
పెబ్బేరు, వెలుగు: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి, ప్రజలే ఓడిపోయారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం పెబ్బేరులో నిర్వహించిన వరంగల్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను కాంగ్రెస్ నెరవేర్చకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేవారు.
.గెలిచిన నెలలోపే పెబ్బేరు సంత స్థలం మొత్తం ఇప్పిస్తానని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఏడాదిన్నర గడిచినా ఏం చేయాలో తెలియక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంత స్థలం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పూజారులకే చెందుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యామ్నాయ భూమి చూపించి ఉంటే ఇంత రాద్ధాంతం జరగకపోయేదని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల నాయకులు వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.