరిమితమవుతున్నాయి. నేరపరిశోధన పూర్తిగా అధికారంలో ఉన్నవారి చేతుల్లో బందీ కావటంతో, ఏ అండా లేని పేదలు రాజ్యహింసకు నిరంతరం గురవ్వవలసి వస్తున్నది. చట్టబద్ధపాలన వైఫల్యం కులవ్యవస్థను కొనసాగించటానికి, కులం పేరుతో బానిసత్వాన్ని కొనసాగించటానికి దోహదం చేస్తున్నది.

విద్య, ఆరోగ్యం

ఎదిగే అవకాశాలను కల్పించడానికి ప్రతి బిడ్డకు మంచి ప్రమాణాలతో విద్య, ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందించే ఏర్పాట్లను చేయడంలో మన రాజ్యవ్యవస్థ ఘోరంగా విఫలమైంది. విద్య అనేది పేదరికం నుంచి, పుట్టుక వల్ల వచ్చిన అంతరాల నుంచి బయటపడటానికి పనికొచ్చే ఆయుధం. మనం అందరికీ విద్య అనే నినాదాన్ని చేపట్టాం. లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం వెచ్చిస్తున్నాం. కానీ నూటికి 80 శాతం మంది పిల్లలకు కనీస ప్రమాణాల విద్య అందటం లేదు. పరీక్షలు పాసవుతున్నా, బుద్ధి వికసించటం లేదు. పై తరగతులకు వెళ్తున్నారు గాని, కింది తరగతి పుస్తకాల్లోని వాక్యాలను చదవలేకపోతున్నారు. పనికొచ్చే నైపుణ్యాలు లేని చదువు వల్ల పేద కుటుంబాలు, దళిత, అట్టడుగు వర్గాల పిల్లల ప్రతిభ వెలుగులోకి రావటం లేదు. దీంతో వారు కొన్ని అల్పాదాయ వృత్తులకే పరిమితమవుతున్నారు. అలాగే ఆరోగ్యం విషయంలో ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్ల ఎక్కువగా నష్టపోయింది దళితులు, అట్టడుగు వర్గాలు, ఇతర పేదలే. మన దేశంలో పేదరికాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్న ప్రధాన కారకాలు.. సరైన ఆరోగ్య వ్యవస్థ లేకపోవటం, చేస్తున్న కొద్దిపాటి ఖర్చును కూడా తగిన ఫలితాలు లేకుండా చేయటమే. దేశం మొత్తంలో 5 కోట్ల మందికి పైగా ఏటా అనారోగ్య కారణంగా పేదరికంలోకి జారిపోతున్నారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వాల వైఫల్యం వల్ల అట్టడుగు వర్గాలు, దారిద్ర్యంలో ఉన్నవారి ఆయుర్దాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దేశంలోని మిగతావారి కంటే దళితులు, అవకాశాలు అందని ఇతర వర్గాల వారి ఆయుర్దాయం కనీసం 10 ఏండ్లు తక్కువని అంచనా. 
పేదరికం నుంచి విముక్తి కావాలన్నా, కులం, కులవ్యవస్థ నిర్మించిన అడ్డుగోడల్ని ఛేదించాలన్నా, పుట్టుకతో వచ్చిన ప్రతిభాపాటవాలు వికసించాలన్నా, ప్రతి బిడ్డకూ ఎదిగే అవకాశాలు కావాలన్నా అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధపాలన, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్య వ్యవస్థ అనేవి అత్యంత కీలకం. ఆధునిక సమాజానికి, మధ్యయుగాల సమాజానికి మధ్య మౌలికమైన తేడా ఈ అంశాలే. ఒక‌‌ ‌‌అద్భుత‌‌ ‌‌కాలంలో‌‌ ‌‌మనం‌‌ ‌‌ఉన్నాం.‌‌ ‌‌సాంకేతిక‌‌ ‌‌విజ్ఞానాన్ని‌‌ ‌‌ఉపయోగించి‌‌ ‌‌మనకున్న ‌‌పరిమిత‌‌ ‌‌వనరులతో‌‌ ‌‌ప్రతి‌‌ ‌‌బిడ్డ ‌‌జీవితాన్ని‌‌ ‌‌అందంగా‌‌ ‌‌తీర్చిదిద్దే‌‌ ‌‌అవకాశం‌‌ ‌‌మనకుంది.‌‌ ‌‌‌‌అందుకు‌‌ ‌‌రాజ్యాంగ‌‌ ‌‌విలువలను‌‌ ‌‌అమలు‌‌ ‌‌చేసే‌‌ ‌‌చిత్తశుద్ధి,‌‌ ‌‌సంకల్పం,‌‌ ‌‌దూరదృష్టి,‌‌ ‌‌నాయకత్వం‌‌ ‌‌కావాలి.‌‌ ‌‌అలాకాకుండా‌‌ ‌‌రాజ్యాధికారాన్ని‌‌ ‌‌పొందటం,‌‌ ‌‌ఆ‌‌ ‌‌అధికారాన్ని‌‌ ‌‌కొనసాగించటం‌‌ ‌‌లక్ష్యంగా‌‌ ‌‌ప్రవర్తిస్తే‌‌ ‌‌సమాజంలో‌‌ ‌‌పేదరికం,‌‌ ‌‌పుట్టుకతో‌‌ ‌‌వచ్చిన‌‌ ‌‌వివక్ష మాత్రం అలాగే కొనసాగుతాయి.

