- దవాఖానాలో స్పెషలిస్టుల కొరత
- కార్మిక కుటుంబాలకు అందని సేవలు
- పురుషులు, మహిళల వార్డుల మూసివేత..పడకల సంఖ్య తగ్గింపు
- ఆస్పత్రి నిర్వహణపై నీలినీడలు
- సింగరేణి తీరుపై ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల మండిపాటు
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు : సింగరేణి కార్మికులకు సరైన వైద్య సేవలు అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోంది. కోట్లాది రూపాయల వ్యయంతో ఆస్పత్రులు నిర్మించినా.. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులకు వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రి తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతోంది.
ఏటా వార్డులు, సేవలను కుదించడంతో కార్మిక కుటుంబాలకు సరైన ట్రీట్మెంట్ అందడం లేదు. కొంత కాలంగా స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించని యాజమాన్యం.. ఉన్నవారిని కూడా తరలించే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పురుషులు, మహిళల వార్డులను కూడా మూసేసింది. చిన్నపాటి వైద్యానికి కూడా రోగులను దూరంగా ఉన్న రామకృష్ణాపూర్, గోదావరిఖని ఆస్పత్రులకు రెఫర్చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిని మూసేసి డిస్పెన్సరీగా మార్చేందుకు సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
275 నుంచి 75కు తగ్గిన బెడ్స్
1987లో 275 పడకలతో సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి పట్టణంలో ఏరియా ఆస్పత్రిని ప్రారంభించింది. సుమారు 3,500 మంది కార్మికులు, వారి కుటుంబాలతో పాటు మరో 4వేల మంది రిటైర్డ్ కార్మికులు బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రి సేవలపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంత బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లను క్రమక్రమంగా మూసివేయడం, ఏరియా హెడ్ క్వార్టర్ గోలేటికి తరలిపోవడంతో ఏరియా ఆస్పత్రి నిర్వహణపై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిని 50 పడకలకు కుందించారు. గతంలో పిల్లల వార్డును ఎత్తివేశారు. మహిళలు, పురుషుల వార్డును ఒకే వార్డు పరిధిలోకి తీసుకొచ్చారు. ఆర్థో, టీబీ, చిల్డ్రన్స్ వార్డులు, బ్లడ్ బ్యాంక్ మూసివేశారు. ఆస్పత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, స్పెషల్డెలివరీ వార్డు ఉన్నప్పటికీ గైనకాలజిస్ట్ లేదనే సాకుతో గతంలో రెండేళ్లకు పైగా ప్రసూతి సేవలు కూడా నిలిపివేవారు.
జోరుగా ప్రచారం
డాక్టర్లు, స్టాఫ్‌ను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేయడం, వరుసగా వార్డులను కుదిస్తుండడంతో సింగరేణి యాజమాన్యం బెల్లింపల్లి ఏరియా ఆస్పత్రిని మూసివేస్తోందనే ప్రచారం ఊపందుకుంది. సింగరేణి జీఎం మూసివేతకు కుట్ర చేస్తున్నాడని గుర్తింపు సంఘం లీడర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుండడంతో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆస్పత్రిని మూసివేసే కుట్రలు మానుకోవాలని, అభివృద్ధి చేసి కార్పొరేట్తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.
డాక్టర్లు ఐదుగురు, స్పెషలిస్టులు ఇద్దరే..
ఆస్పత్రిలో వైద్య సేవలను కుదిస్తున్న యాజమాన్యం.. స్పెషలిస్టు డాక్టర్లను నియమించడంలేదు. ఆస్పత్రిలో ప్రతిరోజూ దాదాపు 300 వరకు ఓపీ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఐదుగురు డాక్టర్లు మాత్రమే సేవలందిస్తున్నారు. 12 మంది సాధారణ డాక్టర్లకు గానూ కేవలం ముగ్గురు, 9 మంది స్పెషలిస్టులకు గాను ఇద్దరు(హెల్త్ ఆఫీసర్, గైనకాలజిస్ట్) మాత్రమే పనిచేస్తున్నారు. ఆరుగురు ఫార్మాసిస్టులకు ఇద్దరు, 24 మంది ఉండాల్సిన స్టాఫ్ నర్సులకు గానూ 17 మంది మాత్రమే ఉన్నారు. వార్డ్ అసిస్టెంట్లు, ఆయాలు, స్కావెంజర్లు, ల్యాబ్, ఎక్స్‌రే టెక్నీషియన్లు, ఫాథాలజిస్టుల కొరత ఉంది. ఆస్పత్రిలో వైద్య సేవల కోసం అవసరమైన మందులు, పరికరాలు లేకపోవడంతో డాక్టర్లు సైతం ఇక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటనలున్నాయి. సిబ్బందికి తాగు నీరు కూడా అందని పరిస్థితి ఉంది.
ఏరియా హాస్పిటల్‌ను మూసేస్తే ఊరుకోం..
బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని మూసివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను సింగరేణి యాజమాన్యం ఆపేయాలి. వేలాది కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డ్ కార్మికులు ఆస్పత్రి వైద్య సేవలపై ఆధారపడి ఉన్నారు. అన్ని విభాగాలు ఓపెన్చేయించడంతో పాటు మెడికల్ సిబ్బంది, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించేందుకు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్‌తో మాట్లాడుతా. ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తా.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్