- నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్న జనం
- సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేస్తామంటూ వెల్లడి
- పలుచోట్ల ఆందోళనలు
- చేసేదేంలేక వెనుదిరుగుతున్న ఎమ్మెల్యేలు, నాయకులు
నిర్మల్, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల ప్రజలు ఓటును అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఏండ్ల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తేనే ఓటింగ్ లో పాల్గొంటామంటూ పలు గ్రామాల ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతనే అధికారులు, పార్టీల అభ్యర్థులు, నాయకులు తమ గ్రామానికి రావాలంటూ స్పష్టం చేస్తున్నారు. ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టుకొని రాస్తారోకోలు, ధర్నాలు ర్యాలీలు చేపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు ఇప్పటివరకు వాటి ఊసే లేదని, మళ్లీ వారు తమ గ్రామానికి వస్తే ఊరుకోబోమంటూ స్పష్టం చేస్తున్నారు. ఇన్నేండ్లు గడిచినా ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలు బైకాట్ చేస్తామని వెల్లడి
నిర్మల్‌జిల్లాలోని కుంటాల మండలం అంబుగాం గ్రామస్తులు రోడ్డు సమస్యను పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని, సమస్యను పరిష్కరించిన తర్వాతనే రాజకీయ పార్టీల నేతలు గ్రామానికి రావాలంటూ కొద్దిరోజుల క్రితం నేతలను అడ్డుకున్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఎన్నికలను బహిష్కరించేందుకు వెనకాడబోమంటూ హెచ్చరించారు. ‘సమస్యలు పరిష్కరించని కారణంగా ఈసారి ఎన్నికల్లో తాము పాల్గొనబోమని.. ఏ పార్టీ అభ్యర్థులు, నాయకులు ప్రచారం కోసం తమ గ్రామానికి రావద్దని’ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడెం మండలం గంగాపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గంగాపూర్, కుర్ర తండా, రామి గూడెం గ్రామాల ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ధర్నా చేపట్టి గ్రామపంచాయతీ ఆఫీస్‌కు, ఫారెస్ట్ ఆఫీస్‌కు, స్కూల్‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. బ్రిడ్జి, రోడ్డును వెంటనే నిర్మించాలని లేకపోతే ఏ ఒక్క అధికారిని గ్రామంలోకి రానివ్వబోమంటూ స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరిస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని, లేకపోతే బైకాట్ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారం రోజుల క్రితం గంగాపూర్ లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వెళ్లిన తహసీల్దార్ రాజేశ్వర్ ను గ్రామస్తులంతా అడ్డుకొని నిరసన తెలిపారు. బుధవారం లోకేశ్వరం మండలం ఎడ్దూర్, పొట్పల్లి గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని గ్రామాల్లోకి రానివ్వకుండా పొలిమేర వద్దే అడ్డుకున్నారు.
నెరవేరని సీఎం హామీ పైనా నిరసన
ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల వ్యవహారం ప్రస్తుతం తెరపైకి వస్తోంది. ఖానాపూర్ నియోజకవర్గంలో గతంలో ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ ప్రకటించారు. ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా మారుస్తామని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. హామీ ఇచ్చి ఐదేండ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయలేదు.
ALS0 READ: నర్సాపూర్ సెగ్మెంట్ లో అసంతృప్తి సెగలు! .. కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్న బీఆర్ఎస్ నాయకులు
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదు. దీంతో ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని, నాయకులను సమస్యలపై నిలదీస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ముథోల్నియోజకవర్గంలోనూ సమస్యలు పేరుకుపోయాయని, ఎన్నికల ప్రచారానికి వస్తే ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని నిలదీస్తామని ఆయా గ్రామాల ప్రజలు వెల్లడిస్తున్నారు.