పడుకోవాల్సిన టైమ్​లో సినిమాలేంటి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

  • రాత్రి 2 గంటలకు పిల్లలను పేరెంట్స్ రోడ్లపైకి ఎట్ల పంపిస్తరు
  • ‘గేమ్ ​ఛేంజర్’ టికెట్ల పెంపు ఉత్తర్వులపై 24 గంటల్లో పునఃసమీక్షించండి
  • వాళ్ల స్థానంలో మీరుంటే ఇలాగే చేస్తారా?.. ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
  • టికెట్ల రేట్ల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: గేమ్‌‌‌‌ ఛేంజర్‌‌‌‌ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై 24 గంటల్లో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ నిబంధన ప్రకారం టికెట్ రేట్లు పెంచారో పేర్కొనలేదని తెలిపింది. రాత్రి పడుకోవాల్సిన టైమ్​లో సినిమాలేంటని ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, పబ్​ల మూసివేతకు ఆదేశాలిస్తామని  హెచ్చరించింది. తెల్లవారు జామున షోలకు అనుమతించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

గేమ్‌‌‌‌ చేంజర్‌‌‌‌ సినిమా అదనపు షోలు, టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 3 పిటిషన్‌‌‌‌లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌‌‌‌ బీ.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి శుక్రవారం విచారించారు.  అదనపు షోల పేరుతో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. బెనిఫిట్‌‌‌‌ షోలకు ప్రభుత్వం.. పరోక్షంగా పర్మిషన్ ఇచ్చిందన్నారు. ‘‘రాత్రి పడుకోవాల్సిన టైమ్​లో సినిమాలు ఏంటి? అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత పిల్లలను రోడ్లపై తిరగడానికి తల్లిదండ్రులు ఎలా అనుమతిస్తారు? 16 ఏండ్లలోపు వారికి అర్ధరాత్రి దాటాక సినిమాలు, పబ్‌‌‌‌ల్లోకి అనుమతించరాదని ఉత్తర్వులివ్వాల్సి  ఉంటుంది’’అని హెచ్చరించారు.

రోజుకు 4 షోలకే అనుమతి ఉంటది

అంతకుముందు పిటిషనర్‌‌‌‌ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..‘‘చట్ట ప్రకారం రోజుకు 4 షోలకు అనుమతించాల్సి ఉంది. సంధ్య థియేటర్‌‌‌‌ ఘటన తర్వాత బెనిఫిట్‌‌‌‌ షోలకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఉదయం 4 గంటల నుంచి 6 గంటల షోకు అనుమతించారు’’అని కోర్టుకు వివరించారు. కోర్టు జోక్యం చేసుకుని.. ‘‘సినిమా ఇప్పటికే విడుదలైనందున బెనిఫిట్‌‌‌‌ షోలపై ఉత్తర్వులివ్వలేం’’అని తెలిపారు.

దీనికి అడ్వకేట్ స్పందిస్తూ.. పెంచిన టికెట్ ధరలు ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వాదిస్తూ.. మల్టీప్లెక్స్‌‌‌‌ల్లో, సింగిల్‌‌‌‌ థియేటర్‌‌‌‌లలో 5 షోల వరకు అనుమతించవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి.. టికెట్ల ధరలపై ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశించారు.