భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పిన సర్కారు శాటిలైట్ సర్వే పేరుతో చాలా మంది ఆదివాసీలకు పట్టాలు రాకుండా చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం జడ్పీ మీటింగ్ హాల్లో ఆదివారం చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన జిల్లా పరిషత్ జనరల్‌బాడీ సమావేశం జరిగింది. పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో సభ్యులు మాట్లాడుతూ సర్వేలు కూడా పూర్తి స్థాయిలో చేయడం లేదని ఆరోపించారు. సర్వేల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పిందే నడుస్తోందని, కనీసం ఎఫ్ఆర్సీ మీటింగ్ సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదని జడ్పీటీసీలు, ఎంపీపీలు విమర్శించారు. జడ్పీటీసీలకు మండల పరిషత్ ఆఫీసుల్లో గదిని కేటాయించకపోవడం సరైంది కాదన్నారు.
పట్టాలు రాకుండా చేస్తున్రు..
అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలిస్తామని ప్రభుత్వం చెబుతున్నా శాటిలైట్ పేరుతో ఆదివాసీలకు పట్టాలు రాకుండా చేస్తున్నారని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న వారిని ఈ ఏడాది పంటలు వేయొద్దని బెదిరించారని అన్నారు. ఇప్పుడేమో ఆ భూముల్లో చెట్ల పొదలు ఉన్నాయని శాటిలైట్‌లో చూపిస్తూ సాగు భూమి ఎక్కడుందని దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సర్వే చేయడం లేదన్నారు. ఎఫ్ఆర్సీ కమిటీలు నామ్‌కే వాస్తేగా మారాయని, ఫారెస్ట్ వాళ్లు చెప్పినట్లుగానే సర్వే చేశారని ఆరోపించారు.
2005 కంటే ముందు నుంచి పోడు భూములకు సంబంధించిన కేసులు ఉన్న గిరిజనులకు కూడా పట్టాలు రాకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. అశ్వాపురం మండలం వెంకటాపురం తుమ్మలచెర్వు ప్రాంతంలో 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న వారిని ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా రాకుండా చేశారని విమర్శించారు. సర్వే చేస్తే రెవెన్యూ భూమిగా తేలిందని సభ్యులు తెలిపారు. బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు ప్రాంతంలో ఫారెస్ట్ భూములకు రెవెన్యూ వాళ్లు పట్టాలు ఎట్లా ఇస్తారని ఫారెస్ట్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు పంచాయతీలో రీ సర్వే చేయాలని కలెక్టర్, ఐటీడీఏ పీవో, డీఎఫ్‌వో లకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎప్పటి నుంచో సాగు చేస్తున్నా వివిధ కారణాలు చూపుతూ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారన్నారు.
పోడు భూములపై రెవెన్యూ, ఫారెస్ట్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జడ్పీ చైర్మన్ తెలిపారు. జడ్పీ బడ్జెట్లో దివ్యాంగులకు 5 శాతం నిధులు కేటాయించాలని జడ్పీటీసీ వసంత కోరారు. రోడ్ల పనుల్లో ఆలస్యం చేస్తున్నారని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, డిప్యూటీ సీఈవో నాగమణి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, లైబ్రరీ చైర్మన్ డి రాజేందర్, జడ్పీటీసీలు మేరెడ్డి వసంత, పోషం నర్సింహారావు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఆఫీసర్ల గైర్హాజరుపై ఆగ్రహం
జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్‌కు పలువురు ఉన్నతాధికారులు పర్మిషన్ తీసుకోకుండా కింది స్థాయి ఉద్యోగులను పంపించడంపై జడ్పీ చైర్మన్‌తో పాటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు రాకుండా కింది స్థాయి ఆఫీసర్లను పంపించడం ఏమిటని ప్రశ్నించారు. ఇదిలాఉంటే మీటింగ్ మధ్యలో వచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ కొంతసేపు ఉండి వెళ్లి పోయారు. పినపాక, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీటింగ్‌కు గైర్హాజరయ్యారు.
సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీపీలు..
ఇటీవల జరిగిన దిశ మీటింగ్‌లో తమను కలెక్టర్, డీఆర్డీవో అవమానించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ జడ్పీ మీటింగ్‌ను ఎంపీపీలు బహిష్కరించారు. మీటింగ్‌లో కూర్చునేందుకు కుర్చీలు వేయలేదని, కొందరిని గేట్ బయటే ఆపేశారని వారు తెలిపారు. తమను జిల్లా అధికారులే పట్టించుకోనప్పుడు జడ్పీ మీటింగ్‌లో తాము అడిగే ప్రశ్నలకు అధికారులు ఏం సమాధానం చెబుతారని, అందుకే మీటింగ్‌ను బహిష్కరిస్తున్నామని చెప్పారు.