ఖమ్మం టౌన్, వెలుగు : స్థానిక డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్, బీసీ కాలనీ, టీఎన్జీవోస్ కాలనీ, దానవాయిగూడెం, రామన్నపేట, మల్లెమడుగు ప్రజలు శుక్రవారం ధర్నా చేశారు. డంపింగ్ యార్డ్ కు చెత్తను తీసుకెళ్లే వాహనాలను అడ్డుకొని రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. రోడ్డుపైనే వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్యార్డ్తో రోగాల బారిన పడుతున్నామని తెలిపారు.
ఇప్పటికే సమస్యను పలుమార్లు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోపోవడంతోనే ధర్నా చేశామన్నారు. కలెక్టర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంటనే స్పందించి ఇక్కడి నుంచి యార్డ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకూ ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.