హైదరాబాద్ ​లో ఫుట్​పాత్​లు లేక జనం అవస్థలు

హైదరాబాద్ ​లో ఫుట్​పాత్​లు లేక జనం అవస్థలు
  • ఫుట్​పాత్​లు లేక జనం అవస్థలు
  • 9,013 కిలోమీటర్ల రోడ్లకు..430 కి.మీ.కే ఫుట్​పాత్​లు
  • కొత్తవి నిర్మించరు..ఆక్రమణలను తొలగించరు
  • ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
  • ఏటా వేల యాక్సిడెంట్లు.. వందల మరణాలు


హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ​మహానగరంలో నడుచుకుంట పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే సిటీలో సరిగా ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు లేవు. ఎక్కడైనా ఉన్నా.. వాటిని వ్యాపారులు ఆక్రమించేశారు. సిటీ రోడ్లు 9,013 కిలోమీటర్లు ఉంటే అందులో 430 కిలోమీటర్లకు మాత్రమే ఫుట్​పాత్​లు ఉన్నాయి. మొత్తం రోడ్లలో10% కూడా లేకపోవడం గమనార్హం. వేల మంది పాదచారులు రోడ్లపైనే నడుస్తూ.. నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా అటు రాష్ట్ర సర్కారు, ఇటు జీహెచ్ఎంసీ దీన్ని సీరియస్​గా తీసుకోవడం లేదు. కొత్త ఫుట్​పాత్​ల నిర్మాణానికి, పాతవాటి ఆక్రమణల తొలగింపునకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

లేవు.. ఉన్న చోట్ల పనికిరావు

గ్రేటర్ ​హైదరాబాద్​పరిధిలో 2,846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6,167 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు ఉన్నాయి. చిన్న చిన్న సందులు, కాలనీల రోడ్లను వదిలేస్తే దాదాపు 4,500 కిలోమీటర్ల మేర ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌లు నిర్మించాల్సి ఉంది. కానీ నగరవ్యాప్తంగా ప్రస్తుతం 430 కిలోమీటర్ల ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌లు మాత్రమే ఉన్నాయి. పంజాగుట్ట, బేగంపేట్, అమీర్​పేట్,​ ఎర్రగడ్డ, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, కోఠి, ఆబిడ్స్, దిల్ సుఖ్‌నగర్ లాంటి రద్దీ ఏరియాల్లో ఎక్కడా ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లు లేవు. మెట్రోస్టేషన్ల వద్ద తప్పితే మిగతా చోట్ల లేవు. కొన్నిచోట్ల నిర్మించినప్పటికీ వాటి మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాయిలెట్లు, ఫీడ్ ది నీడ్ ఫ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌లు, స్టాల్స్, బస్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌లు ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల సర్కారు స్టాల్స్ తో పాటు పానీపూరి, చాట్‌‌‌‌‌‌‌‌బండార్, టేంపర్డ్ గ్లాస్ స్టాండ్, ఫాస్ట్ ఫుడ్ బండ్లు, బజ్జీలు, మిరపకాయల తోపుడుబండ్లు, టీకొట్లు, కూరగాయలు, బట్టలు, చెప్పులు, మెకానిక్‌‌‌‌‌‌‌‌ షాపులు ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లపైనే ఉంటున్నాయి. దీంతో పాదచారులు రోడ్లమీదనే ఇబ్బందులు పడుతూ నడవాల్సి వస్తోంది. 


నామ్‌‌‌‌‌‌‌‌కే వాస్తే డ్రైవ్‌‌‌‌‌‌‌‌లు.. 

ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, డ్రైవ్ లు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అలా కనిపించడం లేదు. డ్రైవ్ లు చేపట్టినా.. మళ్లీ రెండు రోజులకు ఎప్పటిలాగే ఆక్రమణలు జరుగుతున్నాయి. సిటీలోని ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్ ల పరిస్థితి, పాదచారుల అవస్థలమీద హైకోర్టు చాలాసార్లు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్లు హడావుడి చేసి.. ఆ తర్వాత వదిలేస్తున్నారు. హైకోర్టు సీరియస్ అయినప్పుడు ఉన్నవాటికే మెరుగులు దిద్దుతున్నారు తప్ప కొత్తవి నిర్మించడం లేదు.. ఆక్రమణలు పట్టించుకోవడం లేదు. 

పెరుగుతున్న ప్రమాదాలు

నగరవాసులు కొందరు రోడ్లపై పడే అవస్థలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఓ సిటిజన్ ‘వాట్ ఐ ఫేస్ ఎవ్రీడే యాజ్ ఏ పెడెస్ట్రియన్ ఇన్ హైదరాబాద్’  పేరుతో సిటిజన్స్ మ్యాటర్స్ అనే సైట్​లో తన కష్టాలు కళ్లకు కట్టారు. సిటీ రోడ్ల వల్ల ఏటా 200 మంది పాదచారులు చనిపోతున్నారని, సివిక్ అథారిటీలు దీన్ని పట్టించుకోవాలని రాసుకొచ్చారు. ఇలా నగరవాసులు రోడ్లమీద నడవడమే నరకంగా భావిస్తున్నారు. గత మూడు నెలల్లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 1,819 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 452 మంది చనిపోయారు. 1,760 మంది గాయాలపాలయ్యారు. అయినా అధికారులు ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం, నిర్వహణను పట్టించుకోవడంలేదు. 2021లో సిటీ 3 పోలీసు కమిషనరేట్ల పరిధిలో 150 మందికిపైగా పాదచారులు చనిపోయారు. చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ విషయంపై అధికారులను అడిగితే అవసరం ఉన్న చోట ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తున్నామని, మరమ్మతులు కూడా చేస్తున్నామని అంటున్నారు. 

ప్రమాదాలు జరుగుతున్నా చలనం లేదు..

రోడ్ల మీద నడవాలంటే ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌లే లేవు. ఏటా వందలమంది పాదచారులకు ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల్లో చలనం లేదు. మేం ప్రగతినగర్ లో ఉంటాం. అక్కడ సరైన రోడ్లు, ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లు లేవు. నడుచుకుంటూ వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నం. ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టాలి.
- సాయి తేజ, సోషల్ వర్కర్, ప్రగతినగర్

ఆక్రమణలను అడ్డుకోవాలె..

సిటీలో ఫుట్ పాత్‌‌‌‌‌‌‌‌లు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిని అడ్డుకోవాలి. రోడ్ల పక్కన ఇల్లు కట్టుకునేవారు కూడా తమ స్థలంలో కాంపౌండ్ కట్టుకుని రోడ్లమీద మెట్లు కడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ బెల్ట్ పేరుతో గోడ అవతల రెండు, మూడు అడుగుల విస్తీర్ణంలో మొక్కలు నాటుతున్నారు. ఇలా కూడా ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌లు పనికి రాకుండా పోతున్నాయి. ప్రజలు ముందుకొచ్చి వీటి గురించి మాట్లాడాలి. అధికారులతో పనులు చేయించుకోవాలి. 
- డా. రావ్ వీబీజే చెలికని, ప్రెసిడెంట్ యునైటెడ్–ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, తెలంగాణ