ఆరోజు మేం ఫెయిల్ అయ్యాం..అక్టోబర్7 మారణహోమంపై ఇజ్రాయెల్ ఆర్మీచీఫ్​

ఆరోజు మేం ఫెయిల్ అయ్యాం..అక్టోబర్7 మారణహోమంపై ఇజ్రాయెల్ ఆర్మీచీఫ్​

 

  • అక్టోబర్​ 7 మారణహోమంపై ఇజ్రాయెల్ చీఫ్​ ఆఫ్ జనరల్ స్టాఫ్

టెల్ అవీవ్: ఇజ్రాయెల్​లో గతేడాది అక్టోబర్ 7న జరిగిన మారణహోమాన్ని తలచుకుని ఆ దేశ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ నరమేధం జరిగి సోమవారం నాటికి ఏడాది పూర్తయింది. హమాస్  టెర్రరిస్టులు ఊచకోత జరిపిన ప్రాంతాన్ని బాధితుల కుటుంబ సభ్యులు సందర్శించి తమ వారికి నివాళి అర్పించారు. గత ఏడాది అక్టోబరు 7న తమ దేశ ప్రజలను రక్షించడంలో తాము ఫెయిల్  అయ్యామని ఇజ్రాయెల్  చీఫ్​ ఆఫ్  జనరల్  స్టాఫ్  హెర్జీ హలేవీ తెలిపారు. ఈమేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కు ఆయన ఒక సందేశం పంపారు.

తమను నాశనం చేయాలనుకుంటున్న శత్రువులను మట్టుబెడతామని ఆయన ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ‘‘మన శత్రువులతో మనం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నాం. మనం చేస్తున్న యుద్ధం ఇప్పటితో ముగిసేది కాదు. అది సుదీర్ఘమైనది. మన శత్రువులకు ప్రతి క్షణం కూడా నరకం కనిపించాలి” అని హెర్జీ ఆ సందేశంలో పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం 6.29 గంటలకు కిబుట్జ్  రీమ్  (నోవా మ్యూజిక్  ఫెస్టివల్  జరిగిన ప్రాంతం. 

ఇక్కడే 370 మందిని హమాస్  టెర్రరిస్టులు ఊచకోత కోశారు) వద్ద మృతులకు ఇజ్రాయెల్  అధ్యక్షుడు ఐజాగ్  హెర్గాజ్  నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ నాటి నరమేధంతో దేశం ఇంకా దుఖంలో ఉందన్నారు. ‘‘హమాస్  టెర్రరిస్టుల దాడితో దేశంలో జనజీవనం స్తంభించిపోయింది. దేశాన్ని పునర్నిర్మిస్తాం. కోల్పోయిన ప్రతిదానినీ పునరుద్ధరిస్తాం. బందీలుగా ఉన్న వారిని విడిపిస్తాం” అని హెర్గాజ్  పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్  మిలిటరీ లీడర్లు, రాజకీయ పార్టీల నేతలు కూడా నాటి నరమేధాన్ని తలచుకున్నారు. మృతులకు నివాళి అర్పించారు. నాటి భీకర ఘటనకు సంబంధించిన ఓ కొత్త వీడియో ఫుటేజీని ఐడీఎఫ్  విడుదల చేసింది.

 నివాళి అర్పించిన ఫ్రెంచ్  అధ్యక్షుడు

హమాస్  టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్  వాసులకు  ఫ్రెంచ్  అధ్యక్షుడు ఎమ్మానుయేల్  మాక్రాన్  ‘ఎక్స్’ లో నివాళి అర్పించారు. ‘‘అక్టోబర్ 7 నాటి ఘటన ఇంకా మన కళ్ల ముందే ఉంది. ఇజ్రాయెల్  ప్రజల బాధ మా బాధ కూడా. బాధితులు, బందీలను మనం మరిచిపోలేం. ఉగ్రవాదుల నరమేధంతో ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోయాయి” అని మాక్రాన్  ట్వీట్  చేశారు. కాగా.. నోవా మ్యూజిక్  ఫెస్టివల్ లో హమాస్  టెర్రరిస్టుల దాడిలో బతికిన వారు సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. నాటి భీకర ఘటనను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.