ఆర్టీవో ఆఫీసులో సిబ్బంది కొరతతో తిప్పలు పడుతున్న ఖమ్మం జిల్లా ప్రజలు

  • ఉన్న ఉద్యోగులపై అదనపు భారం
  • రవాణాశాఖ మంత్రి సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి

ఖమ్మం, వెలుగు: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ సొంత జిల్లాలోని ఆర్టీవో ఆఫీసులో సిబ్బంది కొరత వేధిస్తోంది. వెహికల్ రిజిస్ట్రేషన్, సీసీలు, డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వివిధ పనుల కోసం ఆఫీసుకు వచ్చే జనాలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కౌంటర్ల దగ్గర లైన్​లో నిలబడాల్సి రావడం, లైన్ లో లేకుండా పక్క నుంచి డైరెక్ట్ గా వచ్చిన వారితో వాగ్వాదం, సిబ్బందితో గొడవ లాంటి సీన్స్​ ఇక్కడ కామన్​గా మారాయి. తక్కువ స్టాఫ్​ ఉండడం ఒక సమస్య కాగా, వారిలో ముగ్గురు సస్పెన్షన్​లో ఉన్నారు. దీంతోపాటు సర్వర్​ సమస్యతో వర్క్​ స్లో అవుతోందన్న విమర్శలున్నాయి. ఎన్ని గంటలు లైన్​లో నిలబడాలని ఆఫీస్​ కు వచ్చిన జనం ప్రశ్నిస్తుంటే, ఉన్న సిబ్బందితో నెట్టుకొస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

వేధిస్తున్న స్టాఫ్  కొరత..

జిల్లా కేంద్రంలోని ఆర్టీవో ఆఫీస్​లో డీటీవోతో పాటు 8 మంది సిబ్బంది ఉండాలి. ఒక ఎంవీఐ, ఇద్దరు ఏఎంవీఐలు, ఒక ఏవో, ఇద్దరు క్లర్కులకు గాను, ఏఎంవీఐ లేరు. ఒక క్లర్క్​ మెడికల్ లీవ్ లో ఉన్నారు. ఏవో, ఒక జూనియర్​ అసిస్టెంట్, సీనియర్​ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్  కొన్ని నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. ఇక జిల్లాలోని ఇతర ట్రాన్స్​పోర్టు ఆఫీసుల్లోనూ ఎంవీఐ, ఏఎంవీఐల కొరత ఉంది. వైరాలో ఉన్న ఎంవీఐ, పాల్వంచ చెక్​ పోస్టులో అదనపు బాధ్యతల్లో ఉన్నారు. సత్తుపల్లి ఇన్​స్పెక్టర్, వేంసూరు చెక్ పోస్టు ఇన్​చార్జీగా ఉన్నారు. చెక్​పోస్టుకు రెగ్యులర్​ ఇన్ స్పెక్టర్ లేరు. ఇలా ఆఫీస్​తో పాటు, ఫీల్డ్ లో పని చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో ఉన్న వారిపై పని భారం పడుతోందని చెబుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్​ చొరవ తీసుకొని సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

ఆఫీసుకు వస్తే నాలుగు గంటలు అవుతోంది

డ్రైవింగ్  లైసెన్స్​ రెన్యువల్  కోసం ఫ్రెండ్ తో కలిసి ఆర్టీవో ఆఫీస్​కు వచ్చాను. 10 గంటలకు వస్తే మధ్యాహ్నం ఒకటిన్నరకు కంప్లీట్ అయింది. కౌంటర్లు ఏర్పాటుచేసినా, సిబ్బంది లేకపోవడంతో లైన్​లో ఎక్కువ మంది ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు పని కంప్లీట్ చేస్తున్నా, నాలుగు గంటలకు పైగా పట్టింది. 

- లక్ష్మీనారాయణ, ఖమ్మం

సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే

రవాణ శాఖలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. పబ్లిక్​ కూడా అందరూ ఒకే సమయంలో ఆఫీసుకు రావడంతో ఇబ్బంది అవుతోంది. స్లాట్​బుక్​ చేసుకున్న వారి అదనపు సమయం పని చేసి వర్క్​ కంప్లీట్ చేస్తున్నాం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి టైమ్ ఎక్స్​టెన్షన్​ చేసుకొని పని చేస్తున్నాం. స్లాట్ బుక్ చేసుకున్న రోజే వారి పని కంప్లీట్ చేస్తున్నాం.  

-తోట కిషన్​రావు, డీటీవో​