మాకేం తెలియదు.. మేం ఎవరిపై దాడి చేయలే: లగచర్ల గ్రామ ప్రజలు

మాకేం తెలియదు.. మేం ఎవరిపై దాడి చేయలే: లగచర్ల గ్రామ ప్రజలు

హైదరాబాద్: తెలంగాణలో వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు తిరగబడి దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన వెనక పొలిటికల్ కుట్ర ఉందని అనుమానిస్తోన్న ప్రభుత్వం లగచర్ల ఇన్సిండెట్‎ను సీరియస్‎గా తీసుకుని సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. లగచర్ల ఘటనలో ఇప్పటికే బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే  పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు కూడా ఈ ఘటనలో తెరపైకి వచ్చింది.

 ఈ పరిమాణాల నేపథ్యంలో లగచర్ల గ్రామంలో రాష్ట్రంలో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో లగచర్ల గ్రామస్తులు మీడియా ముందుకు వచ్చారు. 2024, నవంబర్ 14వ తేదీన లగచర్ల గ్రామ ప్రజలు హైదరాబాద్‎లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‎లో మీడియాతో మాట్లాడారు. ‘‘మా గ్రామానికి ఫార్మా కంపెనీ వస్తుందని ప్రచారం చేశారు. ఫార్మా కంపెనీ పెడితే మా భూములు కోల్పోతాం. మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మాకు ఫార్మా కంపెనీ వద్దు. ఫార్మా కంపెనీ వలన మాకు రోగాలు వస్తాయి. 

అసలు కలెక్టర్ మా ఊరికి వస్తున్నాడని మాకు తెలియదు. మేము ఎవరిపై దాడులు చెయ్యలేదు. మాపై, మా కుటుంబాలపై దాడులు చేశారు. పోలీసులు మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. వాళ్లను వెంటనే విడుదల చెయ్యాలి. మాకు ఏం జరిగిన ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదు’’ అని అన్నారు. లగచర్ల ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న వేళ ఏకంగా.. ఆ గ్రామ ప్రజలకు మీడియా ముందుకు రావడం హాట్ టాపిక్‎గా మారింది.