- కామారెడ్డిలోని ఎవరి భూములు గుంజుకోం
- ఇంచు భూమి కూడా రైతులు కోల్పోరు
- కామారెడ్డి కార్నర్ మీటింగులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కామారెడ్డి/భిక్కనూరు/నిజామాబాద్, వెలుగు: కేసీఆర్ నాన్‌లోకల్ అని బీజేపీ లీడర్ మాట్లాడటం హాస్యాస్పదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్అన్నారు. తెలంగాణ తెచ్చినోడు ఏ నియోజకవర్గంలోనైనా లోకలేనని చెప్పారు. ‘‘కామారెడ్డి, సిద్దిపేట ఒకటే. కేసీఆర్అమ్మవాళ్ల ఊరు బీబీపేట మండలం కోనాపూర్. లోకల్‌కాదు అని ఎట్లంటరు. బీజేపీ వాళ్లకు చెప్పడానికి ఏమీ లేకనే ఏవేవో తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు. కామారెడ్డిలో గెలిచేది కేసీఆరే. మాస్టర్ప్లాన్రద్దు అయినప్పటికీ, కాలేదని గ్రామాల్లో చేస్తున్న ప్రచారం, పుకార్లు నమ్మొద్దు. కొడంగల్‌లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా. కామారెడ్డిలో బీఆర్ఎస్నాయకులకు పైసలిచ్చి కాంగ్రెస్ వాళ్లు కొంటున్రు. పైసలతో కొనుడు రేవంత్‌రెడ్డికి అలవాటే. మార్పు అంటే ఆరు నెలలకోసారి సీఎంను మార్చుడు కాదు. కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవల్లో క్యాడర్‌లేదు’’ అని కేటీఆర్అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరులో నిర్వహించిన కార్నర్మీటింగులో, నిజామాబాద్అర్బన్రోడ్షోలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని భయం..
కేసీఆర్ మూడోసారి సీఎం అయితే ఢిల్లీకి పోయి జెండా పాతుతారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ లోకల్ అని, ఎవరెన్ని కుట్రలు చేసినా కామారెడ్డిలో గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కలిసి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, ఎంతమంది వచ్చినా సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, మూడోసారి గెలిస్తే కొత్త పథకాలు వస్తాయని, పాత పథకాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేస్తామన్నారు. మూడోసారి సీఎం అయితే ఢిల్లీలో జెండా పాతుతారనే భయంతోనే మోదీ, అమిత్ షా, యోగి, కేంద్ర మంత్రులు, రాహుల్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కామారెడ్డికి వస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డిలోని భూములు గుంజుకోవడానికే కేసీఆర్ఇక్కడ పోటీ చేస్తున్నారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు. ఇంచు భూమి కూడా ఏ ఒక్కరూ కోల్పోరని స్పష్టం చేశారు. కేసీఆర్గెలిచాక అసైన్డ్‌భూములకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను గెలిపిస్తే ఐదేండ్ల కాలంలో కామారెడ్డి దేశంలో నంబర్ వన్ నియోజకవర్గంగా మారుతుందన్నారు. తెల్ల రేషన్‌కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు.
తల నరుక్కుంటాం..కానీ తల వంచం
మైనార్టీలను పేదలంటూ మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్.. 55 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, నరేంద్ర మోదీతో కొట్లాడే దమ్ము బీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు రూ.12,780 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ఒకటే అనడానికి ఏనాడైనా ఎన్నికల పొత్తు పెట్టుకున్నాయా? అని కేటీఆర్ప్రశ్నించారు. కేసీఆర్ గొంతు నొక్కడానికి మోదీ, అమిత్‌షా ప్రయత్నాలు చేస్తున్నారని, తల నరుక్కుంటాం కానీ ఢిల్లీ లీడర్ల ముందు తలవంచమని కేటీఆర్స్పష్టం చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్లలో తొమ్మిదిసార్లు పోటీ చేసి ఏడుసార్లు ఓడిపోయిన షబ్బీర్‌అలీ రాజకీయాల్లో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు.
రాహుల్ రాజకీయ నిరుద్యోగి
రాహుల్‌గాంధీ రాజకీయ నిరుద్యోగి అని, యువతను రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్అన్నారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము ఆయనకు ఉందా? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేండ్లలో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,083 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామని.. ఈ లెక్క తప్పు అని నిరూపించాలని సవాల్ చేశారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 10 వేలు మాత్రమేనన్నారు. ‘‘రాహుల్తన జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం, ఉద్యోగం చేశారా.. యువత ఆకాంక్షలు ఆయనకు తెలుసా.. పోటీ పరీక్షలు రాశారా.. ఇంటర్వ్యూలకు వెళ్లారా.. ” అని ప్రశ్నించారు. తాము 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కొత్త జోనల్వ్యవస్థ తెచ్చామన్నారు. కాంగ్రెస్ మాత్రం.. 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను సమర్థిస్తూ తీర్పునిస్తే పార్లమెంట్లో చట్టం చేసి వాటిని రద్దు చేసి తెలంగాణ స్థానిక హక్కులకు సమాధి కట్టిందన్నారు. ఆరు సూత్రాలు, 610 జీవో, గిర్గ్లాని కమిషన్నివేదికను తుంగలో తొక్కి హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా మార్చేసిందని.. నాన్లోకల్కోటా పెట్టి తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కకుండా చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నిరాశా నిస్పృహలతో యువత తుపాకులు పట్టి అడవిబాట పడితే.. ఎన్ కౌంటర్ ల పేరుతో వేలాది మందిని కాల్చిచంపారన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలకు అడ్డాగా ఉండేదని, అంగట్లో బేరం పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారని విమర్శించారు.
పీవీ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదు
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్‌పార్టీకి లేదని కేటీఆర్అన్నారు. శనివారం ఓ న్యూస్ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. పీవీ లాంటి గొప్ప నాయకుడి పార్థివదేహాన్ని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌కు రానివ్వకుండా అవమానించిన సంగతి తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. మాజీ ప్రధానికి ఢిల్లీలో కనీసం మెమోరియల్నిర్మించకుండా అడ్డుకున్నది కూడా కాంగ్రెస్పార్టీయేనన్నారు. పీవీ కుటుంబానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలన్నారు.