జనం ఈ మధ్య డెమొక్రసీ, లిబరలిజం, ఫ్రీడం, అటానమీ లాంటి మాటలు మర్చిపోయారని, దీంతో ఆ కాన్సెప్టులకు ప్రస్తుతం కాలం చెల్లిందని కొందరు అనుకుంటున్నారు. కానీ.. ఇది కరెక్ట్ కాదని టర్కీ, హాంకాంగ్, చెక్ రిపబ్లిక్ , సూడాన్ లలో జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతోంది . జనం ఫ్రీడం కోసం ఎంత తహతహలాడుతున్నారో తెలుస్తుంది .
ప్రజల్లో ఇప్పుడు లిబరలిజం ఫీలింగ్స్ మచ్చుకైనా లేవని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల అన్నారు. దేశంలో తలదాచుకోవటానికి వచ్చే ఇతర దేశాలవాళ్లు, బతుకు దెరువు కోసం వలస వచ్చేవాళ్లు, మూడో జెండర్ వ్యక్తుల విషయంలో ఉదారంగా ఉండాలనే ఆలోచనలను ప్రజల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. జీ–20 సదస్సుకు ముందు జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చోటుచేసుకుంటున్న పలు సంఘటనలను పరిశీలిస్తే పుతిన్ అభిప్రాయాలు తప్పు అని ఇట్టే తేలిపోతుంది. తమకు స్వేచ్ఛ కావాల్సిందేనని జనం గళం విప్పుతున్నారు. టర్కీలోని ఇస్తాన్‌బుల్ నగరంలో, చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో, సూడాన్ క్యాపిటల్ సిటీ ఖర్తుమ్తోపాటు హాంకాంగ్‌లో లక్షల సంఖ్యలో ప్రజలు హక్కుల సాధన కోసం రోడ్ల మీదికి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీన్నిబట్టి ఫ్రీడం విషయంలో జనం ప్రభుత్వంతో మరీ అంతగా రాజీపడట్లేదని అర్థమవుతోంది. స్పందించాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారీ తమదైన రీతిలో పాలకుల కళ్లు తెరిపిస్తున్నారు.
ఇస్తాన్‌బుల్ ఓటర్లు ఇలా బుద్ధి చెప్పారు..
టర్కీలోని ఇస్తాన్‌బుల్‌లో 3 నెలల కిందట పూర్తైన మేయర్ ఎన్నికలను ప్రెసిడెంట్ రెకెప్ తయ్యిప్ ఎర్డొగాన్ ఏకపక్షంగా రద్దు చేశారు. ఎలక్షన్లో ఆయన నాయకత్వంలోని ‘జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ’ స్పల్ప తేడాతో ఓడిపోయింది. ఎక్రెమ్ ఇమామోగ్లు నేతృత్వంలోని సెక్యులర్ రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ విజయం సాధించింది. స్వల్ప తేడాతో ఓడినా, భారీ లోటుతో ఓడినా ఓటమి ఓటమే కదా. ప్రెసిడెంట్ రెకెప్ తయ్యిప్కి ఇదే రుచించలేదు. ఈ పరాజయం ఆయన ఇగోని దెబ్బతీసింది. ఓటమిని తట్టుకోలేకపోయిన ప్రెసిడెంట్ రెకెప్ తయ్యిప్ ఎర్డొగాన్ ఎన్నికల రద్దు నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన పార్టీయే నెగ్గాలనే మొండి పట్టుదలతో జూన్ 23న మళ్లీ ఎన్నికలు జరిపాడు. ఈ నేపథ్యంలో తమ తీర్పును కాలరాయాలని చూసిన ప్రెసిడెంట్ తీరును సిటీ ఓటర్లు తీవ్రంగా పరిగణించారు. ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలని తీర్మానించుకున్నారు. ముందుగానే ప్లాన్ చేసుకున్న తమ ప్రోగ్రామ్‌లను, సెలవులను క్యాన్సిల్ చేసుకొని రీఎలక్షన్‌లో రెట్టించిన ఉత్సాహంతో ఓటేశారు. అంతకుముందు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రెసిడెంట్ రెకెప్ తయ్యిప్ ఎర్డొగాన్ పార్టీ రెండోసారి ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆయన తిరుగులేని అధికారాన్ని చెలాయించే పరిస్థితి లేకుండా పోయింది.
చెక్ రిపబ్లిక్ ప్రధానికే చెక్ పెట్టారు..
చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి ఆంద్రెజ్ బాబిస్ వర్కింగ్ స్టైల్ కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ఉంటుంది. ట్రంప్ లాగే ఆయనా బిలియనీరే. ఎన్నో స్కాంలకు పాల్పడ్డాడు. తన హోటల్ ప్రాజెక్టుల్లో ఒకదానికి ఇల్లీగల్‌గా యూరోపియన్ యూనియన్ బడ్జెట్ నుంచి సబ్సిడీ ఇప్పించారు. ఈ కేసులో ఆయన్ని పోలీసులు ప్రాసిక్యూట్ చేయటానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా న్యాయ శాఖ మంత్రిని నియమించారు. దీంతో కేసు ఇన్వెస్టిగేషన్‌ని పొలిటికల్‌గా ప్రభావితం చేయటానికి ఇన్‌డైరెక్ట్‌గా ప్రయత్నించారు. దీనిపై ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రాజధాని ప్రాగ్లో లెట్నా పార్క్ వద్ద రెండున్నర లక్షల మంది నిరసన చేపట్టారు. ‘ప్రభుత్వం డెమొక్రటిక్‌గా వ్యవహరించాల్సిందే. లేకుంటే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. చెక్ రిపబ్లిక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 30 ఏళ్ల తర్వాత (1989 వెల్వెట్ రెవల్యూషన్ అనంతరం) ఇంత భారీ ఎత్తున ర్యాలీ జరగటం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటి వరకూ ప్రధానిగా ఆంద్రెజ్ బాబిస్కు ఎదురే లేదనుకున్న పరిస్థితి కాస్తా తలకిందులైంది. ఆయన రాజీనామా చేయాలంటూ సెంట్రల్, ఈస్టర్న్ యూరోప్‌లో డిమాండ్లు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
సూడాన్ డిక్టేటర్ ఒమర్ అల్ బషిర్ 30 ఏళ్ల పాలనకు తెర
సూడాన్‌లో నిత్యావసర సరుకుల రేట్లు భారీగా పెరగటంతో ప్రజలకు లివింగ్ కాస్ట్ తడిసి మోపెడవుతోంది. ధరలు అదుపు చేయాలని కోరుతూ జనం గతేడాది చివరలో ఉద్యమం ప్రారంభించారు. ఈ పోరాటం ఆ దేశాన్ని 30 ఏళ్లుగా డిక్టేటర్లా ఏలుతున్న ఒమర్ అల్ బషిర్ పాలనకు తెర దించింది. ముందుగా ప్రభుత్వ పాలనాధికారాన్ని ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. తర్వాత సివిలియన్ అడ్మినిస్ట్రేషన్‌కి అధికారాలను అప్పగించేందుకు మొండికేసిన ప్రెసిడెంట్ ఒమర్ అల్ బషిర్ని ఆ పదవి నుంచి తప్పించింది. అతనిపై అప్పటికే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు హత్యాభియోగాలు మోపింది. దార్ఫర్ ప్రాంతంలో 118 మంది ఆందోళనకారులను కాల్చి చంపినందుకు, 70 మందిని రేప్ చేసినందుకు ఈ చర్య చేపట్టింది. గత నెల 3న జరిగిన ఈ హత్యాకాండ అనంతరం సూడాన్ ప్రజలు పట్టరాని కోపంతో ప్రభుత్వంపై తిరగబడ్డంత పని చేశారు. తమకు ఈ డిక్టేటర్ పాలన నుంచి విముక్తి కల్పించాలని; స్వేచ్ఛ, శాంతి, న్యాయం కావాలని కోరుతూ లక్షల సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఆ దేశంలో ఈ స్థాయిలో ఆందోళనలు జరగటం ఇదే తొలిసారి.
హాంకాంగ్‌లో హడలెత్తించారు..
హాంకాంగ్ నాలుగు నెలలుగా ఆందోళనలు, అల్లర్లతో ఉడికిపోతోంది. నేరారోపణలు వచ్చిన నగరం పౌరులను చైనా కోర్టుల్లో విచారించాలని లోకల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన బిల్లుపై హాంకాంగ్ ఎదురుతిరిగింది. ఈ బిల్లును వ్యతిరేకించేవారి సంఖ్య క్రమంగా వేల నుంచి లక్షలకు చేరింది. మార్చిలో 12 వేల మందితో మొదలైన ఈ మూమెంట్లో ఏప్రిల్ నాటికి లక్ష మందికి పైగా చేరారు. జూన్‌లో అనూహ్యంగా పది లక్షల నుంచి 20 లక్షల మందికి పెరిగారు. సిటీలోని మొత్తం పాపులేషనే 75 లక్షలు కాగా అందులోని ప్రతి ఇద్దరు యూత్‌లో ఒకరు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రీసెంట్గా పెద్దఎత్తున హంస చెలరేగింది. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ముఖానికి ముసుగులు వేసుకొని, తలకు హెల్మెట్ పెట్టుకొని సిటీ లెజిస్లేటివ్ చాంబర్లోకి దూసుకెళ్లారు. బ్రిటిష్ పాలన ముగిసి హాంకాంగ్‌ను తిరిగి చైనాకు అప్పగించి 22 ఏళ్లయిన రోజే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అనుమానం ఉన్న నేరస్తులను చైనాకు అప్పగించటానికి వీలు కల్పించే బిల్లును విత్‌డ్రా చేసుకోవాలని ప్రజలు భారీఎత్తున రోడ్ల మీదికి వచ్చి మరీ నిరసనలు తెలిపారు. దీంతో హాంకాంగ్ సర్కారు వెనక్కి తగ్గి బిల్లును తాత్కాలికంగా నిలిపేసింది.