- లిస్టుల్లో పేర్లు లేవంటూ అభ్యంతరాలు
- అనర్హులకు ఇండ్లు ఇస్తున్నారని ఫిర్యాదులు
నిజామాబాద్ జిల్లాలోనూ గ్రామసభల్లో నిలదీతలు తప్పలేదు. కమ్మర్ పల్లి గ్రామసభలో ఏలేటి లింగుబాయి అనే మహిళ రైతుభరోసా, రుణమాఫీపై అధికారులను నిలదీయగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల లిస్టులోపేర్లు రాలేదని పలువురు నిరసన తెలిపారు. బోధన్ మండలం పెంటకుర్దులో 530మంది ఇందిరమ్మ ఇండ్లకోసం ధరఖాస్తు చేసుకోగా 214మంది పేర్లేలిస్టులో వచ్చాయని, రేషన్ కార్డుల కోసం 188మంది దరఖాస్తు చేసుకోగా 53మంది పేర్లు ఉన్నాయని, ఆత్మీయ భరోసా లిస్ట్‌లో చాలామంది పేర్లు లేవని స్థానికులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
ఇదివరకే ఇండ్లున్నవారికి ఇండ్లు మంజూరు చేస్తున్నారని, ఒకే కుటుంబానికి చెందిన వారికి వేర్వేరు ఫ్యామిలీలుగా పేర్కొంటూలిస్ట్లో చేర్చారని ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అధికారులపైజనాలు మండిపడ్డారు. నందిపేట మండలంలోని పలుగ్రామాల్లో జరిగినగ్రామసభల్లో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. చాలామంది అనర్హుల పేర్లు లిస్ట్‌లో ఉన్నాయంటే స్థానికులు ఆయన దృష్టికి తేగా.. వాటిని సవరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
కామారెడ్డి, వెలుగు: ఈనెల 26 నుంచి నాలుగు కొత్త పథకాల అమలుకు సంబంధించి నిర్వహించిన గ్రామసభల్లో లబ్దిదారుల జాబితాలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. లిస్ట్‌ల్లో తమ పేర్లు ఎందుకు లేవని చాలామంది పేదలు అధికారులను నిలదీశారు. ఈ లిస్ట్ ఫైనల్ కాదని.. అభ్యంతరాలుంటే నోట్ చేసుకుని విచారణ చేస్తామని, లిస్ట్‌లో ఉన్న అనర్హుల పేర్లు తొలగిస్తామని అధికారులు ప్రజలకు వివరించి చెప్పారు. లిస్ట్‌లలో పేర్లులేని వారి నుంచి కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. కొత్త అప్లికేషన్లను కూడా పరిశీలించి అర్హులుంటే లిస్ట్‌లో చేరుస్తామని చెప్పారు. ఈనెల 24 వరకు నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులుతీసుకుని మరోసారి వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాతే ఫైనల్‌లిస్ట్ తయారవుతుంది.
రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపికలో భాగంగా కామారెడ్డి జిల్లాలో మంగళవారం గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహించి రూపొందించిన లిస్ట్‌లను గ్రామ, వార్డు సభల్లో చదివారు. లిస్టుల్లో పేర్లు లేని చాలామంది అధికారులపై మండిపడ్డారు. ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు ఇచ్చామని, అధికారులు కూడా ఇది వరకే ఇండ్ల దగ్గరకొచ్చి సర్వే చేశారని, అయినా తమ పేర్లు లిస్టులో ఎందుకు లేవని నిలదీశారు. లిస్ట్‌ల్లో అనర్హులున్నారంటూ కొన్న గ్రామాల్లో ఫిర్యాదు చేశారు.
కొత్త లిస్ట్‌లు తయారు చేయాలి
గ్రామ, వార్డు సభల్లో ప్రజల నుంచి అప్లికేషన్ల తీసుకునేందుకు నాలుగు 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడిలో అధికారులు పేర్లు చదవగానే ఇందిరమ్మ ఇండ్లలో తమ పేర్లు ఎందుకు లేవంటూ స్థానికులు మండిపడ్డారు. లిస్ట్‌లో ఇండ్లున్న వారి పేర్లు ఉన్నాయంటూ ఓ వ్యక్తి ఆధారాలు చూపగా.. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. పంటలు సాగు చేయని 300 ఎకరాలకు సంబంధించిన సర్వేనంబర్లను రైతు భరోసా లిస్టు నుంచి తొలగించినట్టు తాడ్వాయి గ్రామసభలో ఏఈవో తెలిపారు. ఆత్మీయభరోసా లిస్ట్‌లో చాలా తప్పులున్నాయని, మళ్లీ పరిశీలించి కొత్త లిస్ట్ తయారు చేయాలని గాంధారి మండలం గౌరారం గ్రామసభలో తీర్మానం చేశారు.
సదాశివనగర్ మండలం తిమ్మాజివాడిలో ఇందిరమ్మ ఇండ్లలిస్ట్లో పేర్లు లేనివారు నిరసన తెలిపారు. రేషన్‌కార్డుల కోసం ఎన్నసార్లు అప్లికేషన్లు పెట్టాలని పిట్లం మండలం కొమటిచెరువు తండాలో అధికారులను నిలదీశారు. బిచ్కుంద మండలం పత్లాపూర్గ్రామసభలో పేర్లు చదువుతుండగా బీఆర్ఎస్ లీడర్లు అభ్యంతరం చెప్పగా వారిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కామారెడ్డిలో 2వ వార్డు సభలో కనీస వసతులు లేకపోవడంతో చైర్పర్సన్ ఇందుప్రియ అధికారులపై అసహానం వ్యక్తం చేశారు. జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.