హనుమకొండ, వెలుగు: ఈ నెల 6 నుంచి నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ సూచించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బహిరంగ విచారణను శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి హాజరై వివిధ సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా వివిధ కులసంఘాల ప్రతినిధులతో పాటు ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు.. కులాల స్థితిగతులు, సామాజికవర్గాల వారీగా అవకాశాలను వివరించారు. రాజకీయాల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తంగా 230 అర్జీలు కమిషన్ సభ్యులకు చేరగా.. ఇందులో హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి 142, జనగామ నుంచి 27, ములుగు నుంచి 7, మహబూబాబాద్ నుంచి 26, భూపాలపల్లి జిల్లా నుంచి 28 అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భంగా కొందరు ప్రతినిధులు కులాల పునర్విభజన చేపట్టాలని కోరారు. బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలని, అవసరమైతే నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేలా చూడడంతోపాటు, అలాంటి వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషన్ సభ్యులు తెలిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాలపై సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అవుతుందన్నారు.
సర్వే సమయంలో సరైన వివరాలను ఎన్యుమరేటర్లకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి.రియాజ్, కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, దివాకర, రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. బీసీ సంఘం నేతలు హనుమకొండ బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు.