నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు

లిక్కర్ స్కామ్​ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలోనే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక పరీక్షల ప్రశ్న పత్రాల లీకుల  బాగోతం బయటపడ్డది. అది యావత్ తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా  నిరుద్యోగులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోటికి పైగా ఈ స్కామ్​ ప్రభావంతో నిద్రాహారాలు వంట పట్టక ఆందోళనలో ఉన్నారు. 2001 నుంచి  నిరుద్యోగులుగా ఉండడమే కాక ఆస్తులను అమ్ముకొని,  కోచింగులు తీసుకొని, కిరాయిలు కట్టి, మేస్ ల్ లో తింటూ చదువుతున్న  నిరుద్యోగులకు పేపర్ లీకేజీ వారి పాలిట అశనిపాతంగా మారింది.

ఇంత జరిగినా రాష్ట్రంలో పేపర్ లీకేజీ  సాధారణమే,  ఆది కొత్తేమీ కాదని  రాష్ట్ర క్యాబినెట్ సీనియర్ మంత్రి పుంగవులు  మొన్ననే సెలవిచ్చారు. అంటే గత ఎనిమిది సంవత్సరాల నుండి జరుగుతున్న పరీక్షల అన్నింటిలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కూడా సాధారణమైనట్లే అని చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో పురపాలక, పరిశ్రమల, చేనేత, ఐటీ మొదలగు అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత షాడోముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యువ నాయకుడి మాటల ప్రకారం, కేవలం ఇద్దరు ఉద్యోగులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహిస్తుందని ఎంతో సింపుల్ గా  ప్రశ్నిస్తున్నారు. 30 లక్షల మంది భవితవ్యాన్ని అంధకారంలో పడేసిన ఇంత పెద్ద దుర్మార్గపు స్కామ్ ను  చాలా చిన్నదిగా చిత్రీకరించడం అంటే  ప్రజల సమస్యలను అపహాస్యం చేయడమే కదా! 

తెచ్చుకున్న తెలంగాణలో  పెరిగింది అన్యాయమే.

తెలంగాణలో సీనియర్ కాంట్రాక్టర్లు కూడా తమ పెండింగ్ బిల్లుల డబ్బులు విడుదల కొరకు తగినంత పర్సెంటేజ్ ఉన్నత స్థాయిలో ముట్ట చెప్పుకోవాలని గునుగుతున్నారు. కొత్త ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన కొత్త ఉన్నతశ్రేణి కాంట్రాక్టర్లు అవతరించారని ఇతర సామాజిక వర్గాల కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు మాత్రమే అరకొరగా మిగులుతున్నాయని, తెలంగాణ తెచ్చుకుని నష్టపోయామని ఈ వర్గం లోలోపల మదన పడుతున్నది. రైతుబంధు, రైతు భీమా  దొరలకు, భూస్వాములకు ఇతోదికంగా ఉపయోగపడ్డది గాని పేద, చిన్న  కౌలుదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క ,చిల్లి గవ్వ కూడా పొందలేకపోయారు. వేలాదిమంది ఈ కోవకు చెందిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సాధారణమైంది. ధరణి వ్యవస్థ కూడా పేద రైతుల పాలిట శాపంగా మారింది. లంచగొండి అధికారులకు, నాయకులకు, భూకామంధులకు ధరణి వ్యవస్థ నిత్యం ఒక అక్షయపాత్రగా అవతరించింది.

రైతులు వేల, లక్షల రూపాయల లంచాలు ఇచ్చుకున్నా ఈ దుర్మార్గపు ధరణి సమస్యల నుంచి విముక్తి పొందలేకపోతున్నారు. మద్యం అమ్మకాలను 500% పెంచి  తాగుబోతులను చేసి ప్రతి సంవత్సరం వేలమంది యుక్త వయస్సులో మరణించగా,  స్త్రీలు భర్తలను కోల్పోయి, చంటి పిల్లలు తండ్రులను కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మద్యం అమ్మకంలో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి ర్యాంకులో నిలబెట్టారు. పేదలు చదివే విద్యాసంస్థలు, చికిత్సలు అందాల్సిన  వైద్య సంస్థలు నిర్వీర్యం చేయబడి మెరుగైన సేవలు అందించలేక నిరర్థకమై  పోయినాయి.

ముఖ్యమంత్రికి అభ్యర్థన..

తమకు ఓట్లు వేసి గెలిపించిన తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని, ఇకనైనా ముఖ్యమంత్రి  వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించి, తిరిగి రిటైర్డ్ జడ్జిలు, ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ప్రొఫెసర్ల ద్వారా నిజాయితీగల సమర్ధులతో కమీషన్​ను పునర్వ్యవస్థీకరణ జరిపించాలి.  ప్రభుత్వ పరిపాలన అవినీతిమయమై, ఆశ్రితపక్షపాతంతో వ్యవహరిస్తుందని, విశ్వాసాన్ని కోల్పోయిందని, తెలంగాణ ప్రజలు భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు తక్షణ చర్యలు చేపట్టాలని ఒక ఉద్యమకారునిగా, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి అనుచరునిగా, ప్రజల అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఉందని వారిని వినయ పూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.

తిరిగి ఇలాంటి దుర్మార్గపు అవకతవకలకు తావియ్యని నూతన ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక పాలనను సామాజిక న్యాయాన్ని, అవినీతి లేని పాలనను అందించే నూతన వ్యవస్థను నిర్మించే దిశలో ఆలోచించాలి. తాత్కాలిక ప్రలోభాలకు ఎన్నికల తాయిలాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని సామాజిక న్యాయాన్ని  నిర్మించుకోవాలి. ప్రజలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మేధావులు అంతా పార్టీలకతీతంగా తమ తమ పాత్రను పోషించవలసిన పరిస్థితి ఏర్పడిందని గుర్తిద్దాం.

అక్కడ లిక్కర్​ స్కామ్​, ఇక్కడ లీకుల స్కామ్​

కవితను వెంటాడుతున్న లిక్కర్ స్కామ్​ తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నట్లు  చిత్రీకరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు తెలంగాణకు సంబంధమేమిటని  ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరు చేసిన పాపమో కానీ ఇది తెలంగాణ ప్రజలకు అంటగట్టి తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. 15 ఏండ్లు పోరాటాలు చేసి తమ జీవితాలను వ్యర్థం చేసుకున్న తెలంగాణ యువతను ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నామని 8 సంవత్సరాలు గడిపి చివరికి  ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో  అవమానాలకు , ఆత్మక్షోభలకు గురిచేశారు.

2016 నుంచి ఇప్పటివరకు జరిగిన గ్రూప్ వన్, ఇతర పరీక్షల సందర్భంలో జరిగిన లీకేజీల గురించి ఇప్పుడిప్పుడే అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నవి. అందుకే అన్ని పరీక్షల పైన ఒక సిటింగ్ సుప్రీంకోర్టు జడ్జ్ ద్వారా విచారణ చేయిస్తే తప్ప, కేవలం రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న సిట్ ద్వారా మాత్రం వాస్తవాలు బయటకు రావని ప్రజలు, నిరుద్యోగులు  ఆందోళన చెందుతున్నారు. పేపర్​ లీక్​లపై లేని శ్రద్ధ, ఢిల్లీ లిక్కర్​ స్కామ్ పైనే ఈ ప్రభుత్వం అధిక శ్రద్ధ పెట్టిందనే ప్రజావాక్కును ఎవరు కాదనగలరు?

అడుగడుగునా అక్రమాలు

ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను కూడా బ్లాక్ మార్కెట్లో రెండు మూడు లక్షలకు ఒక్కొక్కటి చొప్పున అమ్ముకున్న ఉదాంతాలు యువతరానికి తెలుసు. అనేక ఉద్యోగాలు తమ సామాజిక వర్గానికి  దారాదత్తం చేయడం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి కంపెనీలో కారుణ్య ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఏ పథకాన్ని పొందాలన్నా కట్నాలు, కానుకలు, మడుపులు చెల్లించుకోవాల్సిందేనని యువత ఆవేదన పడుతున్నది.

ఓవర్సీస్ స్కాలర్షిప్ లకు, దళిత బంధు పథకాలకు ఇంకా ఎలాంటి లబ్ధి కొరకైనా ఏజెంట్ల ద్వారా పర్సంటేజ్ ప్రకారం చెల్లింపులు చేసుకోవాల్సిందే అని ప్రజల  ఆవేదన .అధికారుల పోస్టింగులకు ముఖ్యమైన ప్రదేశాల్లో బదిలీలకు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవాల్సిందే అని అధికారులు వాపోతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కూడా చెల్లింపులు తప్పడం లేదు.  ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో సరయిన బుద్ధి చెప్పడం జరిగిందని  అధ్యాపకులు సంతోష పడుతున్నారు. –కూరపాటి వెంకట్ నారాయణ,రిటైర్డ్​ ప్రొఫెసర్​