న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేత చర్యలు చేపడుతున్నది. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరతతోపాటు ప్రభుత్వం విధించిన భారీ పన్నులకు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు ఇటీవల నిరసనలకు దిగారు.
నిరసనల్లో భాగంగా ముజఫరాబాద్, దద్యాల్, మీర్పూర్ ఏరియాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు శనివారం మార్చ్‌ను చేపట్టారని నివేదికలు వెల్లడించాయి. ప్రజల నిరసనను అణిచివేయడానికి పాకిస్తాన్ రేంజర్లు, స్థానిక పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ దాడిలో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. శాంతియుతంగా ప్రారంభమైన మార్చ్.. బలగాలు గాల్లోకి కాల్పులు జరపడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఏకే 47లతో కాల్పులు జరిపినట్లు చూపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పీఓకేలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పాకిస్తాన్‌లోని పెద్ద పెద్ద సిటీలకు మళ్లించడంతో స్థానికులు ఫైర్ అవుతున్నారు.