- రూ.5.61 కోట్లతో సమీకృత మోడల్‌మార్కెట్ నిర్మాణం
- నూతన మార్కెట్ ను వినియోగంలోకి తీసుకురావాలంటున్న ప్రజలు
- అపరిశుభ్రత నడుమ వీధులలోనే వ్యాపారాల నిర్వహణ
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5.61 కోట్లతో అధునాతన వసతులతో నిర్మించిన మోడల్ మార్కెట్ (సమీకృత వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్మార్కెట్) ను ఏండ్లు గడిచినా వినియోగంలోకి తీసుకురావడంలేదు. గతంలో పనులు పూర్తి కాకముందే అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్హడావుడిగా 2023లో మే30న ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. అప్పటికే పనులు పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో పెండింగ్ పనుల పూర్తి చేసేందుకు టైం పట్టింది. ఇటీవల పెండింగ్‌పనులు పూర్తైనా మోడల్మార్కెట్మాత్రం వినియోగంలోకి రావడం లేదు. దీంతో చిరు వ్యాపారులు రోడ్లపైనే కొనసాగిస్తున్నారు.
మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయినా..
2021లో అప్పటి ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని కొత్త బజార్ లో మూడు బ్లాకుల్లో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టింది. రాష్ట్రప్రణాళికా సంఘం, పట్టణ ప్రగతి, 14వ ఆర్థికసంఘం, పురపాలక సాధారణ నిధులు, ఎస్ డీఎఫ్ పథకాల ద్వారా నిధులు రూ.5.61 కోట్లు నిధులుమంజూరయ్యాయి. సకాలంలో ఫండ్ విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ ఆలస్యంగా పనులు ప్రారంభించారు. చేసిన పనులకు బిల్లులు రానందున కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నిలిపివేశారు.
ఇతర పథకాల ద్వారా నిధులు చెల్లించినా, సరిపోవడం లేదంటూ 20 శాతం పనులను వదిలివెళ్లారు. పూర్తిగా పనులు కాకముందే 2023 మే30న అప్పటి మంత్రి కేటీఆర్ భవనాన్ని ప్రారంభించారు. మోడల్ మార్కెట్ ఖాళీగా ఉండడంతో మద్యం ప్రియులకు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. మరోవైపు గాంధీ పార్కులో తాత్కాలిక కూరగాయల మార్కెట్నిర్వహిస్తుండగా, సభలు, వాకింగ్, క్రీడలకు వినియోగించాల్సిన పార్కు స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మోడల్‌మార్కెట్ సముదాయం ఇలా..
బ్లాక్ -1లో : కూరగాయలు, ఇతర దుకాణాలకు 38 గదులు. బ్లాక్-2లో : మాంసాహార విక్రయాలకు 37 గదులు. బ్లాక్-3లో : పూలు, పండ్లుదుకాణాలకు 37 గదులు కేటాయించడానికి నిర్ణయించారు. ఇటీవల మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ మోడల్ మార్కెట్‌ను పరిశీలించి, అసంపూర్తి పనులు, మార్కెట్లోకి కోతులు రాకుండా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సీడీఎఫ్ నుంచి రూ.90 లక్షలు మంజూరు చేశారు. ప్రస్తుతం మార్కెట్పనులు పూర్తయ్యాయి. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య వివాదంతో మోడల్మార్కెట్వినియోగంలోకి రావడం లేదు. షాపుల కేటాయింపులో అనుకూలమైన గదులు కేటాయిస్తామని కొందరుదళారులు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలుచేస్తున్నారు. అందరి సమక్షంలో డ్రాపద్ధతిలో దుకాణాలు కేటాయిస్తే వివాదాలుఉండవని చిరు వ్యాపారులు కోరుతున్నారు. సమీకృత మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్కమిషనర్ రవీందర్ తెలిపారు.
మోడల్ మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకురావాలి
మహబూబాబాద్జిల్లా కేంద్రంలో ప్రజల కోసం కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్మార్కెట్ను నిరుపయోగంగా ఉంచడం తగదు. వీధుల్లో అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు, నాన్‌వెజ్, పూలు, పండ్లు కొనుగోలు చేయవలసి వస్తుంది. మోడల్మార్కెట్ను తక్షణం వినియోగంలోకి తీసుకురావాలి.
షేక్ సలీమా,గృహిణి, మిలటరీ కాలనీ, మహబూబాబాద్