ఎదిగే అవకాశాలు ఇవ్వాలె

అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, విద్య, ఆరోగ్యం మొదలైన వాటిని మెరుగుపరిచే సంకల్పం, సామర్థ్యం లేని రాజకీయ వ్యవస్థ తాత్కాలికంగా ప్రజలను మెప్పించే ప్రయత్నంలో తలమునకలైంది. ఇలా తాత్కాలికంగా మెప్పించే ప్రయత్నాల్లో రిజర్వేషన్లు ఒకటి. శతాబ్దాల పాటు అణచివేతకు గురైన అణగారిన వర్గాలకు అవకాశాలను అందించటం రిజర్వేషన్ల ‌‌ఏర్పాటు‌‌ ‌‌వెనక‌‌ ‌‌ఉన్న ‌‌మౌలిక‌‌ ‌‌లక్ష్యం.‌‌ ‌‌మంచి‌‌ ‌‌ప్రమాణాల‌‌ ‌‌విద్య,‌‌ ‌‌నైపుణ్యాలను‌‌ ‌‌ఇచ్చి,‌‌ ‌‌సంపాదించే‌‌ ‌‌అవకాశాలను‌‌ ‌‌పెంచటం‌‌ ‌‌ఈ‌‌ ‌‌సమస్యకు‌‌ ‌‌శాశ్వత‌‌ ‌‌పరిష్కారం.‌‌ ‌‌కానీ‌‌ ‌‌ఈ‌‌ ‌‌పరిష్కారాన్ని‌‌ ‌‌దాటవేస్తూ,‌‌ ‌‌రిజర్వేషన్లనే‌‌ ‌‌శాశ్వత‌‌ ‌‌పరిష్కారంగా‌‌ ‌‌భావిస్తే‌‌ ‌‌దళితులకు‌‌ ‌‌తీరని‌‌ ‌‌అన్యాయం‌‌ ‌‌జరుగుతుంది.‌‌ ‌‌చివరకు‌‌ ‌‌రిజర్వేషన్లలో‌‌ ‌‌ఫలితాలు‌‌ ‌‌కూడా‌‌ ‌‌నిజంగా‌‌ ‌‌దళితుల్లో‌‌ ‌‌ఎటువంటి‌‌ ‌‌అవకాశం‌‌ ‌‌లేకుండా‌‌ ‌‌ఉండే‌‌ ‌‌పేదలకు‌‌ ‌‌అందకుండా‌‌ ‌‌పోతాయి.‌‌ ‌‌మంచి‌‌ ‌‌ప్రమాణాల‌‌ ‌‌విద్య ‌‌పాఠశాల‌‌ ‌‌స్థాయిలో‌‌ ‌‌అందిస్తేనే‌‌ ‌‌రిజర్వేషన్ల ‌‌లక్ష్యం‌‌ ‌‌నెరవేరుతుంది.‌‌ ‌‌ఆ‌‌ ‌‌మంచి‌‌ ‌‌ప్రమాణాల‌‌ ‌‌విద్య ‌‌ఖరీదైన‌‌ ప్రైవేటు‌‌ ‌‌పాఠశాలలకు,‌‌ ‌‌కొన్ని‌‌ ‌‌పరిమిత‌‌ ‌‌సంఖ్యలోని‌‌ ‌‌నవోదయ‌‌ విద్యాలయాలు,‌‌ ‌‌గురుకుల‌‌ బడులకు ‌‌పరిమితమైంది.‌‌ ‌‌ఆ‌‌ స్కూళ్లకు ‌‌వెళ్లే‌‌ ‌‌పిల్లలకు‌‌ ‌‌మాత్రమే‌‌ ‌‌ఎదిగే‌‌ ‌‌అవకాశాలు‌‌ ‌‌లభిస్తున్నాయి.‌‌ ‌‌దళితుల్లో‌‌ ‌‌కోటీశ్వరులు,‌‌ ‌‌ఉన్నతాధికారులు,‌‌ ‌‌వారి‌‌ ‌‌పిల్లలకు ‌‌మాత్రమే‌‌ ‌‌రిజర్వేషన్ల ‌‌ఫలితాలు‌‌ ‌‌నిరంతరం‌‌ ‌‌అందుతుంటే,‌‌ ‌‌మంచి‌‌ ‌‌విద్య ‌‌లేని‌‌ ‌‌కారణంగా‌‌ ‌‌దళితుల్లో‌‌ ‌‌అత్యధికుల‌‌ ‌‌భవిష్యత్తు‌‌ ‌‌వారు‌‌ ‌‌పుట్టిన‌‌ ‌‌నేపథ్యాన్ని‌‌ ‌‌బట్టి‌‌ ‌‌శాశ్వతంగా‌‌ ‌‌సమాధి‌‌ ‌‌
అవుతోంది.

