- లీడర్లు, ఆఫీసర్లు మిలాఖత్.. అధికారం అండతో కబ్జాలు
- బఫర్ జోన్లలో నిర్మాణాలు.. నామ్కేవాస్తేగా లేక్ ప్రొటెక్షన్ కమిటీలు
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు ‘సిటీ ఆఫ్ లేక్స్’గా పేరున్న హైదరాబాద్‌లో ఇప్పుడు ఏ చెరువు చూసినా కబ్జాలే. అధికారం అండతో కొందరు.. జబర్దస్తీతో మరికొందరు కనిపించినకాడికి ఆక్రమించుకుంటున్నరు. వేల కోట్ల విలువైన భూములను మాయం చేస్తున్నరు. పొలిటీషియన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు సిండికేట్‌గా మారి లేక్స్‌ను లే అవుట్లుగా మారుస్తున్నరు.
ఆ చెరువులు ఏమైనయ్?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధుల్లో 2,857 చెరువులుండగా.. ఇప్పుడు 2,380 మాత్రమే ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 275 చెరువులు ఔటర్ రింగ్ రోడ్డు (ఇన్సైడ్, ఔట్‌సైడ్) నిర్మాణంలో కలిసిపోయాయి. మరో 202 లేక్స్‌కు సంబంధించి లెక్కా పత్రం లేదు. ఆ చెరువులన్నీ కబ్జాదారుల చెరలోకి వెళ్లాయి. అధికారులు సక్రమంగా సర్వే చేస్తే మాయమైన చెరువుల లిస్టు ఇంకా పెరగొచ్చని పర్యావరణ వేత్తలు అంటున్నారు. రాజధానిచుట్టూ శివారు ప్రాంతాలను కలిపి 7,257 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) విస్తరించి ఉంది. దీని పరిధిలోని నలు దిక్కులా ఉన్న ప్రధాన చెరువుల్లో మెజార్టీ భాగాలు కబ్జాకు గురయ్యాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు వెలిశాయి. వెలుస్తూనే ఉన్నాయి. సిటీ శివారులో గజం జాగా రూ. 40 వేల నుంచి రూ. లక్ష పలుకుతుండటంతో అధికారుల అండదండతో చెరువులను ఆక్రమించుకొని బిజినెస్ చేస్తున్నారు.
ఎల్లమ్మ చెరువు కట్టకు పక్కనే పెట్రోల్ బంకు
శేరిలింగంపల్లిలోని 141 సర్వే నెంబర్లో ఉన్న ఎల్లమ్మ చెరువు పదేండ్ల కిందటి దాకా 41 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడది 23 ఎకరాలకు తగ్గింది. ఇక్కడ అక్రమ కట్టడాలు, కబ్జాలకు లెక్కేలేదు. నాలాలు, బఫర్ జోన్ల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. చెరువు కట్టకు అతి సమీపంలోనే పెట్రోల్ బంకు నిర్మాణం జరుగుతున్నది. రూల్స్ ప్రకారం చెరువుల దగ్గర ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కానీ ఇక్కడ నాలాను పైపులతో కప్పేసి వాటిమీదే బంకు నిర్మాణం జరుపుతున్నారు. ఇదే ఏరియాలో గుర్నాథం చెరువు పదేండ్ల కింద 50 ఎకరాల వరకు ఉండేది. ఇప్పుడది 15 ఎకరాలకే పరిమితైంది. కూకట్‌పల్లిలోని కిందికుట చెరువు పదేండ్ల కిందటి వరకు 30 ఎకరాల వరకు ఉండేది. ఇప్పుడది 8 ఎకరాలకు చేరింది. కూకట్‌పల్లిలోని అంబీర్ చెరువు పరిస్థితీ ఇట్లనే ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మోతీనగర్‌లోని సర్వే నంబర్ 57లో ఉన్న అంబీర్ చెరువు గొలుసుకట్టు చెరువును కబ్జా చేశారని స్థానికులు బాహాటంగానే చెప్పుకుంటారు.
కళ తప్పిన కాముని చెరువు
రియల్ ఎస్టేట్ కు హబ్ అయిన శంషాబాద్‌లో చారిత్రక కాముని చెరువు కళ తప్పింది. నేషనల్ హైవేకు అతి దగ్గరగా ఉన్న ఈ చెరువు ఒకప్పుడు 50 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడది సగానికి తగ్గింది. ఈ చెరువును ఆనుకొని వ్యాపార సంస్థలు వెలిశాయి. హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల్లోని వ్యర్థ పదార్థాలన్నీ ఇందులో పారేయడంతో చేపల మనుగడ కష్టమైంది. శివరాంపల్లిలో ఉన్న రుక్–ఉద్–దవ్లా చెరువుకు 250 ఏండ్ల చరిత్ర ఉంది. 40 ఎకరాల్లో ఉండే ఈ చెరువు చుట్టు పక్కల ప్రజల దాహార్తిని తీర్చేది. కానీ ఇప్పుడది కమర్షియల్ కట్టడాలకు నిలయంగా మారి 8 ఎకరాల్లో ఉంది. ఈ చెరువుపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తున్నది.
