అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఎమ్మెల్యేను నిలదీసిన జనం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సోమవారం లబ్ధిదారులకు పట్టాలు అందజేయడం కోసం మాసాయిపేటకు వచ్చిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. అనర్హులకు ఇండ్లు కేటాయించారని నిలదీశారు. లబ్ధిదారుల లిస్ట్ నుంచి తమ పేర్లను ఏ కారణంతో తొలగించారో చెప్పాలంటూ ఆందోళన చేశారు. దీంతో అభ్యంతరాలు ఉంటే తనకు చెప్పాలని ఎమ్మెల్యే సునీత వారిని సముదాయించారు. సమావేశం దగ్గరకు తీసుకెళ్లి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు బీఆర్ఎస్ లీడర్లు ఆఫీసర్లతో కుమ్మక్కై కావాలనే తమ పేర్లను తొలగించారని, వారికి అనుకూలంగా ఉన్నవారి పేర్లను చేర్చారని చెప్పారు. సొంత ఇండ్లు ఉన్నవారి పేర్లను కూడా లిస్టులో చేర్చారని, ఇండ్లు లేని తమను తొలగించారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే సునీత ఆఫీసర్లను వివరణ కోరగా.. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినందున వారి పేర్లను డబుల్ ఇండ్ల లిస్ట్ నుంచి తొలగించామని చెప్పారు. దీంతో బాధితులు గొడవకు దిగారు. లిస్ట్ లో పేర్లున్న వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని, ప్రభుత్వం నుంచి లబ్ధిపొందారని.. మరి వారి పేర్లు ఎందుకు తొలగించలేదని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే సునీత జోక్యం చేసుకుని మాట్లాడుతూ లిస్ట్ లో పేర్లున్న వారిలో ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో చెప్పాలని, వారి పేర్లను తొలగిస్తామని చెప్పారు. తాము పేర్లు చెప్తే తమకు, వాళ్లకు గొడవలు అవుతాయని, అధికారుల ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. లిస్ట్ లో పేర్లు చదివితే ఎవరికి ఇండ్లు ఉన్నాయో లేదో తెలిసిపోతుందని, ఆఫీసర్లకు కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. ఈ విషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో పోలీసులతో నిరసనకారులను అక్కడి నుంచి పంపించివేశారు. తర్వాత ఎమ్మెల్యే లిస్టులో ఎవరి పేర్లయితే ఉన్నాయో వారందరికీ పట్టాలు పంపిణీ చేశారు. కాగా, మాసాయిపేటలో నిర్మించిన 40 డబుల్ ఇండ్ల కోసం 110 మంది దరఖాస్తు చేసుకోగా, 39 మందిని షార్ట్ లిస్ట్ చేసి పట్టాలు పంపిణీ చేశారు.

కలెక్టర్ కు బాధితుల ఫిర్యాదు 

మాసాయిపేటలో డబుల్ ఇండ్లను అనర్హులకు కేటాయించారని బాధితులు సోమవారం కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ అర్హుల పేర్లను తొలగించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నారని హైదరాబాద్ లో ఉంటున్న వ్యక్తులకు కూడా ఇండ్లు కేటాయించారన్నారు. గ్రామసభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా.. ఆఫీసర్లు ఇష్టానుసారంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.