
- సిటీలో సగం మేర కమ్మేసిన పొగ
- దుర్వాసనతో నగర ప్రజలకు నరకం
- గోదావరి ఖని బైపాస్, హైదరాబాద్ రోడ్డులో
- వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
- 9 నెలల క్రితమే నిలిచిపోయిన బయోమైనింగ్
- గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
- మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారని ఆరోపణలు
కరీంనగర్, వెలుగు: డంపింగ్ యార్డు పొగతో కరీంనగర్ సిటీ జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంటలు ఎగిసిపడి.. పొగ నగరం సగం మేర విస్తరించడంతో ఊపిరాడక సతమతమవుతున్నారు. పొగ కమ్మేయడంతో గోదావరి ఖని బైపాస్, హైదరాబాద్ రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ శివారులోని మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డుకు మంగళవారం అర్ధరాత్రి నిప్పంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి పూట గాలి ఎక్కువగా వీయడంతో పొగ సిటీతోపాటు చుట్టుపక్కలకు విస్తరించింది.
ట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులతోపాటు గోదావరిఖని బైపాస్, హైదరాబాద్ రోడ్డులో వాహనదారులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించనంతగా పొగ కమ్ముకుంది. సిటీలోని కోతిరాంపూర్, కట్టరాం పూర్, అలకాపురికాలనీ, హౌసింగ్ బోర్డుకాలనీ, కమాన్ ఏరియాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. తెల్లవారుజామున ఫైర్ సిబ్బంది చేరుకుని రోజంతా మంటలు ఆర్పినా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. మంటలు తగ్గుముఖం పట్టినా పొగ ఎక్కువగా రావడం మొదలైంది. డంపింగ్ యార్డు పొగ దుర్వాసనతో చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు భగత్ నగర్, కశ్మీర్ గడ్డ, జ్యోతినగర్, హాస్పిటల్స్ ఏరియా, కిసాన్ నగర్ కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
యార్డులోకి రోజూ 30 లారీల చెత్త..
కరీంనగర్ సిటీలోని 60 డివిజన్లలో ఉన్న సుమారు 78 వేల ఇండ్ల నుంచి ప్రతిరోజూ 20 నుంచి 30 లారీల చెత్త వస్తుందని అంచనా. సుమారు 4 లక్షలకుపైగా జనాభా ఉన్న సిటీలో ఇండ్ల నుంచేగాక, దుకాణాలు, హోటళ్ల నుంచి వెలువడే 184 టన్నుల చెత్తను మానేరు తీరంలోని డంపింగ్ యార్డులో డంప్ చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డులో 50 ఏండ్లుగా పేరుకుపోయిన సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తగ్గించడంతోపాటు ఆ స్థలాన్ని మళ్లీ వినియోగించుకునేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బయోమైనింగ్ ప్రారంభించింది. ఇందుకోసం రూ.16 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ కేటాయించింది. టెండర్లు దక్కించుకున్న చెన్నైకి చెందిన సంస్థ చెత్తను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. అగ్రిమెంట్ ప్రకారం ఏడాదిలో డంపింగ్ యార్డును పూర్తిగా క్లీన్ చేసికార్పొరేషన్ కు అప్పగించాల్సి ఉంది. కానీ ఏడాదిపాటు మూడు షిఫ్టుల్లో వర్కర్స్ తో పని చేయించినా టార్గెట్ రీచ్ కాలేక చేతులెత్తేసింది.
ప్రతి ఎండాకాలంలో మంటలే..
నిరుడు మార్చి 16న డంపింగ్ యార్డుకు మంటలు అంటుకుని మూడు, నాలుగు రోజుల వరకు చుట్టుపక్కల పొగ వ్యాపించింది. గత నాలుగేండ్లుగా ఇలాగే మంటలు అంటుకోవడం, ఫైర్ ఇంజిన్లతో ఆర్పడం మాములైపోయింది. ప్రతి ఏటా జరగడంతో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుంటున్నదా? లేదా చెత్త గుట్టలను తగ్గించడానికి మున్సిపల్ సిబ్బంది నిప్పుపెడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెత్త ఏరుకునేవాళ్లు చెత్త నుంచి కాపర్ తీసుకునేందుకు నిప్పు పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మంటలు ఆర్పివేశాక రోజుల తరబడి పొగ వస్తుండటంతో స్థానికులకు ఊపిరాడడం లేదు. దుర్వాసనతో నరకం చూస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పరిష్కారం లేని సమస్యగా మారింది
మా కాలనీ ఏర్పడి 15 ఏండ్లు అయ్యింది. అప్పటి నుంచి డంపింగ్యార్డు పరిష్కారం లేని సమస్యగా మారింది. చెత్తను అంటిపెట్టడంతో గాలివాటానికి మా వైపు పొగ వచ్చి.. రాత్రంతా నిద్ర ఉండటం లేదు. మాకు లేని రోగాలు వస్తున్నయ్. లీడర్లందరికీ విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. చెత్తను డిస్పోజ్ చేసే యంత్రం పెడుతున్నమని చెప్పారు. అది కూడా ఇప్పుడు పనిచేయడం లేదు. - సీహెచ్ రామకృష్ణ, కోతిరాంపూర్, కరీంనగర్
పొగతో వశపడ్తలేదు
పొగతో ఆస్తమాలాంటి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. మాకు ఊపిరాడటం లేదు. పెద్ద మనుషులైతే అనారోగ్యంబారిన పడి చనిపోతున్నారు. ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ టైం. వరండాలో కూర్చుని చదివే పరిస్థితి లేదు. తలుపులు, కిటికీలు మొత్తం క్లోజ్ చేద్దామంటే ఎండాకాలం వేడితో ఉక్కపోస్తోంది. కిటికీలు తెరిస్తే దోమలు, పొగతో వశపడుతలేదు.
- రాజేందర్, ఎల్ఐసీ ఏజెంట్, కరీంనగర్