తాయిలాలతో పేదరికం పోదు

‌‌దారిద్ర్యంలో‌‌ ‌‌ఉన్న ‌‌కుటుంబాలకు‌‌ ‌‌కొంతవరకు‌‌ ‌‌తాత్కాలిక‌‌ ‌‌ఉపశమనాలు‌‌ ‌‌అవసరం.‌‌ ‌‌ఆకలి‌‌ ‌‌బాధను‌‌ ‌‌తీర్చాలి, ‌‌ఉన్నంతలో‌‌ ‌‌విద్య,‌‌ ‌‌ఆరోగ్యాలకు‌‌ ‌‌అవకాశాలు‌‌ కల్పించాలి, ‌‌జీవనోపాధి‌‌ ‌‌కోసం‌‌ ‌‌కొంతమేరకు‌‌ ‌‌ఆర్థిక‌‌ ‌‌సాయం‌‌ ‌‌అందించాలి. ‌‌కానీ‌‌ ‌‌నిజంగా‌‌ ‌‌ఎదిగే‌‌ ‌‌అవకాశాలను‌‌ ‌‌కల్పించకుండా,‌‌ ‌‌సంపాదించే‌‌ ‌‌శక్తిని‌‌ ‌‌పెంచకుండా ఇచ్చే ‌‌తాత్కాలిక‌‌ ‌‌సాయాల‌‌ ‌‌వల్ల ‌‌‌‌ఒరిగేదేమీ‌‌ లేదు.‌‌ ‌‌ఏదో‌‌ ‌‌చేశామన్న ‌‌భ్రమ‌‌ ‌‌కలుగుతుంది. ‌‌వారి‌‌ ‌‌జీవన‌‌ ‌‌పరిస్థితులు‌‌ ‌‌మారవు.‌‌ ‌‌ఇక‌‌ ‌‌దళితబంధు‌‌ ‌‌లాంటి‌‌ ‌‌పథకాలతో‌‌ ‌‌ఈ‌‌ ‌‌తాత్కాలిక‌‌ ‌‌సాయం‌‌ ‌‌కూడా‌‌ ‌‌అవధులు‌‌ ‌‌దాటింది.‌‌ ‌‌ప్రభుత్వాల‌‌ ‌‌మౌలిక‌‌ ‌‌బాధ్యత‌‌ ‌‌చట్టబద్ధ ‌‌పాలనతో‌‌ ‌‌అందరి‌‌ ‌‌హక్కులనూ‌‌ ‌‌సమానంగా‌‌ ‌‌కాపాడటం,‌‌ ‌‌మౌలిక‌‌ ‌‌సదుపాయాలు,‌‌ ‌‌జీవన‌‌ ‌‌అవసరాలను‌‌ ‌‌అందించి‌‌ ‌‌పేదలకు‌‌ ‌‌బతుకు‌‌ ‌‌భారాన్ని‌‌ ‌‌తగ్గించటం,‌‌ ‌‌మంచి‌‌ ‌‌ప్రమాణాల‌‌ ‌‌విద్యను‌‌ ‌‌అందించి‌‌ ‌‌ఎదిగే‌‌ ‌‌అవకాశాలను‌‌ ‌‌కల్పించటం,‌‌ ‌‌మంచి‌‌ ‌‌ఆరోగ్యాన్ని‌‌ ‌‌అందించి‌‌ ‌‌సుఖవంతమైన,‌‌ ‌‌సుదీర్ఘమైన‌‌ ‌‌జీవితాన్ని‌‌ ‌‌అందించటం.