ఆర్టీసీ రూపంలో నల్గొండ జిల్లా ప్రజలకు కష్టాలు

నల్గొండ, వెలుగు: దీపావళి పండక్కి సొంతూళ్లకు బయల్దేరిన నల్గొండ జిల్లా ప్రజలకు ఆర్టీసీ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఎలాంటి సమాచారం లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 200 బస్సులను టీఆర్ఎస్​ మీటింగ్​కు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని గౌడ కులస్తులతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని మన్నెగూడలో టీఆర్ఎస్​ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్​కు జనాల్ని తరలించేందుకు రూలింగ్ పార్టీ నేతలు, కుల సంఘాల నాయకులు నల్గొండ ఆర్ఎంవో పరిధిలో 200 బస్సులను అడ్వాన్స్ బుకింగ్ చేశారు. పల్లె వెలుగు బస్సులతోపాటు, భద్రాచలం, విజయవాడ, యాదగిరిగుట్ట, భువనగిరి, మాచర్ల లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్​ప్రెస్ బస్సులను కూడా క్యాన్సి ల్ చేసి మరీ ఆదివారం మునుగోడుకు తరలించారు. అధికారులకు ముందుగానే విషయం తెలిసినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి సమచారం ఇవ్వలేదు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు కూడా చేయలేదు. సోమవారం దీపావళి కావడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ఆదివారం ఉదయం నుంచి నల్గొండతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లకు పిల్లాపాపలతో చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంక్వైరీలోనూ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో సాయంత్రం దాకా పడిగాపులు కాశారు. చివరికి ప్రైవేట్​వాహనాల్లో అధిక రేట్లు చెల్లించి వెళ్లారు. పండుగ రోజుల్లో స్పెషల్ ట్రిప్పులు నడపాల్సిన అధికారులే ఇలా బస్సులు  క్యాన్సల్ చేయడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఆర్టీసీకి రూ.35 లక్షల ఆదాయం

నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, నార్కట్​పల్లి డిపోల పరిధిలోని సుమారు 200 బస్సులను టీఆర్ఎస్​మీటింగ్​కు తరలించడంతో ఆర్టీసీకి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. బస్సుకు 50 మంది చొప్పున 200 బస్సుల్లో వెయ్యి మందిని మునుగోడు నియోజకవర్గం నుంచి ఆత్మీయ సమ్మేళనానికి  తరలించారు. కాగా, పార్టీ లీడర్ల పేరిట బస్సులు బుక్ చేస్తే ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తదని భావించి, కుల సంఘాల పేరిట, ఇతరుల పేర్లతో బస్సులు బుక్​ చేశారు. ఇటీవల చౌటప్పుల్ ఓటర్లను ఎమ్మెల్యే జీవన్​రెడ్డి యాదగిరిగుట్ట టూర్​కు తీసుకెళ్లడం వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్​గా తీసుకున్న ఎన్నికల కమిషన్ చౌటుప్పల్​తహసీల్దార్​ను సస్పెండ్ చేసింది. ఇది జరిగిన రెండు, మూడు రోజులుకే మళ్లీ గౌడ కులస్తులను మన్నెగూడకు తరలించడం కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందని ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు.