డీజిల్ ట్యాంకర్ బోల్తా  

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్ కోసం జనం ఎగపడ్డారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం పెద్దపర్వతాపూర్ శివారులో అదుపుతప్పి డీజిల్ ట్యాంకర్(లారీ) పల్టీ కొట్టింది. విషయం తెలుసుకున్న సమీపంలోని జనం, వాహనదారులు డీజిల్ కోసం క్యాన్లు, డబ్బాలు, బకెట్లు తీసుకొచ్చి ఎగపడ్డారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న డీజిల్ కోసం ఒకరినొకరు నెట్టుకుంటూ అందినకాడికి తీసుకెళ్లారు. మరోవైపు డీజిల్ లారీ బోల్తా పడిన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డీజిల్ కోసం ఎగబడుతున్న జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం భారీ క్రేన్ల సాయంతో బోల్తా పడిన డీజిల్ ట్యాంకర్ ను పైకి లేపారు.