
హైదరాబాద్, వెలుగు: కర్నాటక ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, ప్రచారంలో ప్రజల నుంచి మం చి స్పందన వస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన శుక్రవారం కుష్టగి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దొడ్డన హనుమ గౌడ పాటిల్ తరఫున ప్రచారం చేశారు.
కుష్టగి నియోజకవర్గ ఇన్చార్జ్గా బ్యాలిహాల్, శాఖపూర్, నిదశేసి గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కర్నాటక ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రచారం తర్వాత బూత్ కమిటీలతో సమావేశమయ్యారు.
ప్రతి ఇంటికీ వెళ్లి బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని వారికి సూచించారు. నిదశేసి గ్రామంలో నిర్వహించిన బూత్ స్థాయి మీటింగ్లో కమిటీ ప్రెసిడెంట్ హనుమంతు బండియా, చెన్నప చెలగెరి పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
జనం ‘సాలు దొరా..’ అంటున్నరు
కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటిని అమలుచేయడంలో విఫలమైన తీరుపై రూపొందించిన వీడియోలను వివేక్ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళలవైపు చూస్తే కండ్లు పీకే చట్టాలు తెస్తానన్న కేసీఆర్.. ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే కండ్లు మూసుకున్నారన్నారు. అందుకే తెలంగాణ మహిళలు ‘సాలు దొర.. సెలవు దొర’ అంటున్నారన్నారు.