అలుగులు కూడా పగుల కొట్టి
బోయిన్పల్లి, లింగంపల్లి పరిధుల్లోని పలు చెరువుల అలుగులను పగులగొట్టి కబ్జాలకు పాల్పడ్డారు. కొందరు నేతలు, అధికారులు, కబ్జాకోరులు ఒక్కటై ఇదంతా నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అస్మత్పేట, రామన్నకుంట, నల్లగండ్ల, గోపి చెరువుల్లోని వందలాది ఎకరాల భూములు బిజినెస్ హబ్‌లుగా మారాయి. గోపి చెరువు ఏకంగా 60 ఎకరాల వరకు కబ్జా అయింది. ఇప్పుడు ఆ చెరువు 12 ఎకరాలకే పరిమితమైంది.
నామ్కేవాస్తేగా ఎల్పీసీ
చెరువుల పర్యవేక్షణ, పునరుద్ధరణ, కబ్జాల నియంత్రణ, సుందరీకరణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపు, బౌండరీల ఏర్పాటు కోసం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్పీసీ)లు నామ్కేవాస్తేగా పనిచేస్తున్నాయి. చెరువుల భూముల్లో బంగ్లాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. చెరువుల చుట్టు పక్కల నివసించే ప్రజలు మురుగును నేరుగా చెరువుల్లోకే వదులుతున్నారు. దీంతో ఇక్కడి నీళ్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఆ వాసనకు చెరువుల చుట్టూ నడవడానికి కూడా జంకాల్సిన పరిస్థితి. సుందరీకరణ పనుల జాడే లేదు. మాయమైన చెరువులతోపాటు ఇప్పుడున్న చెరువులు చాలా వరకు ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
20 వేల కోట్ల పైమాటే
మార్కెట్ విలువను బట్టి హైదరాబాద్ చుట్టుపక్కల 30 కిలో మీటర్లలోపు గజం జాగా రూ. 30 వేల నుంచి లక్ష దాకా పలుకుతున్నది. ఎకరం విలువ రూ.10 కోట్ల నుంచి 50 కోట్లు ఉంది. ఒక్కో చెరువులో ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కబ్జాకు గురైనా.. ఆ కబ్జా భూమితోపాటు మాయమైన 202 చెరువుల విలువ రూ. 20 వేలకోట్ల దాకా ఉంటుంది.
భవిష్యత్ తరాలకు కష్టమే
ఒకప్పుడు హైదరాబాద్ చెరువులు తాగునీరు, సాగునీరుకు, మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు ఉపయోగపడేవి. వర్షాలు పడ్డప్పుడు వరదలు రాకుండా కాపాడేవి. చెరువుల కబ్జాతో నిరుడు వరదలు వచ్చినప్పుడు నగరం అతాలకుతలమైంది. కబ్జాలు, అక్రమ కట్టడాలతో విస్తీర్ణం తగ్గి.. వ్యర్థాలతో నిండిపోయాయి. చెరువులను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు కష్టమే.
- బీవీ సుబ్బారావు, పర్యావరణ వేత్త
ప్రశ్నిస్తే వార్నింగ్ ఇస్తున్నరు
చెరువుల కబ్జాలపై ప్రశ్నించినా, కోర్టులను ఆశ్రయించినా కబ్జాదారుల నుంచే కాదు అధికారుల నుంచి కూడా వార్నింగ్‌లు వస్తున్నాయి. ఎల్లమ్మ చెరువు కబ్జాపై కోర్టును ఆశ్రయించిన బాలస్వామి అనే సామాన్యుడ్ని ఆఫీసర్లు, ఎంక్రోచ్ చేసిన వాళ్లు బెదిరించారు. ప్రభుత్వం కబ్జాలను అరికట్టి చెరువులను కాపాడాలి.
- జి.యోగానంద్, ఫౌండర్, సిటిజన్ కన్సల్టేషన్ సెంటర్
కట్టమైసమ్మ సాక్షిగా..!
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల–సూరారం కట్ట మైసమ్మ చెరువు పదేండ్ల కిందటి వరకు 60 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడది 20 ఎకరాలు కూడా లేదు. ఈ చెరువులో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి దాదాపు 20 ఎకరాలకుపైగా ఆక్రమించి తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరిస్తున్నారు. నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మొత్తాన్ని ఆక్రమించారు. ఈయన అండతో ఇంకొందరు కన్ స్ట్రక్షన్స్ చేస్తున్నారు. నిజానికి ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు.