ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎం.ప్రశాంతి

ఆదిలాబాద్​ నెట్​వర్క్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించే దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా పాలన ప్రత్యేక అధికారి ఎం.ప్రశాంతి అధికారులకు సూచించారు. శనివారం కెరమెరి మండలం మోడి, ఆసిఫాబాద్ మండలం అడ, ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  6 గ్యారంటీల ఫలాలను అందించేందుకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల వారీగా ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల గ్రామ పంచాయతీలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రశాంతి పాల్గొన్నారు. దరఖాస్తుదారులు, నిర్వాహకులతో మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేరడిగొండ మండలంలోని లకంపూర్(జి) గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడె గజేందర్ పాల్గొన్నారు. 6 గ్యారంటీల కోసం ఎవరూ పైరవీకారుల మాటలు నమ్మొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి అధికారులు వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తారని అన్నారు. 

ప్రతి నెల పెన్షన్​ను సకాలంలో అందించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్  అన్నారు. పట్టణంలోని న్యూ హౌజింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లoకుండా చూడాలని అధికారులను కోరారు. దహెగాం మండల కేంద్రంలో ప్రజావేదిక వద్ద ప్రజలు పెద్దగా కనిపించలేదు.