‌‌ ‌‌‌‌అయితే ‌‌ప్రభుత్వ ‌‌ఆర్థిక‌‌ ‌‌స్థితిగతులతో‌‌ ‌‌సంబంధం‌‌ ‌‌లేకుండా‌‌ ‌‌ఆర్భాటంగా‌‌ ‌‌తాత్కాలిక‌‌ ‌‌లబ్ధి ‌‌కోసం‌‌ ‌‌పథకాల్ని‌‌ ‌‌ప్రకటిస్తే‌‌ ‌‌అవి‌‌ సక్రమంగా ‌‌అమలు‌‌ ‌‌కావు.‌‌ ‌‌కొద్దిమందికి‌‌ ‌‌అందినా,‌‌ ‌‌మిగతా‌‌ ‌‌వర్గాల్లో‌‌ ‌‌ఆగ్రహం‌‌ ‌‌పెల్లుబుకుతుంది.‌‌ ‌‌అసలే‌‌ ‌‌ఆర్థిక‌‌ ‌‌సంక్షోభంలో‌‌ ‌‌ఉన్న ‌‌ఖజానా‌‌ ‌‌శూన్యమవుతోంది.‌‌ ‌‌ప్రభుత్వాలు‌‌ ప్రజాహితం‌‌ ‌‌కోసం‌‌ ‌‌అసలు‌‌ ‌‌చేపట్టవలసిన‌‌ ‌‌కార్యక్రమాల అమలు ‌‌ఇంకా‌‌ ‌‌మందగిస్తోంది.‌‌ ‌‌పన్నులు‌‌ ‌‌వసూలు‌‌ ‌‌చేసి,‌‌ ‌‌పదవుల్లో‌‌ ‌‌ఉన్నవాళ్లు‌‌ ‌‌అయినకాడికి‌‌ ‌‌అనుభవించి,‌‌ ‌‌‌‌చేయవలసిన‌‌ ‌‌పనులన్నిటినీ‌‌ ‌‌విస్మరించి‌‌ ‌‌కొంత ‌‌డబ్బుల్ని‌‌ ‌‌పంపిణీ‌‌ ‌‌చేయటం‌‌ ‌‌కోస‌‌మే ‌‌రాజ్యవ్యవస్థ ‌‌పరిమితమవుతోంది.‌‌ ‌‌ఉమ్మడి‌‌ ‌‌అవసరాలు,‌‌ ‌‌సేవలను‌‌ ‌‌అందించటానికి‌‌ ప్రభుత్వం ‌‌సమర్థంగా‌‌ ‌‌పనిచేయటం‌‌ ‌‌ప్రధానంగా‌‌ ‌‌దళితులు,‌‌ ‌‌బలహీన‌‌ ‌‌వర్గాల‌‌ ‌‌వారు,‌‌ పేదలకు‌‌ ‌‌అవసరం.‌‌ ‌‌సంపన్న ‌‌వర్గాలు‌‌ ప్రభుత్వంతో‌‌ ‌‌సంబంధం‌‌ ‌‌లేకుండా‌‌ ‌‌వేరే‌‌ ‌‌ఏర్పాట్లు‌‌ ‌‌చేసుకోగలవు.‌‌ ‌‌కాబట్టి‌‌ ప్రభుత్వం ‌‌తన‌‌ ‌‌మౌలిక‌‌ ‌‌బాధ్యతలను‌‌ ‌‌విస్మరించకూడదు.

- డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, లోక్ సత్తా వ్యవస్థాపకులు