ప్రజావాణిలో సమస్యల ఏకరువు

నిజామాబాద్ సిటీ/కామారెడ్డి,  వెలుగు:  రెండు జిల్లాల్లో నిర్వహించిన‘ ప్రజావాణి’ లో సోమవారం ప్రజలు సమస్యల ఏకరువు పెట్టారు. తమ సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని , వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లకు మొర పెట్టుకున్నారు.  నిజామాబాద్​, కామారెడ్డి కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్లు రాజీవ్​గాంధీ హన్మంతు, జితేశ్​వి పాటిల్​అడిషనల్​కలెక్టర్లు, డీఆర్డీవో, ఆర్డీవోలతో కలిసి  అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను పెండింగ్​పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.  వివిధ సమస్యలకు సంబంధించి నిజామాబాద్​జిల్లాలో 78, కామారెడ్డి లో 58 అర్జీలు వచ్చినట్లు   అధికారులు తెలిపారు. 

రైతుబంధు ఇప్పించండి సారు..

రైతుబంధు విడుదలై మూడు నెలలు గడుస్తున్నా తమకు ఇంత వరకు రాలేదని కమ్మర్పల్లి మండలం, ఉప్లూరు గ్రామానికి చెందిన 15 మంది రైతులు ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సంబంధిత శాఖ అధికారులు జనవరిలో వస్తాయని చెప్పారని, కానీ ఇంతవరకు అకౌంట్​లో జమ కాలేదన్నారు. ఇటీవల అధికారులను అడిగితే స్పందిస్తలేరన్నారు. ‘రైతుబంధు’  ఇప్పించాలని కలెక్టర్​ను  కోరారు.

పొలం, ఇల్లు లాక్కొని రోడ్డున పడేసిండు..

ఆర్మూర్​ మండలం పెద్ద రాంపూర్​గ్రామానికి చెందిన నల్లూరి గంగు  తన ఒక్కగానొక్క కొడుకు రాజేశ్వర్​పొలం, ఇల్లు లాక్కొని రోడ్డున పడేశాడని  ఆవేదన వ్యక్తం చేసింది. కొన్నేండ్ల నుంచి ఆస్తి కోసం తనను, తన భర్తను చిత్రహింసలకు గురి చేశాడని కలెక్టర్​ఎదుట వాపోయింది. కొడుకు చిత్రహింసలు భరించలేక తన భర్త రాజారాం ఏడాది కింద చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.   తనకు న్యాయం చేయాలని కలెక్టర్​కు మొర పెట్టుకుంది.  

కొడుకును చూసైనా  ‘డబుల్’ ఇల్లు ఇవ్వండి  

‘నడవలేని స్థితిలో ఉన్న  నా కొడుకును చూసైనా ‘డబుల్’ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించండి’ అని  ఓ తల్లి.. కామారెడ్డి కలెక్టర్ జితేశ్​వి పాటిల్ ను వేడుకుంది.  జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ కు చెందిన వెంకటలక్ష్మి  దివ్యాంగుడైన కొడుకు ఆదిత్య (16) ను  తీసుకుని ప్రజావాణికి వచ్చింది.  ఇటీవల టౌన్ లో ‘డబుల్’ ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నామని, లిస్టులో తమ పేరు వచ్చినప్పటికీ డ్రాలో అవకాశం రాలేదని ఆమె  వాపోయారు. పరిశీలించి న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు.  

‘మా బాబు ప్రాణాలు నిలపండి’..

ఆర్మూర్ మండలం పెద్ద రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్, హారికలకు ఎనిమిదేళ్ల కింద ట్విన్స్ ​జన్మించారు. వారిలో ఒక బాబుకు తలలో నీరు నిండడంతో చికిత్స పొందుతూ ఐదు నెలలకే చనిపోయాడు. మరో బాబు శివకుమార్ కు ఎనిమిదేండ్లుగా హైదరాబాద్​లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయిస్తున్నారు. కానీ నయం కాలేదు. చివరకు హైదరాబాద్​లోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. 15 నుంచి 20 లక్షలు అవుతాయని తెలపగా, ప్రభుత్వం సాయం చేయాలని  ఏడాది కింద  ప్రజావాణిలో  దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు స్పందించకపోవడంతో  సోమవారం ప్రజావాణికి వచ్చి ‘ మా బాబు ప్రాణాలు నిలపండి’ సారూ అని కలెక్టర్​కు తల్లి హారిక మొర పెట్టుకున్నారు.